Begin typing your search above and press return to search.

రాజ‌ధాని మ‌రో రికార్డు సాధించింది

By:  Tupaki Desk   |   8 Jan 2016 10:17 AM GMT
రాజ‌ధాని మ‌రో రికార్డు సాధించింది
X
తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న బ‌ల్దియా ఎన్నిక‌ల ద్వారా కొత్త‌ రికార్డును గ్రేట‌ర్ హైద‌రాబాద్ త‌న ఖాతాలో జ‌మ‌చేసుకోనుంది. ఎన్నికల్లో అభ్యర్థులెవరూ నచ్చని పక్షంలో.. వారెవరికీ ఓటు వేయడం లేదని పేర్కొనే నోటా (NONE OF THE ABOVE) ఆప్ష‌న్‌ జీహెచ్‌ ఎంసీ ఎన్నిక‌ల్లో తొలిసారిగా అమలు కానుంది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో ఎన్నికల సంఘం ఈవీఎంల‌లో నోటాకు స్థానం క‌ల్పించింది. దేశంలోనే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో నోటాను ప్ర‌వేశ‌పెట్ట‌డం హైద‌రాబాద్‌ లోనే తొలిసారి.

ఎన్నికల్లో సంస్కరణలు, ఓటింగ్ శాతాన్ని పెంచడం కోసం ఎన్నికల సంఘానికి ఆదేశాలివ్వాలని కొన్ని స్వచ్ఛంద సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. కేసు విచారణ సమయంలో నన్ ఆఫ్ దీస్ ఎబోవ్‌(నోటా)ను అమలు చేయవచ్చని 2009లోనే ఎన్నికల సంఘం సుప్రీం కోర్టుకు తెలిపింది. కానీ, ఈ ప్రతిపాదనను అప్పుడున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం తిరస్కరించింది. కానీ, సివిల్ సొసైటీ, ఎన్జీవోలు తిరిగి సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేశాయి. దీంతో 2013 సెప్టెంబర్ 27న నోటాను అమలు చేయాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. నోటాను అమలు చేయడం ద్వారా ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచవచ్చని, వ్యవస్థీకృతమైన మార్పును ఆశించవచ్చని, రాజకీయ పార్టీలు సైతం సచ్ఛీలత కలిగిన అభ్యర్థులనే నిలబెట్టడానికి ముందుకు వస్తాయని సుప్రీం కోర్టు బెంచ్‌ అభిప్రాయపడింది. దీంతో నోటాకు ప్రాధాన్యం లభించింది.

అయితే ఇప్ప‌టివ‌ర‌కు నోటాను సార్వ‌త్రిక‌, శాస‌న‌స‌భా ఎన్నిక‌ల్లో మాత్ర‌మే ఉప‌యోగించేవారు. తాజాగా మొద‌టిసారి హైద‌రాబాద్‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో నోటాను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. రాజ‌కీయ పార్టీల తీరు, అభ్య‌ర్థుల‌పై అసంతృప్తి ఉన్న‌వారు నోటాతో త‌మ అక్క‌సును వెళ్ల‌గ‌క్కే అవ‌కాశం భారీగానే ఉంద‌ని ఇప్ప‌టికే రాజ‌కీయ పార్టీలో ఆందోళ‌న ప్రారంభం అవ‌డం మొత్తం ఎపిసోడ్‌ లో అస‌లు ట్విస్ట్‌.