Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తిపై అంత‌ర్జాతీయ కోర్టుకు.. కామెడీనా?

By:  Tupaki Desk   |   3 March 2020 10:34 AM GMT
అమ‌రావ‌తిపై అంత‌ర్జాతీయ కోర్టుకు.. కామెడీనా?
X
అమ‌రావ‌తిపై అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానానికి ఎక్కార‌ట కొంత‌మంది ఎన్ ఆర్ ఐలు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజ‌ధానుల విష‌యంలో విచారించాల‌ని - ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యాన్ని ర‌ద్దు చేసి..అమ‌రావ‌తి మాత్ర‌మే ఏపీ రాజ‌ధానిగా ఉండేలా ఆదేశాలు ఇవ్వాల‌ని దిహేగ్ లోని అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానాన్ని కోరుతూ కొంత‌మంది తెలుగు ఎన్ ఆర్ ఐలు పిటిష‌న్ దాఖ‌లు చేసిన‌ట్టుగా తెలుస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ సానుభూతి ప‌రులైన ఎన్ ఆర్ ఐలు ఈ పిటిష‌న్ దాఖ‌లు చేసిన‌ట్టుగా స‌మాచారం. ఈ పిటిష‌న్ ను అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం విచార‌ణ‌కు కూడా తీసుకున్న‌ట్టుగా వారు ప్ర‌క‌టించుకుంటున్నారు. త్వ‌ర‌లోనే ఇది విచార‌ణ‌కు వ‌స్తుంద‌ట‌!

ఇక్క‌డ అస‌లైన విష‌యం ఏమిటంటే.. ఒక దేశ‌, అందునా ఒక రాష్ట్ర రాజ‌ధాని ఎక్క‌డ‌? అనే అంశంల అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం జోక్యం చేసుకుంటుందా? ఆ హ‌క్కులు దానికి ఉంటాయా? అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం ప్ర‌ధానంగా.. రెండు మూడు దేశాల మ‌ధ్య‌న వైరుధ్య‌భావ‌నలున్న అంశాల‌ను విచారిస్తూ ఉంటుంద‌నేది ప్రాథ‌మిక జ్ఞానం. ఐక్య‌రాజ్య‌సమితికి అనుబంధ విభాగంగా ఇది ప‌ని చేస్తూ ఉంటుంది.

ఉదాహ‌ర‌ణ‌కు ఇండియా -పాక్ లు ఒక జాద‌వ్ అనే భార‌తీయుడి విష‌యంలో అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానంలో పోరాడుతూ ఉన్నాయి. అత‌డు భార‌త గూఢ‌చారి అని, త‌మ దేశంలో దొరికాడ‌ని పాక్ ఆరోపిస్తూ ఉంది. ఇండియా మాత్రం అత‌డు భార‌త పౌరుడే కానీ, అత‌డు గూఢ‌చారి కాద‌ని అంటోంది. ఇలాంటి వివాదాలు అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానంలో విచార‌ణ‌కు నోచుకుంటూ ఉంటాయి. అయితే ఇలా ఒక రాష్ట్ర త‌న అధికారాలను అనుస‌రించి రాజ‌ధానిని ప్ర‌క‌టించుకుంది. అది మూడు రాజ‌ధానుల‌నా, నాలుగు రాజ‌ధానుల‌నా అనేది.. అస‌లు దాని అధికారం.

ఈ విష‌యంలో తాము జోక్యం చేసుకోలేమ‌ని స్వ‌యంగా భార‌త ప్ర‌భుత్వ‌మే స్ప‌ష్టం చేసింది. రాజ‌ధాని అనేది పూర్తిగా రాష్ట్ర ప‌రిధిలోని అంశ‌మ‌ని పార్ల‌మెంట్ లోనే కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఇలాంటి త‌రుణంలో అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానానికి ఎక్కి తెలుగుదేశం పార్టీ వాళ్లు సాధించేది ఏమిటి?