Begin typing your search above and press return to search.

అమరావతి పోరులోకి ప్రవాసాంధ్రులు... రాష్ట్రపతికి లేఖ

By:  Tupaki Desk   |   7 Jan 2020 4:02 AM GMT
అమరావతి పోరులోకి ప్రవాసాంధ్రులు... రాష్ట్రపతికి లేఖ
X
నవ్యాంధ్ర నూతన రాజధాని గా పేరు పడిపోయిన అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకు జరుగుతున్న కుట్రలను తుత్తునీయలు చేసేందుకు రాజధాని రైతులు ఓ వైపు, రాజధానిగా అమరావతిని ఎంపిక టీడీపీ మరోవైపు తమదైన శైలిలో ఉద్యమం సాగిస్తుంటే... ఇప్పుడు ఈ ఉద్యమాలకు ప్రవాసాంధ్రులు కూడా మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు ఎక్కడికక్కడ తమ నిరసనలను తెలుపుతుంటే... అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో బేఏరియా కు చెందిన ప్రవాసాంధ్రులు మరో అడుగు ముందుకేశారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాల్సిందేనని డిమాండ్ చేసిన శాన్ ఫ్రాన్సిస్కో బేఏరియా ప్రవాసాంధ్రులు... నేరుగా భారత ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాశారు. రాష్ట్రపతి కి పంపిన తమ లేఖ ప్రతులను వారు ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలకు కూడా పంపారు.

రాష్ట్రపతి కి బే ఏరియా ప్రవాసాంధ్రులు ఏదో అలా లేఖ రాశామంటే రాశారనుకుంటే పొరబడినట్టే. ఎందుకంటే... రెండు పేజీలలో రాసిన సదరు లేఖలో ఏపీ రాజధాని గా అమరావతి ఎలా ఎంపికయ్యింది? ఇప్పటిదాకా ఏ మేరకు అభివృద్ధి జరిగింది? ఆ అభివృద్ధిలో ఎవరి పాత్ర ఎంత ఉంది? అమరావతి నిర్మాణం కోసం రాజధాని రైతులు ఏ మేర త్యాగం చేశారు? ప్రస్తుత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న చర్యలేమిటి? వాటి కారణంగా జరిగే అనర్ధాలేమిటి? జగన్ చర్యల ద్వారా రాష్ట్ర పయనం ఏ దిశగా సాగనుంది? ఎన్నెన్ని ఇబ్బందులు వస్తాయి? జగన్ నిర్ణయాలతో రాజధాని రైతుల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?... ఇలా అన్ని వివరాలను సమగ్రంగా వివరిస్తూ బే ఏరియా ప్రవాసాంధ్రులు రాష్ట్రపతి కి లేఖ రాశారు.

రాజధానిని అమరావతి నుంచి తరలించడం వల్ల జరిగే నష్టాలపై తమదైన రీతిలో విశ్లేషణ చేసిన బే ఏరియా ప్రవాసాంధ్రులు.. ఇప్పటికే జగన్ సర్కారు తీసుకుంటున్న చర్యల ద్వారా ఏపీ నుంచి ఆర్థిక సంస్థలు, కాంట్రాక్టు సంస్థలు ఎలా వెనక్కెళ్లిపోయిన వైనాన్ని కూడా వివరంగానే ప్రస్తావించారు. అంతేకాకుండా స్టాక్ ఎక్సేంజి ద్వారా జారీ చేసిన అమరావతి బాండ్ల పరిస్థితి ఏమిటని కూడా ప్రశ్నించారు. మొత్తంగా అమరావతి నుంచి రాజధాని ని తరలిస్తే... జరిగే నష్టాలను వివరిస్తూ లేఖ రాసిన ప్రవాసాంధ్రులు... ఏపీని ఈ విఫరిణామాల నుంచి రక్షించాలంటే స్వయంగా రాష్ట్రపతి ఈ వ్యవహారంలో కలుగజేసుకోవాలని కూడా వారు విన్నవించారు. రాష్ట్రపతికి బే ఏరియా ప్రవాసాంధ్రులు రాసిన లేఖ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటుగా.. ఏపీ గురించి ఆలోచించేవారిని మరింత లోతుగా ఆలోచన చేసేలా ఉందన్న వాదన వినిపిస్తోంది.