Begin typing your search above and press return to search.

పార్ల‌మెంటులోనూ క్యాస్టింగ్ కౌచ్‌

By:  Tupaki Desk   |   24 April 2018 11:49 AM GMT
పార్ల‌మెంటులోనూ క్యాస్టింగ్ కౌచ్‌
X

హాలీవుడ్‌లో మొద‌లైన కాస్టింగ్ కౌచ్ నిర్మూల‌న ప్ర‌క్రియ బాలీవుడ్‌లో కొన్ని రోజులు ప్ర‌కంప‌నలు సృష్టించింది. ఆ త‌ర్వాత టాలీవుడ్‌కి పాకింది. ప్ర‌స్తుతం కాస్టింగ్ కౌచ్‌పై అనేక మంది లేడి ఆర్టిస్టులు భిన్న స్వ‌రాలు వినిపిస్తుండ‌గా, దానిని అరిక‌ట్టేందుకు ఇటీవ‌ల 'మా' జాయింట్ యాక్ష‌న్ క‌మిటీని కూడా ఏర్పాటు చేసింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా రీసెంట్‌ గా “త్వరలోనే తెలుగు చిత్ర పరిశ్రమ ఆడపడుచుల ఆత్మగౌరవ పోరాట సమితి” ఏర్పాటుకి రంగం సిద్ధం చేస్తున్న‌ట్టు తెలిపారు. వీరికి జనసేన “వీరమహిళా”విభాగం అండగా ఉంటుందని కూడా పేర్కొన్నారు. అంటే లైంగిక వేధింపుల స‌మ‌స్య నుండి కాపాడేందుకు టాలీవుడ్‌ లో పెద్ద ప్ర‌ణాళిక‌లు రూపొందుతున్నాయి. అయితే ఇది దేశంలోనే అత్యున్న‌త చ‌ట్టస‌భలు అయిన పార్ల‌మెంటులోనూ ఉంద‌ని మ‌న తెలుగు ఎంపీ ఒక‌రు వ్యాఖ్యానించారు. ఈ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు రేణుకా చౌద‌రి.

బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందని వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత‌ రేణుకా చౌదరి స్పందిస్తూ ఈ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. `క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన అంశం మాత్రమే కాదు. అలాంటివి అన్ని చోట్లా జరుగుతుంటాయి. ఇది చేదు వాస్తవం` అని ఆమె అన్నారు. `పార్లమెంట్ లేదా ఇతర పని ప్రాంతాల్లో వేధింపులు ఉండవన్న అభిప్రాయం సరికాదు. క్యాస్టింగ్ కౌచ్ లాంటి వాటికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం రావాలని, దానికి వ్యతిరేకంగా పోరాడాలని` అని అన్నారు. హాలీవుడ్‌లో సాగుతున్న మీటూ ప్రచారం తరహాలో బాధితులు పోరాడాలని రేణుకా చౌద‌రి పిలుపునిచ్చారు.

కాగా, 2000 సాంగ్స్‌కి కొరియోగ్రాఫ‌ర్‌ గా పని చేసిన 69ఏళ్ళ స‌రోజ్ ఖాన్‌ ని మీడియా ప్ర‌తినిధులు కాస్టింగ్ కౌచ్‌ పై ప్రశ్నించ‌గా...`ఒక్క సినిమా రంగంలోనే ఇది లేదు అన్ని రంగాల‌లోను ఉంది. ప్రభుత్వ శాఖల్లో కూడా వేధింపుల ఉదంతాలు ఉన్నాయి కదా?` అని ఆమె వ్యాఖ్యానించారు. `అయినా దీని వ‌ల‌న కొంద‌రికి తిండి దొరుకుతుంది. అస‌లు అమ్మాయిలు అమ్ముడుపోవాల్సిన అవసరమేముంది , టాలెంట్ ఉంటే ఆఫ‌ర్స్ అవే వెతుక్కుంటూ వ‌స్తాయి. కాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారాల్లో అమ్మాయిల నిర్ణయమే కీలకం. మళ్లీ చెబుతున్నా.. ఇది ఒక్క సినిమా రంగానికే సంబంధించిన వ్యవహారమే కాదు యావత్‌ సమాజానికి సంబంధించింది. దయచేసి ఇండ‌స్ట్రీని బ్లేమ్ చేయోద్దు అని కోరుతున్నాను` అని స‌రోజ్ ఖాన్ అన్నారు.