Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ మ‌రియు కేసీఆర్ : ప్రాంతీయం హిట్ జాతీయం ఫ‌ట్ ?

By:  Tupaki Desk   |   20 Feb 2022 7:30 AM GMT
ఎన్టీఆర్ మ‌రియు కేసీఆర్  :  ప్రాంతీయం హిట్ జాతీయం ఫ‌ట్ ?
X
నేష‌నల్ ఫ్రంట్
యునైటెడ్ ఫ్రంట్
ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లాంటివి కాకుండా కొత్త ఫ్రంట్ ను ఏర్పాటు చేయాల‌ని కేసీఆర్ త‌పిస్తున్నారు.ఇవాళ ముంబ‌యికి పోయి అటు ఉద్ద‌వ్ ఠాక్రే (శివ‌సేనాని,మహారాష్ట్ర ముఖ్య‌మంత్రి)ను,ఇటు శ‌ర‌ద్ ప‌వార్ (ఎన్సీపీ నేత‌) క‌లిసి దేశ రాజ‌కీయాల‌పై చ‌ర్చించ‌నున్నా రు.ఇదే భేటీలో మ‌రికొన్ని విష‌యాలు చ‌ర్చ‌కు రానున్నాయి.

ముఖ్యంగా మోడీకి వ్య‌తిరేకంగా కూట‌మి ఏర్పాటుతో పాటు, స‌మాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం ఏవిధంగా న‌డుచుకుంటున్న‌ది అన్న‌ది చ‌ర్చిస్తారు.వీటితో పాటు రానున్న కాలంలో బీజేపీయేత‌ర కూట‌మిలో ఇంకొన్ని ప్రాంతీయ పార్టీల ఐక్య‌త‌ను కూడా తెర‌పైకి తీసుకువ‌చ్చేందుకు స‌మాలోచ‌న‌లు చేస్తారు.

ఇదే సంద‌ర్భంలో జాతీయ స్థాయిలో రాష్ట్రాల‌కు జ‌రుగుతున్న అన్యాయం,ప‌న్నుల వాటాలో ద‌క్క‌కుండా పోతున్న నిధులు ఇంకా ఇంకొన్ని కూడా చ‌ర్చ‌కు వ‌స్తాయి అని విశ్లేష‌కులు భావిస్తున్నారు.ముఖ్యంగా జీఎస్టీ వ‌సూళ్లు తిరిగి చెల్లించ‌డంలో కేంద్రం ఎప్ప‌టి నుంచో అల‌స‌త్వం వ‌హిస్తోంది.

అదేవిధంగా ముంబయి కేంద్రంగా ఉన్న ఆంధ్రా ప్రాంత ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై కూడా సీఎం కేసీఆర్ చ‌ర్చించేందుకు ఆస్కారం ఉంది.బ‌డ్జెట్లో ముఖ్య రంగాల‌కు కేంద్రం ఏ విధ‌మైన కేటాయింపులూ చేయ‌ని విష‌య‌మై కూడా చ‌ర్చించేందుకు వీలుంది.

ఆర్థిక రాజ‌ధాని కేంద్రంగా కేసీఆర్ న‌డిపే రాజకీయం రేప‌టి వేళ ఉత్త‌రాదిలో మ‌రింత ప్ర‌భావితం చూపితే ఆయ‌న‌ను జాతీయ స్థాయి నాయ‌కుడిగా గుర్తించేందుకు ఆస్కారం ఉంది.యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాలు ద‌క్షిణాది నేత‌ల‌ను పెద్ద‌గా ఆద‌రించిన దాఖ‌లాలు లేవు క‌నుక ఈ భేటీ త‌రువాత ఏమ‌యినా మార్పు వ‌చ్చి మ‌హారాష్ట్ర మాదిరిగానే మిగ‌తా ప్రాంత నాయ‌కులు ఆయ‌న‌ను స‌మాద‌రిస్తారా లేదా అన్న‌ది కూడా చూడాలి.

