Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు భ‌ద్ర‌త‌పై మ‌ళ్లీ ఎన్ ఎస్ జీ దృష్టి.. తాజా అప్డేట్ ఇదే!

By:  Tupaki Desk   |   17 Dec 2022 3:30 AM GMT
చంద్ర‌బాబు భ‌ద్ర‌త‌పై మ‌ళ్లీ ఎన్ ఎస్ జీ దృష్టి.. తాజా అప్డేట్ ఇదే!
X
టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు భ‌ద్ర‌త‌పై మ‌రోసారి జాతీయ భ‌ద్ర‌తా ద‌ళం(ఎన్ ఎస్ జీ) ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టింది. తాజాగా టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఎన్ఎస్‌జీ గ్రూప్ కమాండర్ కౌషియార్ సింగ్, ఎన్ఎస్‌జీ సిబ్బంది.. ఇక్క‌డ చంద్ర‌బాబు ప‌ర్య‌టించే ప్ర‌దేశాలు.. కార్యాల‌యంలో ఉన్న సీసీ కెమెరాలు వంటి అన్ని అంశాల‌ను న‌మోదు చేసుకున్నారు.

చంద్రబాబు ఛాంబర్, ప్రచార రథాలను ఎన్ఎస్‌జీ బృందం తో క‌లిసి సింగ్ ప్ర‌త్యేకంగా ప‌రిశీలించారు. అదేవిధంగా చంద్రబాబు ప్రచార సమయంలో రాత్రిపూట బస చేసే బస్సును సింగ్ ప‌రిశీలించి.. కొన్ని మార్పులు సూచించిన‌ట్టు స‌మాచారం. టీడీపీ ప్రచార రథాలపైకి ఎక్కి పర్యవేక్షించిన ఆయ‌న‌.. పార్టీ కార్యాలయ మేనేజర్ శ్రీకాంత్, పరుచూరి కృష్ణలకు పలు సూచనలు చేశారు.

ప్రచార రథంపై చంద్రబాబు ఎక్కడి నుంచి ప్రసంగిస్తారనే వివరాలు సేకరించారు. అదేవిధంగా ప్రచార రథంపై 6 ఫీట్ గ్లాస్ ఏర్పాటు చేయాలని పార్టీ సిబ్బందికి సూచించారు. చంద్రబాబు హైట్‌కి సరిపడా ఉండే గ్లాస్ ఏర్పాటు చేయాలని, సాధ్య‌మైనంత వ‌ర‌కు దీనిని బుల్లెఫ్రూప్ విభాగం నుంచి కొనుగోలు చేయాల‌ని సూచించిన‌ట్టు స‌మాచారం. అనంత‌రం.. ఈ బృందం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం, చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌ను కూడా పరిశీలించింది.

కాగా, గ‌తంలోనూ ఒక‌సారి చంద్ర‌బాబు భ‌ద్ర‌త‌కు సంబంధించి కేంద్ర దర్యాప్తు బృందం ప్ర‌త్యేకంగా ప‌రిశీలించిన విష‌యం తెలిసిందే. అయితే.. ఇటీవ‌ల నందిగామ‌లో ప‌ర్య‌టించిన‌ స‌మ‌యంలో రాళ్ల దాడి జ‌రిగి.. ఆయ‌న భ‌ద్ర‌తా సిబ్బంది చీఫ్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు హోం శాఖ‌కు లేఖ‌రాశారు. దీంతో చంద్ర‌బాబు భ‌ద్ర‌త అంశంపై మ‌రోసారి ఎన్ ఎస్ జీ బృందం ప‌రిశీల‌న‌కు రావ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.