Begin typing your search above and press return to search.

మీటూ ఎఫెక్ట్‌: కాంగ్రెస్ లో అత‌డి ప‌ద‌వి ఊడింది

By:  Tupaki Desk   |   17 Oct 2018 4:01 AM GMT
మీటూ ఎఫెక్ట్‌:  కాంగ్రెస్ లో అత‌డి ప‌ద‌వి ఊడింది
X
దేశ వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న మీటూ ఉద్య‌మం పుణ్య‌మా అని ఇప్పుడు అన్నిరంగాల‌కు చెందిన వారి పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. తొలుత సినిమా రంగానికి చెందిన లైంగిక వేధింపుల విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చినా.. మీటూ చైత‌న్యంతో వివిధ రంగాల్లో త‌మ‌కు ఎదురైన దారుణాల గురించి మ‌హిళ‌లు పెద‌వి విప్పుతున్నారు.

తాజాగా ఈ వ్య‌వ‌హారంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నేత త‌న ప‌ద‌విని పోగొట్టుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జాతీయ అధ్య‌క్షుడు ఫిరోజ్ ఖాన్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. ఛ‌త్తీస్ గ‌ఢ్ కు చెందిన మ‌హిళా కాంగ్రెస్ కార్య‌క‌ర్త ఒక‌రు ఫిరోజ్ ఖాన్ త‌న‌ను లైంగికంగా వేధించారంటూ ఆరోప‌ణ‌లు చేశారు. ఇది కాంగ్రెస్ లో తీవ్ర సంచ‌ల‌నాన్ని రేపింది.

వెంట‌నే స్పందించిన పార్టీ దీనిపై విచార‌ణ చేప‌ట్టాలంటూ ముగ్గురుస‌భ్యుల‌తో కూడిన ఒక క‌మిటీని ఏర్పాటు చేశారు. మ‌రోవైపు బాధితురాలు పార్ల‌మెంటు స్ట్రీట్ పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేసింది. త‌న ప్రాణానికి ప్ర‌మాదం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఫిరోజ్ ఖాన్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

త‌న రాజీనామా లేఖ‌ను పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి పంపారు. ఫిరోజ్ ఖాన్ రాజీనామాను వెంట‌నే ఆమోదిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు రాహుల్. మీటూపై ప‌లు రంగాల‌కు చెందిన వారిపై ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నా.. వేటు ప‌డిన మొద‌టి వ్య‌క్తి ఫిరోజ్ ఖాన్ అన్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.