ముఖ్యంగా గ‌తంలో క‌న్నా భిన్నంగా మోడీ వేగాన్ని నియంత్రించేందుకు ఏయే చ‌ర్య‌లు తీసుకోవాలో అన్న విష‌య‌మై ఎక్కువ దృష్టి సారించ‌నున్నారు.అదేవిధంగా రాష్ట్రాల‌కు ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వ‌కుండా ప్రాంతీయ వివ‌క్ష‌కు కార‌ణం అవుతున్న వైనంపై కూడా చ‌ర్చిస్తారు.కొత్త ఫ్రంట్ పెట్టే యోచ‌న‌లో ఉన్న కేసీఆర్ ఇదే సంద‌ర్భంలో ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ ను కూడాక‌ల‌వ‌బోతున్నారు.

ఈ నేప‌థ్యంలో వీరి భేటీ కూడా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.కేంద్రంపై తిరుగుబాటు చేస్తే సీబీఐతోనో, ఈడీతోనో వేధించే అల‌వాటు బీజేపీకి ఉంద‌ని గ‌తంలోనే కేసీఆర్ ప్ర‌క‌టించారు. మ‌రి! ఆర్థిక నేరాలు సంబంధిత అభియోగాలు ఉన్న శ‌ర‌ద్ ప‌వార్ వీటిపై స్పందిస్తారా లేదా? అన్న‌ది కూడా ఆస‌క్తి దాయకం. మ‌త సంబంధ రాజ‌కీయాలు నెర‌పే ప్ర‌క్రియ‌లో ఇవాళ బీజేపీ అనేకాదు శివ‌సేన,ఎంఐఎం వంటి పార్టీలు కూడా ఉన్నాయి.

క‌నుక మత సంబంధ రాజ‌కీయాలు బీజేపీ మాత్ర‌మే నెర‌పుతుంది అని కేసీఆర్ వ్యాఖ్య‌లు చేసినా వాటిని శివ‌సేన లాంటి ప్రాంతీయ పార్టీలు ప‌ట్టించుకునే స్థితిలో లేవు. ఇక ఒక‌వేళ శివ‌సేన‌తోనో,ఎన్సీపీతోనో పొత్తు కుదిరినా వాళ్లేం యావ‌త్ దేశాన్నీ ఏక‌తాటిపై న‌డిపే బ‌లం ఉన్న నాయ‌కులు అయితే కాదు.

క‌నుక సీఎం కేసీఆర్ భేటీ మేలిమి ఫ‌లితాలు అందుకుంటుందా,ప‌వార్ లాంటి ఆర్థిక మూలాలు బ‌లంగా ఉన్న నేత‌లు కేసీఆర్ ను కూట‌మి స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గానే చూడ‌నున్నారా అన్న‌ది ఇవాళ చ‌ర్చ‌ల అనంత‌రం ఓ స్ప‌ష్ట‌త వ‌స్తే రావొచ్చు.

ఏదేమ‌యిన‌ప్ప‌టికీ ఎన్టీఆర్ మొదలుకుని చంద్ర‌బాబు వ‌ర‌కూ చంద్ర‌బాబు మొదలుకుని కేసీఆర్ వ‌ర‌కూ ఎవ్వ‌రూ కూడా జాతీయ స్థాయిలో రాణించ‌లేదు. ఎన్టీఆర్ కు కానీ చంద్ర‌బాబుకు కానీ హిందీ పెద్ద‌గా రాదు. ఆ విధంగా భాష వారికి అవ‌రోధం.

కేసీఆర్ కు హిందీ బాగానే వ‌చ్చు. కానీ ఉత్త‌రాదికి చెందిన స్థానిక మాండ‌లికంపై పెద్ద‌గా ప‌ట్టులేదు.ఆ విధంగా కేసీఆర్ ఓ స్టార్ క్యాంపైన‌ర్ ను వెతుక్కోవాలి.మ‌రి! ఎవ‌రు ఆ స్టార్ క్యాంపైన‌ర్ అన్న‌ది చూడాలి. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ ద‌క్షిణాది నేత‌ల‌ను ఉత్త‌రాది ప్ర‌జ‌లు నెత్తిన పెట్టుకునే సీన్ లేదుగాక లేదు..అన్న‌ది గ‌త ప‌రిణామాలే సుస్ప‌ష్టం చేస్తున్నాయి అన్న‌ది ప‌ర‌మ స‌త్యం.