Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ శతజయంతి: అందరివాడు.. అందుకే అందరికి కావాలి

By:  Tupaki Desk   |   28 May 2022 9:30 AM GMT
ఎన్టీఆర్ శతజయంతి: అందరివాడు.. అందుకే అందరికి కావాలి
X
‘పాడు రాజకీయం’ అనేస్తారు పుసుక్కున. కానీ.. అదే పాడు రాజకీయం చుట్టూనే మన జీవితాలు తెల్లారతాయన్న విషయాన్ని మాత్రం పట్టించుకోం. మన జీవిత కాలంలో కొన్ని వేల గంటలు.. పాడు రాజకీయం చుట్టూనే తిరిగి.. వాటి కోసమే మనం ఎన్నో గంటల్ని ఖర్చు చేస్తుంటాం. అలాంటి రాజకీయాన్ని మాత్రం నిత్యం తిట్టిపోస్తుంటాం. కానీ.. రాజకీయాన్ని చూడాల్సిన రీతిలో చూస్తే.. ఎన్నో విషయాలు కనిపిస్తుంటాయి. సైద్దాంతిక రాజకీయాలతో మొదలై వ్యక్తి పూజకు పెద్దపీట వేస్తూ.. రాజకీయం ఎదుగుతూ.. ప్రజలకు సేవ చేసే నేతలు చాలా మందే కనిపిస్తుంటారు మన చుట్టుపక్కల. కానీ.. వారిని తరచి చూస్తే.. కాలం వారి మీద చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది.

సైద్దాంతిక విభేదాలు ఎన్ని ఉన్నప్పటికీ వాటికి అతీతంగా ఉండే రాజకీయ నేతలు కొందరు ఉంటారు. ఆ కోవలోకే వస్తారు స్వర్గీయ నందమూరి తారకరామారావు. దేశం మొత్తం అల్లుకున్న కాంగ్రెస్ ఊడలకు కోత పెట్టటం దక్షిణాదిన మొదలైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ను ఎదుర్కొని.. దానికి ఎదురుదెబ్బలు నేర్పిన రాజకీయ అధినేతల ముందువరసలో ఉంటారు ఎన్టీఆర్. అలాంటి ఆయన..ఇప్పుడు పార్టీలకు.. ప్రాంతాలకు అతీతంగా అందరి మనసుల్ని దోచుకోవటం ఆయనకు మాత్రమే చెల్లుతుంది.

ఈ రోజున ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు షురూ అయ్యాయి. ఈ రోజు నుంచి మరో ఏడాది వరకు ఈ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. మొదటి రోజే.. పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్ మీద అభిమానాన్ని ప్రదర్శించిన వైనం కనిపించింది. ఏపీ అధికారపక్షానికి బద్ధశత్రువు తెలుగు దేశం అయినప్పటికీ.. ఆ పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ ను అభిమానించే గుణం జగన్ కు ఉందని చెప్పాలి. ఈ కారణంతోనే ఎన్టీఆర్ వందోజయంతని పురస్కరించుకొని తమ సొంత మీడియా సంస్థలోనే ఎన్టీవోడి కీర్తిని ప్రస్తుతించిన వైనం కనిపిస్తుంది. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఎన్టీఆర్ ను అభిమానించేందుకు ఏ మాత్రం వెనుకాడరు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద బారులు తీరిన క్యూ.. ఎన్టీఆర్ మీద నేతలకున్న అభిమానం లెక్కల్ని చెప్పేస్తుందని చెప్పాలి.

తెలంగాణ విషయానికి వస్తే.. ఆ రాష్ట్ర అధికారపక్షం నేతలు.. ఎన్టీఆర్ జయంతి వేళ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు రావటం.. ఆయనకు నివాళులు అర్పించటం.. ఈ సందర్భంగా తమకున్న అనుబంధం గురించి.. తమ మీద ఆయన ప్రభావాన్ని చెప్పుకునేందుకు అస్సలు వెనుకాడలేదు. అంతేకాదు.. ఎన్టీఆర్ కు భారతరత్న కోసం తాము పోరాడతామని కూడా పేర్కొన్నారు. ఇలా వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అన్ని పార్టీల వారు ఎన్టీఆర్ ను ఎందుకంతగా తమ వాడిగా చెప్పుకునేందుకు ఇష్టపడుతున్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

తెలుగు నేల ప్రాంతాలుగా విడిపోయిన తర్వాత.. వందల ఏళ్ల క్రితం వ్యక్తినైనా సరే.. ఏ ప్రాంతానికి చెందిన వాడన్న దానిపై వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితుల్లో అందుకు భిన్నంగా ఎన్టీఆర్ ను ఆ చట్రంలో బంధించకుండా అందరి వాడిగా చెప్పుకున్న తీరు.. ప్రస్తావిస్తున్న వైనం అందరిని ఆకర్షిస్తోంది. దీనికి కారణం ఏమిటన్నది చూస్తే..ఎన్టీఆర్ మీద తెలుగు ప్రజలకు ఉన్న అభిమానం. ఆయన మీద తమకున్న ప్రేమాభిమానాల్ని బయటపెట్టేందుకు అస్సలు వెనుకాడటం లేదు. దీనికి కారణం.. ఎన్టీవోడి మీద ఉన్న అభిమానం. ఆయన్ను తాము అభిమానిస్తామన్న మాటతో.. తమ ఓటు బ్యాంకు పెరగటమేకాదు.. ఆయన్ను అమితంగా ఇష్టపడే వారు సైతం తమ వారిగా ఉంటారన్న ఆలోచన కూడా తాజా పరిణామానికి కారణంగా చెప్పొచ్చు.

అన్నింటికి మించి.. శత జయంతి ఉత్సవాలు ప్రారంభం రోజున.. చంద్రుడికో నూలుపోగు అన్న చందంగా తాము అమితంగా అభిమానించే ఆరాధ్య దైవం మీద తకున్న విధేయతను ప్రదర్శించుకోవటానికి ఇంతకు మించిన మంచి అవకాశం ఏముంటుంది? అందుకే.. ఏ పార్టీలో ఉన్నా.. తాము మాత్రం ఎన్టీవోడి అభిమానులమే అన్న విషయాన్ని చెప్పుకునేందుకు నేతలు ఏ మాత్రం వెనుకాడటం లేదుగా చెప్పకతప్పదు. తెలుగు నేల మీద ఈ తరహా అభిమానం ఇంకే నేతకు ఎప్పటికి సాధ్యం కాదనే చెప్పాలి.