Begin typing your search above and press return to search.

24 గంటల డెడ్ లైన్.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు నోటీసులు

By:  Tupaki Desk   |   16 Feb 2022 3:30 PM GMT
24 గంటల డెడ్ లైన్.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు నోటీసులు
X
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి నేతృత్వంలోని బీజేపీకి ఓటు వేయకపోతే బుల్ డోజర్లతో వారి ఇళ్లను తొక్కిస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేసిన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ‘హిందువులందరూ ఏకం కావాలి. హిందువులంతా యోగి ఆదిత్యనాథ్ కు ఓటు వేయాల్సిందేనని పిలుపునిచ్చిన రాజాసింగ్ చిక్కుల్లో పడ్డారు.

ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ వందల సంఖ్యలో బుల్ డోజర్లు, జేసీబీలకు ఆర్డర్ ఇచ్చారని.. వాటిని తెప్పిస్తున్నారని చెప్పారు. బుల్ డోజర్లు, జేసీబీలను ఎందుకు తెప్పిస్తున్నారో తెలుసా? యోగికి ఓటు వేయని వారిని గుర్తించి వారి ఇళ్లపైకి వందల సంఖ్యలో వాటిని పంపిస్తామని రాజాసింగ్ హెచ్చరించారు.

యోగి ఆదిత్యనాథ్ కు ఓటు వేయాల్సిందేనని.. ఆయనకు ఓటు వేయని ద్రోహులకు ఉత్తరప్రదేశ్ లో స్థానం లేదని స్పష్టం చేశారు.యోగికి ఓటు వేయని వారిని తరిమి కొడుతామని హెచ్చరించారు. ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ ఈ మేరకు రంగం సిద్ధం చేశారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

యోగి ఆదిత్యనాథ్ ను ఇష్టపడని ప్రాంతాల్లో భారీగా పోలింగ్ నమోదైందని రాజాసింగ్ గుర్తు చేశారు.యోగిని ముఖ్యమంత్రిగా అంగీకరించని వారు ఇళ్లలో నుంచి బయటకు వచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని.. ఈ పరిస్థితిని అడ్డుకోవడానికి హిందూ బంధువులందరూ మిగిలిన ఐదు దశల్లో పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని రాజాసింగ్ పిలుపునిచ్చారు. భారీగా ఓట్లు వేయాలని సూచించారు.

యూపీలోని ఓటర్లు తమ పార్టీకి ఓటు వేయాలని.. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరింపులకు పాల్పడినందుకు తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ కు ఈసీ నోటీసులు జారీ చేసింది.

ఐపీసీ, ఆర్పీ చట్టం , ఎన్నికల మోడల్ కోడ్ ఉల్లంగించినందుకు అతడిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీనికోసం ఎమ్మెల్యే రాజాసింగ్ కు 24 గంటల సమయం కూడా ఈసీ ఇచ్చింది.

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్ తోపాటు గోవా, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్ సోమవారం ముగిసింది. ఫిబ్రవరి 20, 23, 27 మార్చి 3, 7వ తేదీల్లో యూపీలో మిగిలిన దశల్లో పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.