Begin typing your search above and press return to search.

బాబోయ్‌.. సీఎం రేసులో లేను

By:  Tupaki Desk   |   21 Dec 2017 5:03 AM GMT
బాబోయ్‌.. సీఎం రేసులో లేను
X
కొన్ని వార్త‌లు వ‌స్తే దాని మైలేజీ దానికి ఉంటుంది. కానీ.. కొన్ని వార్త‌లు ఇమేజ్‌ను డ్యామేజ్ చేయ‌ట‌మే కాదు లేనిపోని ఇబ్బందుల‌కు గురి చేసేలా ఉంటుంది. ప్ర‌స్తుతం అలాంటి ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీ. గుజ‌రాత్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డి.. బొటాబొటి సీట్ల‌తో విజ‌యాన్ని సాధించిన బీజేపీ.. ఇప్పుడా రాష్ట్రానికి చాకులాంటి సీఎం కోసం వెతుకుతోంది.

ఇందులో భాగంగా కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీ పేరు తెర మీద‌కు వ‌చ్చింది. వాస్త‌వానికి ఈ వార్త‌ను ప్ర‌చారం చేసింది.. గుజ‌రాత్ సీఎం రేసులో ఉన్నారంటూ ప్ర‌ముఖ మీడియా సంస్థ ఇండియా టుడే గ్రూపు నుంచి వార్త వ‌చ్చింది. ఇటీవ‌ల కాలంలో కాస్త చిత్రంగా అనిపించినా.. కొత్త త‌ర‌హాలో వార్త క‌నిపించినంత‌నే.. మ‌రో ఆలోచ‌న లేకుండా వార్త‌లు తెలుగీక‌రించి వేసేస్తున్న మీడియా సంస్థ‌ల పుణ్య‌మా అని.. ఇప్ప‌టికే స్మృతి వార్త‌ను ప‌లు తెలుగు మీడియా సంస్థ‌లు టెలికాస్ట్ చేసేశాయి.

అయితే.. ఇలాంటి ధోర‌ణి ఒక్క తెలుగు మీడియాకు మాత్ర‌మే ప‌రిమితం కాలేదు. చాలానే రాష్ట్రాల్లోను ఇలాంటి ప‌రిస్థితే నెలకొంది. దీంతో.. స్మృతి పేరు గుజరాత్ సీఎం రేసులో ఉన్నార‌న్న ప్ర‌చారం అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఏ యాంగిల్ లో చూసినా స్మృతికి గుజ‌రాత్ సీఎం ఛాన్స్ లేన‌ప్ప‌టికీ ఆమె పేరు ప్ర‌ముఖంగా రావ‌టంతో రియాక్ట్ అయ్యారు. తాను గుజ‌రాత్ సీఎం రేసులో లేనంటే లేన‌ని తేల్చేశారు.

తాను సీఎం అభ్య‌ర్థి రేసులో ఉన్నాన‌న్న వార్త‌లో ఏ మాత్రం నిజం లేద‌న్న ఆమె.. ఇలాంటి అసత్య వార్త‌ల్ని సృష్టించొద్ద‌ని కోరుతున్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌స్తుతం ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న విజ‌య్ రూపానీ కొన‌సాగుతారా? లేదా? అన్న విష‌యం త‌న‌కు తెలీద‌న్నారు. ఇదిలా ఉండ‌గా.. ఈ నెల 25న గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా సీఎంగా ఎంపిక చేసిన నేత ప్ర‌మాణ‌స్వీకారం చేస్తార‌ని చెబుతున్నారు. ఊహించిన‌దానికి భిన్నంగా గుజ‌రాత్ లో ఫ‌లితాలు వెలువ‌డిన నేప‌థ్యంలో సీఎం ఎంపిక విష‌యంలో మోడీ అండ్ కో మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్న‌ట్లుగా తెలుస్తోంది.