Begin typing your search above and press return to search.

దాయాదికి దిమ్మ తిరిగే వ్యాఖ్యలు చేసిన రాజ్ నాథ్

By:  Tupaki Desk   |   19 Aug 2019 5:50 AM GMT
దాయాదికి దిమ్మ తిరిగే వ్యాఖ్యలు చేసిన రాజ్ నాథ్
X
మొండోడు ఎవరి మాట వినరంటారు. అలాంటి మొండోళ్ల చేతికి రాజ్యాధికారం వస్తే.. ఎలా ఉంటుందన్న విషయం దాయాది పాక్ కు ఇప్పుడు బాగానే అర్థమవుతోంది. స్వాతంత్య్రం వచ్చిన ఏడు దశాబ్దాల్లో ఇప్పటివరకూ చూడని వైనాల్ని ప్రదర్శిస్తోంది మోడీ సర్కారు. గత ప్రభుత్వాల మాదిరి మోడీ సర్కారు ఆత్మరక్షణ ధోరణిని వ్యవహరించకుండా అందుకు భిన్నమైన తీరును ప్రదర్శించటం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

కశ్మీర్ విషయంలో పదే పదే పేచీలు పెడుతూ భారత్ కు చిరాకు పెట్టే దాయాదికి దడ పుట్టించేలా మారారు మోడీ బ్యాచ్. కశ్మీర్ విషయంలో ఇప్పటికే పలుమార్లు అంతర్జాతీయ సమాజంలో పంచాయితీ పెట్టిన పాక్ కు.. దిమ్మ తిరిగే వాదనను తెర మీదకు తీసుకొచ్చింది మోడీ పరివారం. కశ్మీర్ అంశం అంటే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ మాత్రమేనంటూ చేస్తున్న వాదన దాయాదికి దడ పుట్టేలా మారింది. గత ప్రభుత్వాలకు భిన్నంగా వ్యవహరిస్తూ.. దూకుడు నిర్ణయాల్ని అమలు చేస్తున్న మోడీ సర్కారు తీరు పాక్ పాలకులకు ఒక పట్టాన అర్థం కావట్లేదంటున్నారు.

కశ్మీర్ మీద చర్చలంటూ పాకిస్థాన్ చెప్పే మాటల అర్థాన్ని పూర్తిగా మార్చేసింది మోడీ సర్కారు. కశ్మీర్ మీద చర్చలంటే ఇకపై కేవలం పాక్ అక్రమిత కశ్మీర్ మీదనేనని.. అది కూడా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వటం మానేస్తే తప్పించి.. వారితో చర్చలు ఉండవంటూ కొత్త వాదాన్ని తెర మీదకు తెచ్చారు. తాజాగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ పాక్ తో కశ్మీర్ అంశంపై చర్చలంటే.. అది కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి మాత్రమేనని.. మరే అంశం మీదా కాదని తేల్చేశారు.

అసలు ఏ అంశమైనా పాకిస్థాన్ తో మనం ఎందుకు మాట్లాడాలి? అసలు చర్చలు ఎందుకు జరపాలి? ఒక వేళ చర్చలు జరపాలంటే ముందు ఆ దేశం ఉగ్రవాదులకు మద్దతు.. ఆశ్రయం ఇవ్వటం మానేయాలన్నారు. ఆర్టికల్ 370 నిర్వీర్యంతో పాక్ భయపడిందని.. ఆ దేశానికి అది చాలా తీవ్రమైన అంశమన్నారు. అంతర్జాతీయ సమాజంలో పాక్ మాటలకు విలువ లేదని.. అగ్రరాజ్యం సైతం చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలన్న సలహా ఇచ్చిందన్నారు.

రాజ్ నాథ్ మాటలకు తగ్గట్లే మరో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ సైతం కశ్మీర్ మీద పాక్ కు దిమ్మ తిరిగే రీతిలో వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా భారత్ అంతర్భాగం కావాలన్న ఆకాంక్షను బలంగా వ్యక్తం చేశారు. పీవోకేకు స్వాతంత్య్రం లభించాలని.. అది కూడా భారత్ లో భాగం కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసిన జితేంద్ర.. ఇప్పటివరకూ స్వతంత్ర భారతంలో ఎవరూ కనని కల ఆయన నోటి నుంచి వచ్చింది. మనం స్వేచ్ఛగా పీవోకే రాజధాని ముజఫరాబాద్ కు వెళ్లి వచ్చే సమయం రావాలని ప్రార్థిద్దామన్నారు. ఇప్పటివరకూ పీవోకే గురించి ఇంత స్పష్టంగా.. మరింత దూకుడుగా మాట్లాడిన కేంద్రప్రభుత్వం ఇప్పటివరకూ లేదనే చెప్పాలి. కశ్మీర్ అంశం మీద మాట్లాడేందుకు కిందామీదా పడే ప్రభుత్వాలకు భిన్నంగా మోడీ ప్రభుత్వం.. తమ లక్ష్యాన్ని స్పష్టంగా చెప్పేస్తున్న తీరు దాయాదికి ఒక పట్టాన అర్థం కాని రీతిలో మారిందని చెప్పక తప్పలేదు. చూస్తుంటే.. రానున్న రోజుల్లో పీవోకే ప్రధాన అంశంగా మార్చే దిశగా మోడీ సర్కారు ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తుందన్న భావన కలుగక మానదు.