Begin typing your search above and press return to search.

ఎల్లో మీడియా కాదు... నారా మీడియా?

By:  Tupaki Desk   |   8 Sep 2022 10:30 AM GMT
ఎల్లో మీడియా కాదు... నారా మీడియా?
X
ఏపీలో ఎల్లో మీడియా అన్న పదం తెగ పాపులర్ గా ఉంటూ వస్తోంది. రాజకీయాల గురించి ఓనమాలు తెలియని వారికి కూడా ఈ పదం బాగా తెలుసు. అంతలా ఈ పదాన్ని పాపులర్ చేసిన ఘనత మాత్రం అచ్చంగా వైసీపీదే. వైసీపీ విపక్షంలో ఉన్నప్పటి నుంచి మొదలెట్టిన ఎల్లో మీడియా ప్రచారం ఇపుడు మంచి పీక్స్ లో ఉంది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ మీడియాను నీలి మీడియా అంటూ టీడీపీ సహా విపక్షాలు ఎదురు విమర్శలు చేస్తున్నాయి. అది వేరే విషయం అనుకున్నా ఇపుడు ఎల్లో మీడియా అంటూ ఆటలాడుకున్న వైసీపీకి గట్టి రిటార్ట్ ఇవ్వడానికి టీడీపీ రెడీ అవుతోంది అని అంటున్నారు.

ఎటూ రాజకీయం అనే క్రీడలోకి దిగిపోయాక గొంగట్లో కూర్చుని వెంట్రుకలు ఏరుకోవడం ఎందుకు అన్న ఆలోచనతోనో మరో దానికో కానీ టీడీపీ కూడా సొంత మీడియా దిశగా వేగంగా అడుగులు వేస్తోంది అని అంటున్నారు. టీడీపీకి ఇన్నాళ్ళూ సొంత మీడియా అంటూ లేదు. ఏపీలో టీడీపీ సామాజికవర్గానికి చెందిన వారే ఆ పార్టీని భుజాన మోస్తున్నారు. అది ఇవాళా నిన్నా ముచ్చట కానే కాదు, ఎన్టీయార్ రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతోనే గుత్తకు తీసుకుని ఈ రోజు వరకూ ఆ పార్టీ కాపు కాస్తున్న కొందరు మీడియా మోతుబరులు ఉన్నారు.

ఉభయకుశలోపరిగా అటూ ఇటూ కూడా దీని వల్ల పూర్తిగా బాగుపడ్డారు కూడా. అయితే ఇపుడు ఎల్లో మీడియా నుంచి వేరుపడి టీడీపీ సొంత మీడియా పెట్టుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది అంటే దానికి కూడా లెక్కలు ఉన్నాయి. ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలు జనాలు నమ్మడం మానేసి చాలా కాలం అయింది అన్న మాట ఉంది. . ఇది ఒక కారణం అయితే ఎటూ పార్టీకి ఒక మీడియా అని ఏపీలో ఉంది. తమిళనాడు కల్చర్ కూడా ఏపీలోకి వచ్చేసింది.

జనాలు కూడా వీటిని సీరియస్ గా పట్టించుకోవడంలేదు. దాంతో మనమే సొంతంగా ఒక మీడియాను పెట్టుకుంటే పోలా అన్న ఆలోచనలు చినబాబుకు వస్తున్నాయని అంటున్నారు. దీంతో లోకేష్ తొందరలోనే ఒక పేపర్ తో పాటు టీవీ చానల్ కూడా స్టార్ట్ చేస్తారు అని అంటున్నారు. దానికి ప్రధాన కారణం సాక్షి పేపరే జగన్ని పొలిటికల్ సూపర్ స్టార్ గా చేసింది అన్న భావన ఉండడమే. అది నిజం కూడా సాక్షి కనుక లేకపోతే జగన్ గురించి ఏపీలో రాసే పత్రికలు, చూపించే మీడియా బహుశా కనిపించవు అనే అంటారు.

ఇక మరో విషయం ఏంటి అంటే జగన్ ఏపీలో 151 సీట్లు సాధించి సీఎం కావడానికి కూడా ఆయన వెనక బలమైన సొంత మీడియా ఉందని టీడీపీ సహా విపక్షాలు నమ్ముతున్నాయి. జగన్ పాదయాత్ర చేశారు. దాన్ని కూడా ఫుల్ గా కవర్ చేస్తూ జగన్ మీడియా హైలెట్ చేస్తూ జనాలలో భారీ ఇంప్రెషన్ కలిగించింది. మరో వైపు చూస్తే ఏపీలో ఎల్లో మీడియా ఉంది కానీ ఇపుడు బీజేపీ వాటి మీద ఫుల్ ఫోకస్ పెట్టేసింది అన్న ప్రచారం ఉంది.

