Begin typing your search above and press return to search.

ఎంత పెళ్లి అయితే మాత్రం వేడుక కోసం ఇంత బరితెగింపా?

By:  Tupaki Desk   |   13 Jun 2020 5:30 AM GMT
ఎంత పెళ్లి అయితే మాత్రం వేడుక కోసం ఇంత బరితెగింపా?
X
పెళ్లికి వెళితే నోటీసులా? ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించాలి. అందుకు భిన్నంగా ఉంటే.. ఇబ్బందులు తప్పవు. తాజాగా అలాంటి పరిస్థితే నిజామాబాద్ కు చెందిన వారికి ఎదురైంది. మాయదారి రోగం ఇప్పుడు అంతకంతకూ విస్తరిస్తూ వణికిస్తున్న వేళ.. పెళ్లిళ్లు లాంటి వేడుకల్ని చాలా సింఫుల్ గా చేసుకోవాలన్న సంగతి తెలిసిందే.

వివాహ వేడుకకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం యాభై మందికి మించకూడదు. అందుకు భిన్నంగా దగ్గర దగ్గర 120 మందితో నిర్వహించిన ఒక వివాహ వేడుకను స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. నిజామాబాద్ పట్టణంలోని న్యాల్ కల్ రోడ్డులో ఉన్న ఒక ఫంక్షన్ హాల్ లో ఒక పెళ్లి వేడుక జరుగుతోంది. రూల్ ప్రకారం యాబై మంది మాత్రమే హాజరు కావాలి. కానీ.. బంధువర్గం ఎక్కువగా ఉండటంతో రూల్స్ ను లైట్ చేసుకున్నారు.

దీంతో ఫంక్షన్ హాల్ దగ్గర సందడి ఎక్కువగా కనిపించింది. దీంతో.. అక్కడి వారు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు రంగ ప్రవేశం చేశారు. కల్యాణ మండపానికి వెళ్లిన పోలీసులు.. వేడుకకు హాజరైన వారందరిని వెనక్కి పంపేశారు. అప్పటికింకా పెళ్లి వేడుక షురూ కూడా కాలేదు. నిబంధనల్ని అతిక్రమించి చేస్తున్న వేడుకలో వధూవరుల తల్లిదండ్రులు మినహా మిగిలిన వారంతా వెళ్లిపోవాలని చెప్పారు. దీంతో.. వంద మందికి పైగా పరివారంతో పెళ్లి చేసుకోవాలన్న ఆ జంటకు షాక్ తగిలింది. కేవలం ఎనిమిది మందితో పెళ్లిని పూర్తి చేసుకోవాల్సి వచ్చింది. ఎంత పెళ్లి అయితే మాత్రం ఈ బరితెగింపు ఏందిరా? అన్న మాట పలువురి నోట వినిపించింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. పెళ్లి వేడుక ముగిసిన తర్వాత నిబంధనల్ని అతిక్రమించిన వారందరికి నోటీసులు ఇవ్వాలని పోలీసులు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీంతో.. వేడుకకు వెళ్లి ఎంజాయ్ చేద్దామనుకున్న వారికి ఇప్పుడో కొత్త తలనొప్పి మొదలైనట్లేనని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరో పిలిచారని పరుగులు తీస్తూ వేడుకులకు వెళ్లే కన్నా.. జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లేకుండా.. సంతోషం తర్వాత షాకులు తగలటం ఖాయమని చెప్పక తప్పదు.