Begin typing your search above and press return to search.

కవితకు నోటీసులు.. సీబీఐ ఏమని చెప్పింది?

By:  Tupaki Desk   |   3 Dec 2022 2:30 AM GMT
కవితకు నోటీసులు.. సీబీఐ ఏమని చెప్పింది?
X
ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవితకు సంబంధం ఉందన్న మాట. ఆ తర్వాత అందులో ఆమె పాత్ర ఉందన్న వాదనలు. మొన్నటికి మొన్న రిమాండ్ నోట్ లో కవిత పేరు రావటం. తాజాగా ఆమెకు సీబీఐ నుంచి నోటీసులు జారీ చేయటంలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన పేరును ప్రస్తావించటం.. లేనిపోని మాటలు అనకుండా ఉండేందుకు వీలుగా నాంపల్లి కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్న కవితకు.. తాజా పరిణామాలు కాస్తంత ఇబ్బంది కలిగించేవే అన్న మాట వినిపిస్తోంది.

ఇక.. తాజాగా జారీ చేసిన నోటీసుల్ని చూస్తే.. సీఆర్ పీసీ సెక్షన్ 160 కింద ఢిల్లీకి చెందిన సీబీఐ అవినీతి నిరోధక విభాగం డీఎస్పీ అలోక్ కుమార్ షాహి తాజా నోటీసుల్ని జారీ చేశారు. ఢిల్లీలో నమోదు చేసిన ఆర్ సీ 53(ఎ)/2022 కేసులో దర్యాప్తులో భాగంగా ఈ నోటీసులు జారీ చేసినట్లుగా చెబుతున్నారు. ఇంతకూ కవితకు జారీ చేసిన నోటీసుల్లో ఏముంది? ఇప్పుడేం జరగనుంది? అన్నది ప్రశ్నగా మారింది.

నోటీసుల్లో ఉన్నది ఇదే..'కేసు దర్యాప్తులో భాగంగా డిసెంబరు ఆరు ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ లో కానీ ఢిల్లీలో కానీ మీ నివాసంలో విచారించాలని అనుకుంటున్నాం. మీకు ఎక్కడ సౌకర్యంగా ఉంటుందో దయచేసి తెలియజేయండి. కేంద్ర హోంశాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ రాయ్ నుంచి వచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియాతో పాటు మరో 14 మందిపై కేసు నమోదైంది.

2021- 22 ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ విధానంపై వచ్చిన ఆరోపణల్లో భాగంగా ఈ కేసు నమోదు చేశాం. విచారణలో వెలుగు చూసిన విషయాల గురించి మీకు తెలిసి ఉండొచ్చు. దర్యాప్తులో భాగంగా సదరు అంశాల మీద మిమ్మల్ని విచారించాల్సిన అవసరం ఏర్పడింది' అని పేర్కొన్నారు.

దీనికి కవిత రియాక్టు అయ్యారు. తనకు సీబీఐ నుంచి నోటీసులు వచ్చిన విషయాన్ని ఆమె ధ్రువీకరించారు. తన వివరణ కోసం మాత్రమే నోటీసులు జారీ అయ్యాయని.. హైదరాబాద్ లోని తన ఇంట్లోనే కలుసుకోవచ్చని అధికారులకు తాను తెలియజేసినట్లుగా పేర్కొన్నారు. ఈ ఆరో తేదీన ఇంటి వద్దే సీబీఐ అధికారులకు వివరణ ఇవ్వనున్నట్లు కవిత పేర్కొన్నారు.

తాజా పరిణామాలు చూస్తే.. ఆరో తేదీన కేవలం విచారణ మాత్రమే ఉంటుంది తప్పించి మరింకేమీ ఉండదన్న మాట వినిపిస్తోంది. ప్రాథమిక సమాచార సేకరణ.. తమకు లభించిన ఆధారాలతో పాటు.. తదుపరి చర్యకు పక్కా కసరత్తు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. తాజా పరిణామాన్ని చూస్తే.. రాబోయే రోజుల్లో చోటు చేసుకునే ఎన్నో పరిణామాలకు ఆరంభమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.