Begin typing your search above and press return to search.

200 చానళ్లే కాదు..ఆ తర్వాత ఎన్నైనా బిల్లు మాత్రం రూ.160

By:  Tupaki Desk   |   14 Jan 2020 6:05 AM GMT
200 చానళ్లే కాదు..ఆ తర్వాత ఎన్నైనా బిల్లు మాత్రం రూ.160
X
అదిరే ఆఫర్ అన్నది ఏమైనా ఉందంటే ఇప్పుడు చెప్పేదే. ఆ మధ్య ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త విధానంతో కేబుల్ బిల్లు ఇష్టారాజ్యంగా మారిపోయిన సంగతి తెలిసిందే. తాను చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసిన ట్రాయ్.. తాజాగా అందుకు సంబంధించిన వివరాలు వింటుంటే.. చెవులకు ఇంపుగానే కాదు.. ఇదే పని ముందే చేసి ఉంటే ఎంత బాగుండేదన్న భావన కలుగక మానదు. సగటు జీవికి నిత్యవసరంగా మారిన టీవీ చానల్ ప్రసారాల ధరలు ఈ మధ్యన కొండెక్కి కూర్చోవటం తెలిసిందే.

కొత్త నిబంధనల పేరుతో తీసుకొచ్చిన రూల్ బుక్ లోని సెక్షన్లు కొన్ని చానళ్లను ప్రసారం చేసే సంస్థలకు.. ఆపరేటర్లకు వరంగా మారాయి. అదే సమయంలో సగటుజీవికి భారంగా మారాయి. దీనిపై పెద్ద ఎత్తున వచ్చిన విమర్శల్ని ట్రాయ్ సరి చేసే ప్రయత్నం చేయటమే కాదు.. ప్రజలు సంతోషించేలా ప్రయత్నించింది.

తాజా విధానంలో తప్పనిసరిగా ప్రసారం చేయాల్సిన చానళ్ల (అదేనండి డీడీ చానళ్లు)కు అదనంగా 200 చానళ్లను ప్రసారం చేయటం తప్పనిసరి అని.. అందుకు ప్రాథమిక నెట్ వర్క్ కనెక్షన్ ఫీజును నెలకు రూ.130గా నిర్దారిస్తున్నట్లుగా ట్రాయ్ పేర్కొంది. మరో తీపివార్త ఏమంటే.. రెండు వందలకు మించి ఎన్ని చానళ్లను ఇచ్చినా వసూలు చేసే ఫీజు మాత్రం రూ.160కు మించి పెరగకూడదన్న కండీషన్ పెట్టింది. అంతేకాదు.. ఒక ఇంట్లో రెండు.. మూడు కనెక్షన్లు ఉంటే కూడా ఇష్టారాజ్యంగా బాదేయటం కుదరదని తేల్చింది.

ఒకవేళ ఒక ఇంట్లో రెండు కనెక్షన్లు ఉన్నాయే అనుకోండి.. మొదటి కనెక్షన్ బిల్లు రూ.130 అనుకుందాం. రెండో కనెక్షన్ బిల్లు రూ.52 మించి వసూలు చేయకూడదు. అంతేకాదు.. చానళ్లను ఎంచుకునేందుకు వీలుగా కొన్ని మీడియా సంస్థలు ప్యాకేజీ రూపంలో తయారు చేసి.. ఇష్టం ఉన్నా.. లేకున్నా అన్ని చానళ్లను అంటగట్టే ప్రయత్నం చేయటం తెలిసిందే. తమ వద్ద ఉండే చానళ్లలో బహుళ ప్రజాదరణ పొందిన చానల్ ఒక్కదాని ధరను భారీగా పెట్టేసి.. మిగిలిన అన్ని చానళ్లను కలిపి కొనేలా దరిద్రపుగొట్టు ప్లాన్ వేశాయి.

దీంతో.. చాలామంది తమకు ఇష్టం ఉన్నా లేకున్నా.. ఒక మీడియా సంస్థకు చెందిన అన్ని చానళ్లను తప్పనిసరిగా కొనాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడా తప్పును కూడా సరిదిద్దారు. బొకేగా కొనుగోలు చేసినా.. నచ్చిన చానల్ మాత్రమే కొనుగోలు చేసినా.. వాటి ధరను ఒక పద్దతి ప్రకారంగా ఫిక్స్ చేశారు. గతంలో రూ.27నుంచి రూ.40 వరకు ప్రజాదరణ పొందిన చానల్ ధర ఉంటే.. ఇప్పుడు దాన్ని రూ.12కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంటే.. ఎంత తోపు చానల్ అయినా సరే సదరు చానల్ ధరను రూ.12కు మించి పెంచి అమ్మే వీల్లేదు.

ఈ నిబంధనతో అల్ కార్టే పేరుతో చానళ్లు వినియోగదారుల్ని దోచేయటానికి ఏ మాత్రం కుదరదని చెబుతున్నారు. తాజాగా డిసైడ్ చేసిన ధరల్ని మార్చి ఒకటి నుంచి అమల్లోకి తేవాలని.. జనవరి 30 నాటికి ఆయా చానళ్ల వెబ్ సైట్లలో మార్చిన ధరల్ని.. నిబంధనలకు తగ్గట్లుగా సవరించి ప్రచురించాలని ట్రాయ్ ఆదేశించింది. ఏమైనా.. బాదుడే తప్పించి మరోటి అలవాటు లేని భారతీయుడి ప్రాణానికి ట్రాయ్ తాజా నిబంధనలు రిలాక్స్ అయ్యేలా చేయటమే కాదు.. జేబు భారాన్ని భారీగా తగ్గించే అవకాశం ఉందని చెప్పక తప్పదు.