Begin typing your search above and press return to search.

వావ్.. 17 లక్షల మంది నోటాకు ఓటేశారు

By:  Tupaki Desk   |   22 May 2016 9:52 AM GMT
వావ్.. 17 లక్షల మంది నోటాకు ఓటేశారు
X
నన్ ఆఫ్ ద అబోవ్.. షార్ట్ గా చెప్పాలంటే ‘నోటా’. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులెవరూ తమకు నచ్చకపోతే ఓటర్లు ‘నోటా’ నొక్కొచ్చు. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ప్రవేశ పెట్టిన ఈ కొత్త ఆప్షన్ ను మొదట జనాలు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. కానీ ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. జనాలు ‘నోటా’ను బాగానే ఉపయోగించుకుంటున్నారు. మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఏకంగా 10 లక్షల మంది ఈ ఆప్షన్ ఉపయోగించుకోవడం విశేషం. ఐదు రాష్ట్రాలకు నాలుగు రాష్ట్రాల్లో ఒక శాతం కంటే ఎక్కువ ఓట్లు నోటాకు పడటం గమనార్హం. మున్ముందు నోటా ప్రభావం బాగానే ఉండబోతోందన్న సంకేతాలిచ్చాయి ఈ ఎన్నికలకు సంబంధించిన గణాంకాలు.

పశ్చిమ బెంగాల్ లో ఏకంగా 8.32 లక్షల మంది నోటాకు ఓటు వేయడం విశేషం. మొత్తం ఓట్లలో 1.52 శాతం మంది నోటా నొక్కడం విశేషం. బెంగాల్‌ లోని చాలా నియోజకవర్గాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌ - ప్రతిపక్ష వామపక్ష-కాంగ్రెస్ కూటమి - బీజేపీల తర్వాత అత్యధిక ఓట్లు నోటాకే పడ్డాయి. దీంతో 'నోటా'నే నాలుగో పోటీదారుగా చాలాచోట నిలిచింది. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన బీఎస్పీ - సీపీఐ - ఫార్వర్డ్‌ బ్లాక్‌ - ఎస్‌ యూసీఐ - స్వతంత్ర అభ్యర్థుల కంటే కొన్నిచోట్ల నోటాకే అధిక ఓట్లు రావడం గమనార్హం. ఇక తమిళనాట ఏకంగా 5.6 లక్షల మంది అంటే 1.3 శాతం మంది ‘నోటా’కు పట్టం కట్టారు. అస్సాంలో 1.87 లక్షలమంది (1.12 శాతం) ‘నోటా’కు ఓటేశారు. ఐతే విద్యావంతులు ఎక్కువగా ఉన్న కేరళలో నోటా ప్రభావం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కొంచెం తక్కువే ఉంది. ఇక్కడ 1.07 లక్షల మంది (0.53 శాతం) ఈ ఆప్షన్ వినియోగించుకున్నారు. మొత్తంగా నాలుగు రాష్ట్రాల్లో కలిపి 17 లక్షల మంది ‘నోటా’కు ఓటేయడం విశేషం.