Begin typing your search above and press return to search.

మద్యంప్రియులకు ఆర్టికల్ 370 కిక్కు

By:  Tupaki Desk   |   30 Aug 2019 4:53 AM GMT
మద్యంప్రియులకు ఆర్టికల్ 370 కిక్కు
X
కాదేదీ వ్యాపారానికి అనర్హం అంటూ ట్రెండును అందుకున్నాడో వ్యాపారి. దేశాన్నికుదిపేస్తున్న ఆర్టికల్ 370ని తన వ్యాపారంలో వాడుకుని కస్టమర్లను అట్రాక్టు చేస్తున్నాడు. ట్రెండును పట్టుకోవడమంటే ఇదీ అని నిరూపిస్తున్న ఆ భారతీయ వ్యాపారికి ఫిలిప్పీన్సులో బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. ఇండియాలో ఆర్టికల్ 370ని రద్దు చేసిన నేపథ్యంలో ఆయన తన బార్ అండ్ రెస్టారెంట్‌ లో రెండు రకాల బీర్లకు ఆర్టికల్ 370 - ఆర్టికల్ 35ఏ అనే పేర్లు పెట్టి విక్రయిస్తున్నారు.

మైక్ దేవ్నాని అనే భారతీయుడికి ఫిలిప్పీన్సులో మదరిండియా అనే ఒక బార్ అండ్ రెస్టారెంటు ఉంది. ఉత్తరప్రదేశ్ లోని లక్నో నగరానికి చెందిన దేవ్నానీ 40 ఏళ్ల క్రితం ఫిలిప్పీన్స్ కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. తొలుత ఒక గార్మెంట్ షాప్ లో సేల్స్ మెన్ ఉద్యోగం చేసిన ఆయన... ఆర్థికంగా కొంత స్థిరపడిన తర్వాత రెస్టారెంట్ ను ప్రారంభించారు. అక్కడకు ఎక్కువగా భారతీయ కస్టమర్లు వస్తుంటారు. వారు ఇప్పుడు ఆర్టికల్ 370 - 35ఏ బీర్లను బాగా ఎంజాయ్ చేస్తున్నారట.

అయితే.. దేవ్నానీ మాత్రం ప్రచారం కోసమో - వివాదం కోసమో తాను ఈ పేర్లు పెట్టలేదని చెప్పారు. బీర్లపై ఉన్న పేర్లను చూడగానే కస్టమర్లు దాని గురించి అడుగుతారని... అప్పుడు మోదీ ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం - దేశ ఔన్నత్యం గురించి చెప్పే అవకాశం దొరుకుతుందని అంటున్నారు. 20 ఏళ్ల వయసులో ఫిలిప్పీన్స్ కు వెళ్లిన దేవ్నానీ... అప్పటి నుంచి భారత్ కు తిరిగి రాలేదు. ఇండియన్ పాస్ పోర్టును గుర్తుగా ఇప్పటికీ తన వద్దే ఉంచుకున్నారు. భారత్ తనకు బంధువులు ఎవరూ లేరని... అందుకే ఇండియాకు రావాల్సిన అవసరం తనకు రాలేదని అంటున్నారాయన.