Begin typing your search above and press return to search.

పొద్దు పొద్దున్నే సీఐడీ...చేతిలో ఏం పెట్టారంటే... ?

By:  Tupaki Desk   |   12 Jan 2022 7:48 AM GMT
పొద్దు పొద్దున్నే సీఐడీ...చేతిలో ఏం పెట్టారంటే... ?
X
గుమ్మంలో పండుగ ఉంది. అది అలాంటి ఇలాంటిది కాదు, అతి పెద్ద సంక్రాంతి పండుగ. దాంతో ఆ సందడి కోసం అందరూ రెడీ అవుతారు. అలాగే వైసీపీ రెబెల్ ఎంపీ రాజు గారు కూడా ఢిల్లీ నుంచి ఫ్లైటేసుకుని మరీ హైదరాబాద్ లోని తన ఇంట్లో వాలిపోయారు. తెల్లారి సొంతూరు భీమవరం వెళ్ళాలనుకుంటున్నారు. ఆ సందడిలో ఆ హడావుడిలో ఇంట్లో అంతా ఉండగానే పొద్దు పొద్దున్నే ఏపీ సీఐడీ అధికారులు వచ్చి రాజు గారి ఇంటి గుమ్మంలో నిలబడ్డారు.

రేపే విచారణ రావాల్సిందే అంటూ హల్ చల్ చేశారు, కొంత సేపు హై డ్రామా కూడా నడిపారు. మీ నోటీస్ నేను తీసుకుంటాను అని రాజు గారి కొడుకు వచ్చినా నో చెప్పారు. రఘురామే రావాలని కోరారు. దాంతో రాజు గారి లాయర్లు వచ్చి వారితో ముచ్చటించాక మొత్తానికి నోటీసులను అయితే ఇచ్చేశారు.

అయితే ఇవాళ నోటీసులు ఇచ్చి రేపు విచారణ ఏంటి అంటూ న్యాయవాదులు బాగానే అడిగాక సరే సరే ఈ నెల 17న విచారణకు రండి అంటూ ఏపీ సీఐడీ అధికారులు చెప్పి వెళ్ళిపోయారు. మొత్తానికి రఘురాముడు ఒక వైపు సంక్రాంతి పందెం కోడి మాదిరిగా అంతా సిద్ధం చేసుకుని వెళ్ళక వెళ్ళక రెండేళ్ల తరువాత వెళ్తూంటే గుమ్మంలో సీఐడి అధికారులు ఏంటి అని ఆయనతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా టెన్షన్ పడుతున్నారు.

అయితే దీని మీద రాజు గట్టిగానే రియాక్ట్ అయ్యారు. తాను చట్టాన్ని గౌరవించి విచారణకు హాజరవుతానని చెప్పారు. విచారణకు సహకరిస్తాను అని కూడా అన్నారు. అదే సమయంలో జగన్ సర్కార్ మీద పంచులే పేల్చారు. సంక్రాంతి పండుగ అంటే ఈ ముఖ్యమంత్రికి సీఐడీ అధికారులకు తెలియదు అంటూ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పండుగ పెట్టుకుని విచారణ ఏంటి అని కూడా అనేశారు. మొత్తానికి రాజు గారు ఇలా హైదరాబాద్ లో ల్యాండ్ అవగానే అలా సీఐడీ అధికారులు ఏపీ నుంచి వచ్చారూ అంటే ప్లాన్ బాగానే ఉంది కదా.

అప్పట్లో ఆయన పుట్టిన రోజు పూటా విచారణ పేరిట తీసుకెళ్లారు. అది పెద్ద వివాదం అయింది. రాత్రి అంతా జైలులో పెట్టి మరీ హింసించారని రాజు ఈ రోజుకీ గుండెలు బాదుకుని మరీ మీడియా ముందు చెబుతారు. ఇపుడు మళ్ళీ సంక్రాంతి పండుగ కూడా చేసుకోనీయరా ఏంటీ విచారణ అని అంటున్నారు. ఏది ఏమైనా ఈసారి కాస్తా తగ్గి డేట్ ని 17ని ఫిక్స్ చేసి సీఐడీ అధికారులు వెనుదిరగడం మాత్రం కాస్తా ఫెస్టివల్ మసాలాను తగ్గించినట్లుగానే ఉంది. అయినా రాజు గారు అసలు కధను అంతా భీమవరంలో చూపిస్తాను అంటున్నారుగా. చూడాలి మరి.