Begin typing your search above and press return to search.

మెగాస్టార్ కు షాకిచ్చిన ప్ర‌వాసాంధ్రులు

By:  Tupaki Desk   |   29 April 2018 6:59 AM GMT
మెగాస్టార్ కు షాకిచ్చిన ప్ర‌వాసాంధ్రులు
X
ఏపీకి ఇస్తామ‌న్న ప్ర‌త్యేక హోదా హామీ విష‌యంలో ఆంధ్రులు ఎంత‌గా ర‌గిలిపోతున్నారో తెలిసిందే. అంత‌కు రెట్టింపుగా మండిప‌డుతున్నారు ప్ర‌వాసాంధ్రులు. హోదా విష‌యంలో ఏపీకి జ‌రుగుతున్న అన్యాయంపై తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ మౌనంగా ఉండ‌టంపై వారు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఏపీకి జ‌రుగుతున్న అన్యాయంపై సినీ ప‌రిశ్ర‌మ స్పందించాలంటూ ప్ర‌వాసాంధ్రులు నిర‌స‌న‌కు దిగిన వైనం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

ప్ర‌త్యేక హోదాపై పోరాటానికి సినిమా ఇండ‌స్ట్రీ ఎందుకంత కామ్ గా ఉంటుంద‌న్న సూటిప్ర‌శ్న‌తో పాటు.. త‌మిళ‌నాడులో మాదిరి.. సినీ ప‌రిశ్ర‌మ ఎందుకు ముందుకు రావ‌టం లేద‌ని నిల‌దీస్తున్నారు. తెలుగు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం విష‌యంలో ఇప్ప‌టికైనా టాలీవుడ్ త‌మిళ‌నాడును చూసైనా నేర్చుకోవాల‌ని పేర్కొన‌టం గ‌మ‌నార్హం.

పాతికేళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా మా సంస్థ అమెరికాలోని డాల‌స్ న‌గ‌రంలో సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌ల్ని నిర్వ‌హిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవితో స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఊహించిన విధంగా ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో అన్యాయం జ‌రుగుతున్నా ఎందుకు ప్ర‌శ్నించ‌టం లేద‌ని. బ‌య‌ట‌కు రావ‌టం లేదెందుకు? అని ప్ర‌శ్నిస్తున్నారు.

భ‌వ‌న నిర్మాణానికి అవ‌స‌ర‌మైన నిధుల కోసం అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన సినీ ప్ర‌ముఖుల‌కు ప్ర‌వాసాంధ్రులు ప‌లువురు ప్ర‌త్యేక‌హోదా అంశంపై సీరియ‌స్ కావటం సంచ‌ల‌నంగా మారింది. కావేరి.. జ‌ల్లిక‌ట్టు విష‌యంలో త‌మిళ‌నాడు చిత్ర‌ప‌రిశ్ర‌మ అంతా ముందుకు వ‌చ్చి త‌మ వాద‌న‌ను వినిపించింద‌ని.. అదే రీతిలో టాలీవుడ్ ప్ర‌ముఖులు ఎందుకు బ‌య‌ట‌కు రార‌న్న వారు.. లోటుబ‌డ్జెట్ లో ఏర్పాటైన ఏపీ కోసం.. విభ‌జ‌న సంద‌ర్భంగా ఇచ్చిన ప్ర‌త్యేక హోదా హామీ మీద ఎందుకు నిల‌దీయ‌టం లేద‌ని ప్ర‌శ్నించారు.

ఏపీప్ర‌త్యేక హోదా మీద మాట్లాడాలంటూ చిరంజీవిని డిమాండ్ చేశారు ప్ర‌వాసాంధ్రులు. కేంద్ర‌మంత్రిగా ఉన్న‌ప్పుడు చిరంజీవి ఏపీకి ఏం చేశార‌ని ప్ర‌శ్నించిన వారు..పార్ల‌మెంటులో.. ప‌క్క రాష్ట్రాల్లో ఏపీకి మ‌ద్ద‌తుగా మాట్లాడుతుంటే.. చిరు మాత్రం ఆడియోఫంక్ష‌న్లు.. కుటుంబ స‌భ్య‌ల కోసం మా వారిని పోగేసుకెళుతున్నారంటూ ఫైర్ అయ్యారు. కుటుంబంపైన చూపిస్తున్న శ్ర‌ద్ధ ఏపీపై ఎందుకు చూపించ‌టం లేద‌ని ప్ర‌శ్నించారు. ప‌వ‌న్ విష‌యంలో అంద‌రూ ఒక్క‌ట‌య్యార‌ని.. మ‌రి ఏపీకి జ‌రుగుతున్న అన్యాయం విష‌యంలో ఏకం కారేం అంటూ ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేశారు.

టాలీవుడ్ ప్ర‌ముఖుల ఆస్తులు తెలంగాణ‌లోనే ఉన్నాయ‌నా? ఆంధ్రాలో లేనందుకేనా? అంటూ ప్ర‌శ్నించిన ప‌లువురు ప్ర‌వాసాంధ్రులు.. మీ అవ‌స‌రాల కోసం ఫండ్స్ క‌లెక్ట్ చేసి ఇస్తున్నాం. కానీ.. మీరు మాత్రం ఏపీ ప్ర‌జ‌ల కోసం గొంతు విప్ప‌టం లేదు? ఇదెక్క‌డి న్యాయం? అంటూ ప్ర‌శ్నించిన వైనం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. దేశం కాని దేశంలో ప్ర‌త్యేక హోదా అంశంపై ప్ర‌వాసాంధ్రులు నోరు విప్ప‌టం ఒక అంశ‌మైతే.. తాము అమితంగా ఆరాధించే సినీ ప్ర‌ముఖుల‌ని కూడా చూడ‌కుండా నిల‌దీయ‌టం చూస్తే.. రానున్న రోజుల్లో అమెరికాలో తెలుగువారి కార్య‌క్ర‌మాలంటే ఇప్పుడున్నంత ఉత్సాహంగా పాల్గొనేందుకు సినీ ప్ర‌ముఖులు ఆలోచిస్తారేమోన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.