Begin typing your search above and press return to search.

మంత్రి ప‌ద‌వికి నేనెప్పుడు రాజీనామా చేశాను?

By:  Tupaki Desk   |   1 Sep 2017 1:45 PM GMT
మంత్రి ప‌ద‌వికి నేనెప్పుడు రాజీనామా చేశాను?
X
మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ భారీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు సన్నాహాలుచేస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం చైనా వెళ్లే లోపు ప్ర‌ధాని కొత్త క్యాబినెట్‌ ను నిర్ణ‌యిస్తార‌ని వెల్ల‌డ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో శ‌నివారం కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చోటుచేసుకోనున్న నేప‌థ్యంలో ముగ్గురు కేంద్ర మంత్రులు రాజీనామా చేసిన‌ట్లు తెలుస్తోంది. కేంద్ర‌ జ‌ల‌వ‌న‌రుల మంత్రి ఉమాభార‌తి - స‌హాయ మంత్రి రాజీవ్ బాల్య‌న్ -త‌మ మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన‌ట్లుగా పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయి. ఈ విష‌యమై ఆయా మంత్రులు మాట్లాడుతూ భిన్న‌మైన రీతిలో స్పందించారు.

మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన అంశంపై మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ ప్ర‌తాప్ రూడీ మీడియాతో మాట్లాడుతూ రాజీనామా త‌న నిర్ణ‌యం కాదు అని, అది పార్టీ నిర్ణ‌య‌మ‌ని తెలిపారు. అయితే గ‌త వార‌మే పార్టీ అధ్య‌క్షుడు అమిత్ షాతో క‌లిసాన‌ని, ఆయ‌నకు త‌న రాజీనామా అంశాన్ని కూడా వివ‌రించిన‌ట్లు రూఢీ చెప్పారు. స్కిల్ డెల‌వ‌ల‌ప్‌ మెంట్ మంత్రిగా ఉన్న ఆయ‌న నిన్న త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. క‌ర్నాట‌క‌ - గుజ‌రాత్‌ లో రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం రూడీ ప‌నిచేసే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌ను ఉమాభార‌తి ఖండించారు. అస‌లు ఆ అంశం త‌న దృష్టికే రాలేదు అన్న‌ట్లు ఆమె చెప్పారు. రాజీనామా అంశంపై తానేమీ మాట్లాడ‌లేన‌న్నారు.

ఇదిలాఉండ‌గా... పలువురు కేంద్రమంత్రులు రాజీనామా చేసినట్లు జాతీయ మీడియా జోరుగా ప్ర‌చారం చేసింది. కేంద్రమంత్రులు రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ - ఉమాభారతి - సంజీవ్ బల్యాన్ - కల్‌ రాజ్‌ మిశ్రా - మహేంద్రపాండే - గిరిరాజ్ రాజ్ సింగ్ తమ మంత్రి పదవులకు రాజీనామా చేసినట్లు వార్త‌లు వెలువ‌రించింది. కేంద్రమంత్రి వర్గ పునర్‌ వ్యవస్థీకరణ నేపథ్యంలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు - ఎంపీ కంభంపాటి హరిబాబుకు కేంద్ర కేబినెట్‌ లో చోటు దక్కే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరుపతి పర్యటన నుంచి ఢిల్లీకి తిరిగివచ్చిన తర్వాత శనివారం మంత్రివర్గ విస్తరణ ఉంటుందని భావిస్తున్నారు.