Begin typing your search above and press return to search.

మోడీ ప‌ర్య‌ట‌న‌లో వేడి

By:  Tupaki Desk   |   22 Sep 2015 11:00 AM GMT
మోడీ ప‌ర్య‌ట‌న‌లో వేడి
X
ప్రధాని మోడీ నీరాజ‌నాలు అందుకున్న చోటే చీత్కారాలు ఎదుర్కొంటున్నారు. ప్రధాని ప‌ద‌వి చేపట్టిన త‌రువాత‌ తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ ఎన్నారైలు ఆయ‌న‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు... కానీ నాలుగు రోజుల్లో మ‌ళ్లీ అమెరికా వెళ్ల‌నున్న మోడీ కోసం అక్క‌డ ఈసారి నిర‌స‌న‌ల‌తో స్వాగ‌తం ప‌ల‌క‌డానికి ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టికే అక్క‌డ ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున‌ ప్రచారం ప్రారంభించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన సెప్టెంబర్ 26 - 27వ తేదీల్లో సిలికాన్ వ్యాలీని సందర్శించనున్నారు. అయితే ఈసారి అక్కడి ఎన్నారైల్లో చాలామంది మోడీకి వ్యతిరేకంగా నిరసన ర్యాలీలకు సిద్ధమవుతున్నారు. సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికే వ్య‌తిరేక ప్రచారోద్యమాన్ని ప్రారంభించారు. అక్క‌డితో ఆగ‌కుండా ఏకంగా 'మోడీ ఫెయిల్ డాట్ కామ్ అనే వెబ్‌ సైట్‌ ను కూడా ప్రారంభించారు. సాన్ జోస్‌ లోని శాప్ సెంటర్‌ లో సెప్టెంబర్ 27వ తేదీన 18 -500 మందిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనుండ‌గా ఆ రోజున భారీ నిర‌స‌న తెల‌ప‌డానికి వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మోడీ ప్ర‌ధాని అయిన త‌రువాత‌ భారత్‌లో దళితులు - మైనారిటీలు - మహిళలకు వ్యతిరేకంగా హింస పెరిగిపోయిందన్న‌ది వారి ఆరోప‌ణ‌. మత ఛాందస రాజకీయాలతో మోడీ దేశాన్ని నాశ‌నం చేస్తున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు. అమెరికాలోని ప్రవాస భారతీయల ప్రయోజనాల కోసం ఇంత వరకు మోడీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు.

కాగా... పులి మీద పుట్ర‌లా ప‌టేళ్ల ఆందోళ‌నకారుడు హార్దిక్ పటేల్ కూడా మోడీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా అమెరికా వ్య‌తిరేక ర్యాలీలు నిర్వ‌హిస్తామ‌ని వార్నింగులు ఇస్తున్నారు. ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌క ప‌ర్య‌ట‌న జ‌రుపుతున్న మోడీ అక్క‌డ నిర‌స‌న‌లు ఎదుర్కొని ప‌రువు పోగొట్టుకుంటారా... లేదంటే వారికి సరైన స‌మాధాన‌మిచ్చి ప‌రువు కాపాడుకుంటారో చూడాలి.