Begin typing your search above and press return to search.

వైఎస్‌ కు భారతరత్న ఇవ్వాలంటూ ఉద్యమం

By:  Tupaki Desk   |   10 July 2018 7:52 AM GMT
వైఎస్‌ కు భారతరత్న ఇవ్వాలంటూ ఉద్యమం
X
మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోటి సంతకాల ఉద్యమానికి వైసీపీ నేతలు శ్రీకారం చుట్టారు. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో వైయస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఉద్యమం చేపట్టారు. వైయస్ చిత్రపటానికి నివాళులర్పించి - సంతాకాల సేకరణను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ - మాజీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి - మిథున్ రెడ్డి - ఎమ్మెల్యేలు గౌరు చరిత - అనిల్ - రవీంద్రనాథ్ రెడ్డి - కోన రఘుపతి - ప్రతాప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

బడుగు - బలహీన వర్గాల కోసం బతికిన మహానేత వైయస్ అని ఈ సందర్భంగా నేతలు కీర్తించారు. భారతరత్న పురస్కారాన్ని పొందేందుకు వైయస్ అన్ని విధాలా అర్హుడని అన్నారు. అమెరికా గడ్డ మీద నుంచే ఈ ఉద్యమాన్ని మొదలు పెడుతున్నామని చెప్పారు.

కాగా ఎన్టీఆర్ కు కూడా భారత రత్న ఇవ్వాలంటూ చాలాకాలంగా డిమాండ్ ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు ఆ దిశగా ప్రయత్నించడం లేదన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ కు ఒకవేళ భారతరత్న వస్తే సతీమణి లక్ష్మీపార్వతి దాన్ని స్వీకరించాల్సి ఉంటుంది కాబట్టి చంద్రబాబు వ్యక్తిగత కక్షతో ఈ దిశగాప్రయత్నం చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. అయితే... ఇప్పుడు వైఎస్ కు భారత రత్న ఇవ్వాలన్న డిమాండు రావడంతో టీడీపీ కూడా తమ డిమాండును బయటకు తీస్తుందని భావిస్తున్నారు.