Begin typing your search above and press return to search.

కేసీఆర్ గారూ.. 'అన్న‌' గారినే మ‌రిచారే!

By:  Tupaki Desk   |   15 Dec 2017 10:13 AM GMT
కేసీఆర్ గారూ.. అన్న‌ గారినే మ‌రిచారే!
X
ప్రపంచ తెలుగు మ‌హాస‌భ‌లు... కాసేప‌టి క్రితం తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాదులో అట్ట‌హాసంగా ప్రారంభ‌మ‌య్యాయి. నాన్ స్టాప్‌గా ఐదు రోజుల పాటు జ‌రిగే ఈ స‌భ‌ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హిస్తోంది. సీఎం కేసీఆర్‌ - ఆయ‌న కూతురు - నిజామాబాదు ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత - ఇత‌ర టీఆర్ ఎస్ నేత‌లు - కేసీఆర్ మంత్రివ‌ర్గం మొత్తంగా ఈ స‌భ‌ల‌పైనే దృష్టి సారించింది. తెలుగు భాషకు పుట్టిల్లుగానే కాకుండా తెలుగు భాష‌ను ప‌రిర‌క్షించుకుంటున్న నేల‌గా తెలంగాణ‌ను చిత్రీకరించేసుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ స‌భ‌ల‌ను కేసీఆర్ నిర్వ‌హిస్తున్నార‌న్న వాద‌న ఇప్పుడు వినిపిస్తోంది. ఇందుకు ప‌లు అంశాలు కూడా ప్ర‌త్య‌క్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నాయ‌ని కూడా చెప్పాలి. తెలుగు నేల మొన్న‌టిదాకా ఉమ్మ‌డి రాష్ట్రంగానే కొనసాగింది. ఆ ఉమ్మ‌డి రాష్ట్రం కింద ఉన్న నేలంతా తెలుగు నేలే. అంటే రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలుగు నేల రెండుగా విడిపోయినా... తెలంగాణ‌తో పాటు ఏపీ కూడా తెలుగు రాష్ట్ర‌మే. ఈ విష‌యాన్ని ఏ ఒక్క తెలుగోడికి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

మ‌రి ఓ తెలుగు రాష్ట్రంలో జ‌రుగుతున్న ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల‌కు మ‌రో తెలుగు రాష్ట్రానికి చెందిన సీఎంకు ఎందుకు ఆహ్వానం పంప‌లేద‌న్న ప్ర‌శ్న తొలుత వినిపిస్తోంది. స‌రే రాజ‌కీయ విభేదాల కార‌ణంగానే ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడిని తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ ఈ స‌భ‌ల‌కు ఆహ్వానించ‌లేద‌ని అనుకున్నా... మ‌రో కీల‌క అంశం ఇప్పుడు కేసీఆర్ మ‌న‌సులోని అస‌లు బుద్ధిని బ‌య‌ట‌పెడుతోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఆ విష‌య‌మేంటంటే... తెలుగోడి స‌త్తాను ద‌శ‌దిశ‌లు వ్యాపించేలా చేసిన ఆంధ్రుల ఆరాధ్య న‌టుడు - ఢిల్లీ న‌డివీధుల్లో తీవ్ర అవ‌మానానికి గుర‌వుతున్న తెలుగు ఆత్మ గౌర‌వ ప‌రిర‌క్ష‌ణ కోస‌మే ఏకంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చేసి తెలుగు దేశం పార్టీ పేరిట రాజ‌కీయ పార్టీ పెట్టిన నంద‌మూరి తార‌క‌రామారావు ప్ర‌స్తావ‌న ఈ స‌భ‌ల్లో మ‌చ్చుకైనా క‌నిపించ‌లేదు. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ అంటే కేసీఆర్‌ కు ఎన‌లేని అభిమానం ఉంద‌న్న విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్‌ పై ఉన్న అభిమానంతోనే త‌న కుమారుడు, ప్ర‌స్తుతం త‌న కేబినెట్‌ లో కీల‌క శాఖ‌ల మంత్రిగా ఉన్న కేటీఆర్‌ కు అన్న‌గారి పేరునే పెట్టుకున్నారు.

మ‌రి అలాంటి మ‌హానీయుడి ప్ర‌స్తావ‌న లేకుండా తెలుగు ప్ర‌పంచ మ‌హాస‌భ‌ల‌ను ఎలా నిర్వ‌హిస్తున్నారో అర్థం కావ‌డం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ప్ర‌పంచ మ‌హాస‌భ‌ల నేప‌థ్యంలో హైద‌రాబాదులో ఇప్పుడు ఎక్క‌డ చూసినా తెలుగుద‌నం ఉట్టిప‌డేలా హంగూ ఆర్బాటాలు బాగానే చేశారు. అయితే ఎక్క‌డ కూడా ఎన్టీఆర్ పోస్ట‌ర్ గానీ, పేరు గానీ క‌నిపించడం లేదు. ఇదే విష‌యాన్ని గుర్తించిన ఓ అభిమాని ఆంధ్రా - తెలంగాణ‌ల‌ను క‌లుపుతున్న తొమ్మిదో నెంబ‌రు జాతీయ ర‌హ‌దారిపై ఏకంగా న‌డిరోడ్డు మీదే గుండు గీయించుకుని నిర‌స‌న వ్య‌క్తం చేశారు. అదే స‌మ‌యంలో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీకి చెందిన ప‌లువురు నేత‌లు కూడా ఇప్పుడిప్పుడే ఈ విష‌యంపై గ‌ళం విప్పేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మ‌రి ఎన్టీఆర్ అభిమాని చేప‌ట్టిన నిర‌స‌న‌పై ఇప్ప‌టిదాకా టీఆర్ ఎస్ నుంచి గానీ, తెలంగాణ స‌ర్కారు నుంచి గానీ ఎలాంటి స్పంద‌న రాక‌పోగా... దీనిపై ఆ స్పంద‌న ఎలా ఉంటుంద‌న్న అంశం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.