ఈ మధ్యనే కేంద్ర పెద్ద ఒకరు వచ్చి ఒక తెలుగు మీడియా టైకూన్ తో భేటీ అయి వెళ్ళారు. వారికి అనుకూలంగా మీడియా పనిచేయాలని చెప్పడం కోసమే ఈ భేటీ జరిగింది అని అంతా అంతారు. ఈ సంగతి ఇలా ఉంటే ఎల్లో మీడియాకు బీజేపీ నుంచి బెదిరింపులు వస్తున్నాయని టీడీపీ గట్టిగా నమ్ముతోందిట. ఈ పరిణామాల నేపధ్యంలో సొంతంగా తామే ఒక మీడియా హౌజ్ ని స్టార్ట్ చేసే పోలా అని లోకేష్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

ఈ విషయంలో చంద్రబాబు మాత్రం సొంత మీడియా వద్దు అనే అంటున్నారుట. అయినా లోకేష్ సహా ఆయన కుటుంబ సభ్యులు మాత్రం తమ ధోరణిలోనే ముందుకు సాగుతున్నారని అంటున్నారు. ఇక ఈ పేపర్ కి నిజం అని పేరు పెట్టాలని కూడా దాదాపుగా నిర్ణయించారని అంటున్నారు. దాంతో పాటు ఎన్టీయార్ అన్న పేరు కూడా మరోటి సీరియస్ గానే పరిశీలిస్తున్నారు అని అంటున్నారు.

ఇక ఈ పేపర్ కి సంబంధించి కసరత్తు కూడా తెర వెనక జోరుగా సాగుతోంది అని అంటున్నారు. ఇప్పటికే తమిళనాడుకు చెందిన పేపర్ లో ఉన్న ఒక యువ ఎడిటర్ ని తమ పేపర్ ని నడిపేందుకు ఎంపిక చేసుకున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా టీడీపీ సొంతంగా పేపర్ పెడుతోంది అంటూ వస్తున్న వార్తలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. చంద్రబాబు ఇప్పటిదాకా ఒకటే ప్రచారం జనాల్లో చేస్తూ వచ్చారు. దాన్ని నమ్మిన వారూ ఉన్నారు.

నాకంటూ ఏమైన సొంత పేపర్ ఉందా నా చేతికి వాచీ కూడా ఉండదు అని బాబు చెప్పుకునే వారు. జగన్ని చూపించి మరీ ఆయన ఈ విధంగా విమర్శలు చేసేవారు. రేపటి రోజున చంద్రబాబు కుమారుడు కనుక సొంత పేపర్ తో వస్తే కనుక బాబుకు ఈ సెటైర్లు వేసే చాన్స్ పోతుంది. అంతే కాదు ఏపీలో పార్టీల మాదిరిగా మీడియా కూడా మరింతగా చీలిపోయే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ఈ కొత్త పేపర్ లోకేష్ కోసమే అని కూడా వార్తలు వస్తున్నాయి.

ఎల్లో మీడియా కూడా చంద్రబాబు వరకూ మాత్రమే రాస్తోంది. ఆయన పుత్రరత్నం లోకేష్ కి హైప్ క్రియేట్ చేయడం లేదు అన్న బాధ కూడా ఉంది అంటున్నారు. లోకేష్ కి అయితే తానే ఫ్యూచర్ లీడర్ అన్న ఆలోచన ఉంది. ఆయన అనుచరులు కూడా గట్టిగా దాన్నే నమ్ముతారు. కానీ ఎల్లో మీడియాకు మాత్రం టీడీపీ బాబు చేతుల్లో ఉంటేనే సేఫ్ అన్న మాట ఉంది. దాంతో లోకేష్ విపక్షంలోకి వచ్చి మూడేళ్ళ పాటు పోరాటాలు చేస్తున్నా మూడేళ్ళు మంత్రిగా ఉన్నా కూడా ఇపుడు పెద్దగా ఫోకస్ అవడంలేదు. దీంతో చినబాబు పత్రిక అయితే ఆయన్నే పెద్ద నాయకుడిగా చూపిస్తుంది అన్న ఆలోచనలు కూడా ఉన్నాయట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.