Begin typing your search above and press return to search.

ఎన్ ఆర్ ఐలు ఓట‌ర్లుగా న‌మోదు కావొచ్చు ఎలానంటే?

By:  Tupaki Desk   |   15 July 2018 6:40 AM GMT
ఎన్ ఆర్ ఐలు ఓట‌ర్లుగా న‌మోదు కావొచ్చు ఎలానంటే?
X
ప్ర‌వాస‌భార‌తీయులు (ఎన్ ఆర్ ఐలు) దేశంలో ఓట‌ర్లుగా న‌మోదు చేసుకునే వీలును క‌ల్పిస్తోంది జాతీయ ఓట‌ర్ స‌ర్వీస్ పోర్ట‌ల్‌. ప్ర‌జాప్రాతినిధ్య చ‌ట్టం 1950 ప్ర‌కారం ఎవ‌రైనా త‌మ సాధార‌ణ నివాసంలో ఆర్నెల్లు లేకుండా వారి ఓటును జాబితా నుంచి తొల‌గిస్తారు. ఇందుకు సైన్యం.. భ‌ద్ర‌తా ద‌ళాల్లో ప‌ని చేసే వారి నివాసాల‌కు మిన‌హాయింపు గా ఇస్తుంటారు.
ఊరు నుంచి ప‌ట్ట‌ణాల‌కు.. న‌గ‌రాల‌కు ఉపాధి కోసం వెళ్లే వారు.. విద్య‌.. ఉద్యోగ ఇత‌ర అవ‌స‌రాల‌ కోసం విదేశాల‌కు వెళ్లే వారు ఆర్నెల్ల పాటు ఓట‌ర్లుగా న‌మోదైన చిరునామాలో లేకుంటే వారి ఓట్ల‌ను తొల‌గిస్తారు. అయితే.. 2010లో ప్ర‌జా ప్రాతినిధ్య చ‌ట్టానికి చేసిన స‌వ‌ర‌ణ‌ల‌తో సెక్ష‌న్ 20ఎ ప్రకారం 18 ఏళ్లు నిండి విదేశాల్లో నివ‌సిస్తున్న ప్ర‌వాస భార‌తీయులు సైతం ఇండియాలో ఓట‌ర్లుగా న‌మోదు చేసుకునే వీలుంది.

ఓట‌రుగా న‌మోదు ఎలానంటే..

+ ప్రవాస భారతీయులు ఓటరుగా నమోదు చేసుకోవడానికి తమ పాస్‌ పోర్టులో పేర్కొన్న చిరునామా ప్రకారం సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారికి భారత ఎన్నికల సంఘం వారి ఫారం 6-ఎను ఆన్‌ లైన్ నింపి తమ దరఖాస్తులను సమర్పించాలి.

+ ఇందుకు ఒక కలర్ ఫోటో (3.5 x 3.5 సైజు) - పాస్‌ పోర్టు - వీసా పేజీ కాపీలను అప్‌ లోడ్ చేయాలి.

+ దరఖాస్తు చేసిన తర్వాత భారతదేశంలోని చిరునామాలో ఉన్న బంధువులను విచారిస్తారు. వారి నుంచి అందిన స‌మాచారం ఆధారంగా ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే 7 రోజుల్లో ఓటరుగా నమోదు చేస్తారు.

+ ఏదైనా తేడా వస్తే దరఖాస్తుదారు నివసిస్తున్న దేశంలోని భారత రాయబార కార్యాలయానికి సమాచారమిస్తారు. “ఓవర్సీస్ ఎలక్టర్స్‌(ప్రవాసి ఓటర్లు)గా నమోదు అయినవారు పోలింగ్ రోజున సంబంధిత పోలింగ్ బూత్‌ కు స్వయంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

+ అయితే.. ప్ర‌వాసుల‌కు ఓట‌రు గుర్తింపు కార్డు జారీ చేయ‌రు. కాబట్టి, ఒరిజినల్ పాస్‌ పోర్ట్ చూపించి ఓటు హక్కును వినియోగించుకోవాలి. వీరికి ఎన్నికలలో పోటీ చేసే హక్కుతో పాటు సాధారణ ఓటరుకు ఉండే అన్ని హక్కులు సమానంగా ఉంటాయి.

+ భారత ఎన్నికల సంఘం వెబ్‌ సైట్‌ లింకు http://www.nvsp.in/Forms/Forms/form6a?lang=en-GB ను క్లిక్ చేయగానే స్క్రీన్ పై ఫామ్ 6ఎ కనిపిస్తుంది. ముందుగా ఓటరు నమోదు అధికారి రాష్ట్రం - జిల్లా - నియోజకవర్గం పేరు నమోదు చేయాలి. పేరు - ఇంటి పేరు - పుట్టిన తేదీ(పాస్‌ పోర్ట్ ప్రకారం), ఆ ఊరిలో ఉన్న ఒక బంధువు పేరు - బంధుత్వం నమోదు చేయాలి. పుట్టిన స్థలం - జిల్లా - రాష్ట్రం - లింగం(స్త్రీ - పురుష - ఇతర) - ఈ-మెయిల్ - ఇండియా మొబైల్ నెంబర్‌ ను పేర్కొనాలి. ఇండియాలోని చిరునామా(పాస్‌ పోర్టులో పేర్కొన్న విధంగా) ఇంటి నెంబర్ - వీధి పేరు - పోస్టాఫీసు పేరు - గ్రామం/ పట్టణం - జిల్లా - పిన్ కోడ్ తెలియజేయాలి. అదే స‌మ‌యంలో పాస్ పోర్ట్ నెంబరు - పాస్ పోర్ట్ జారీ చేసిన ప్రదేశం పేరు - పాస్ పోర్ట్ జారీ చేసిన తేదీ మరియు గడువు ముగిసే తేదీ - వీసా నెంబర్ - వీసా క్యాటగిరీ (సింగిల్ ఎంట్రీ / మల్టిపుల్ ఎంట్రీ / టూరిస్ట్ / వర్క్ వీసా) - వీసా జారీ చేసిన తేదీ మరియు గడువు ముగిసే తేదీ - వీసా జారీ చేసిన అథారిటీ పేరు తెలియజేయాలి. ఇండియాలోని సాధారణ నివాసంలో గైర్హాజరు కావడానికి గల కారణం ఉద్యోగం కోస‌మా? విద్య కోస‌మా లేదంటే ఇతర కారణాలా వివరించాలి. ఇండియాలోని సాధారణ నివాసంలో గైర్హాజరు అయిన తేదీ పేర్కొనాలి. వీటితో పాటు ద‌ర‌ఖాస్తుదారు డిక్ల‌రేష‌న్ ఇవ్వాల్సి ఉంటుంది.

ప్ర‌వాస‌భార‌తీయులు 'ప్రాగ్జీ' (ప్రతినిధి ద్వారా ఓటు వేయడం) విధానాన్ని అమలు చేసే అవకాశాలను భారత స‌ర్కార్ పరిశీలిస్తోంది. ఎంబ‌సీల ద్వారా ఓటుహ‌క్కును వినియోగించుకునే అవ‌కాశాన్ని ప‌రిశీలించాల‌ని ప్ర‌వాసీయులు కోరుకుంటున్నారు. ఒక‌వేళ ఈ విష‌యంలో ప్ర‌భుత్వం కానీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంటే.. విదేశాల్లో ఉన్న ప్ర‌వాస‌భార‌తీయులు త‌మ ఓటుహ‌క్కుతో ఎన్నిక‌ల‌పై ఎంతోకొంత ప్ర‌భావం చూపించే వీలుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.