Begin typing your search above and press return to search.

అమిత్ షాకు నోటీసులా? కేసీఆర్ మరో సంచలనం?

By:  Tupaki Desk   |   23 Nov 2022 6:37 AM GMT
అమిత్ షాకు నోటీసులా? కేసీఆర్ మరో సంచలనం?
X
తెలంగాణ సర్కార్ మరో సంచలనానికి తెరతీయబోతోందా? ఏకంగా కేంద్ర హోంమంత్రి, పోలీస్ బాస్ అయిన అమిత్ షాకే నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తోంది. తెలంగాణలోని టీఆర్ఎస్ మంత్రులపై ఐటీ, ఈడీ దాడుల నేపథ్యంలో ఈ మేరకు ప్రతీకారానికి కేసీఆర్ రెడీ అవుతున్నట్టు ప్రచారం సాగుతోంది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిట్ అధికారులు మరో ఇద్దరికీ నోటీసులు అందించారు. అంతేకాదు మరో సంచలనానికి తెరతీయబోతున్నట్టు సమాచారం. నిందితుడు నందకుమార్ భార్య చిత్రలేఖ, అంబర్ పేటకు చెందిన న్యాయవాది ప్రతాప్ గౌడ్ లకు బుధవారం సిట్ నోటీసులు ఇచ్చారు. ఇవాళ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

ఈ కేసు దర్యాప్తులో దూకుడు మీదన్న సిట్ వరుసపెట్టి నిందితులతో సంప్రదింపులు జరిపి వారికి నోటీసులు జారీ చేస్తోంది. ఇప్పటికే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళ డాక్టర్ జగ్గు స్వామి, భారతీయ ధర్మ జనసేన చీఫ్ తుషార్, బండి సంజయ్ బంధువు, కరీంనగర్ న్యాయవాదికి నోటీసులు ఇచ్చింది. అయితే శ్రీనివాస్ మినహా బీఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్ హాజరుకాలేదు. దీంతో వీరి ముగ్గురికి లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు.

ఈ కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విచారణకు రాకపోవడంతో అరెస్ట్ చేయాలా? హైకోర్టుకు ఎక్కి అనుమతి కోరాలా? అన్న విషయంలో న్యాయ నిపుణులతో సిట్ అధికారులు చర్చలు జరుపుతున్నారు. విచారణకు హాజరుకాని విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లి అరెస్ట్ వారెంట్ జారీ చేయించుకొని అరెస్ట్ చేసే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. దీనికోసం న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు.త్వరలోనే ముగ్గురిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం.

ఇక ఈ ముగ్గురితోపాటు నిందితులు ప్రస్తావించిన దాంట్లో అమిత్ షా పేరు కూడా వచ్చింది. దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని.. ఈ విషయంపై కూడా న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. మరి ఈ ప్రయత్నం చేస్తుందా? చేస్తే దేశవ్యాప్తంగా పెను సంచలనం అవుతుంది. దీనిపై కేసీఆర్ సర్కార్ ఎలా ముందుకెళుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.