Begin typing your search above and press return to search.

బాలకృష్ణ, రామకృష్ణల పెళ్లిళ్లకు వెళ్లని ఎన్టీఆర్.. కమిట్ మెంట్ అంటే అది!

By:  Tupaki Desk   |   28 May 2022 5:30 AM GMT
బాలకృష్ణ, రామకృష్ణల పెళ్లిళ్లకు వెళ్లని ఎన్టీఆర్.. కమిట్ మెంట్ అంటే అది!
X
ప్రజల కోసం ప్రాణాలు ఇస్తాం. ప్రజాసేవ కోసం దేనికైనా సిద్దమంటూ రాజకీయ నేతలు చెప్పే మాటలకు.. వారి చేతలకు ఎక్కడా పోలిక ఉండదు. ప్రజాసేవ చేయాలన్నదే కమిట్ మెంట్ అయితే.. ప్రజలు తప్పించి మరింకేమీ పట్టకూడదు. కానీ.. అలాంటి నేతలు భూతద్దంలో వేసినా దొరకరు. ఒకవేళ దొరికినా.. ఇంటికి.. కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత తప్పనిసరిగా ఉంటుంది. కానీ.. ఎన్టీఆర్ అలా కాదు. ఆయన రూటు సపరేటు. అందుకే ఆయన కోట్లాది మందికి ఆరాధ్యనీయులు అయ్యారు.

ప్రజాసేవ విషయంలో ఆయనకున్న కమిట్ మెంట్ అంతా ఇంతా కాదు. దీనికి నిదర్శనంగా ఆయనకు సంబంధించిన ఒక విషయాన్ని చెబుతారు. సమకాలీన రాజకీయాల్లో అలాంటి పని చేసే దమ్మున్న నేత ఒక్కరు కూడా కనిపించరు.

అంతేకాదు.. అలాంటి వారు ఇక ఎప్పటికి రారనే భావన కలుగుతుంది. ఇంతకూ ఆయన చేసిన పనేమిటంటే.. రాజకీయాల్లో తలమునకలై.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న కారణంగా తన ఇద్దరు కుమారులు బాలకృష్ణ, రామకృష్ణల పెళ్లిళ్లకూ వెళ్లలేదు.

పెళ్లి సంబంధాల విషయంలో అన్నీ తానై మాట్లాడిన ఎన్టీఆర్.. తీరా వారి పెళ్లిళ్లకు మాత్రం వెళ్లలేదు. కొత్త దంపతుల్ని ఆయన ఫోన్ లోనే ఆశీర్వదించారు. ప్రజాసేవ పట్ల ఎన్టీఆర్ కు ఉన్న కమిట్ మెంట్ అలాంటిది. అదే ఆయన్ను కోట్లాది మందిని అభిమానపాత్రుడ్ని చేసింది. ఆయన స్థానాన్ని ఇప్పటికి ఎప్పటికి మరొకరు భర్తీ చేయలేరు. తెలుగు జాతి ఒక్కటే.. ఎన్టీఆర్ ఒక్కరే. తమ కుమారుల పెళ్లిళ్లకు సైతం హాజరు కాని భర్త ఎన్టీఆర్ తీరుతో ఆయన భార్య బసవతారకం కన్నీరు పెట్టుకున్నారు.

ఆయన్ను చూడాలనుకొని వెంటనే బయలుదేరారు. అప్పట్లో ఆయన నెల్లూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఆ జిల్లాలో ఆయన పర్యటించే ