Begin typing your search above and press return to search.

ముఖ్య‌మంత్రి టీ చ‌ల్లారిపోయింది.. అధికారికి నోటీసులు!

By:  Tupaki Desk   |   13 July 2022 2:30 AM GMT
ముఖ్య‌మంత్రి టీ చ‌ల్లారిపోయింది.. అధికారికి నోటీసులు!
X
ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ సేవ‌లు అంద‌డంలో వారాలు.. నెల‌లు.. సంవ‌త్స‌రాలు ఆల‌స్య‌మైనా.. ఆప‌ద‌లో ఉన్న రోగుల‌కు అంబులెన్సులు స‌కాలంలో రాక‌పోయినా.. ఎవ‌రికి నోటీసులు ఇస్తున్నారో తెలియ‌దు కానీ.. ముఖ్య‌మంత్రి తాగే టీ చ‌ల్లారిపోయింద‌ని పేర్కొంటూ.. సంబంధిత అధికారికి మాత్రం నోటీసులు ఇవ్వ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

ముఖ్యమంత్రి కోసం ఏర్పాటు చేసిన టీ చల్లారిపోయిందని, బాగాలేదని ఓ అధికారికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం మధ్యప్రదేశ్లో చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం సోషల్ మీడియా వైరల్ కాగా.. ఆ నోటీసుల్ని ఉన్నతాధికారులు ఉపసంహరించకున్నారు.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కోసం సిద్ధం చేసిన టీ సరిగా లేదంటూ ఓ అధికారికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం సర్వత్రా చర్చనీయాం శమైంది. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సదరు ఉద్యోగిని ఆదేశించిన ఉన్నతాధికారులు.. నెట్టింట వచ్చిన వ్యతిరేకతతో వెనక్కు తగ్గారు. ఆ నోటీసుల్ని ఉపసంహరించుకున్నారు.

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్ నుంచి రేవా వెళ్లారు. మధ్యలో ఛతర్పుర్ జిల్లా ఖజురహో విమానాశ్రయంలో ఆగారు. సీఎం రాక సందర్భంగా టీ, అల్పాహారం, ఇతర ఏర్పాట్లన్నీ చేసే బాధ్యతను జూనియర్ సప్లై ఆఫీసర్ రాకేశ్ కన్హువాకు అప్పగించారు ఉన్నతాధికారులు.

అయితే.. ఖజురహో ఎయిర్పోర్ట్లో సీఎం కోసం సిద్ధం చేసిన టీ చల్లగా ఉందని, ఏమాత్రం బాగా లేదంటూ రాకేశ్కు రాజ్నగర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ డీపీ ద్వివేది షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఈ వ్యవహార శైలి.. జిల్లా అధికార యంత్రాంగాన్ని అభాసుపాలు చేసేలా, వీవీఐపీల నిబంధనావళి అమలుపై ప్రశ్నలు లేవనెత్తేలా ఉందని మండిపడ్డారు. ఇలా ఎందుకు జరిగిందో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని రాకేశ్ను ఆదేశించారు.

సీఎం టీ చల్లారిపోయిందని షోకాజ్ నోటీసులు ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు ఆ చాయ్ను శివరాజ్ సింగ్ తాగలేదని, ఆయన ఎయిర్పోర్ట్ టెర్మినల్లోకి రాకుండానే రన్వే పై మరో విమానం ఎక్కి వెళ్లిపోయారన్న వార్త వెలుగులోకి వచ్చింది. సంబంధిత ఫొటోలు నెట్టింట వైరల్ కాగా.. ఉన్నతాధికారులపై విమర్శలు వెల్లువెత్తాయి. పరిస్థితి చేయి దాటిపోతోందని గుర్తించిన జిల్లా అధికార యంత్రాంగం.. షోకాజ్ నోటీసులు ఉపసంహరించుకుంది.

ఈ వ్యవహారంలో అధికార పక్షంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. "ప్రజలకు రేషన్ అందకపోయినా, సకాలంలో అంబులెన్స్ రాకపోయినా ఫర్వాలేదు. కానీ.. ముఖ్యమంత్రికి ఇచ్చే టీ మాత్రం చల్లగా ఉండకూడదా?" అని ప్రశ్నించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి.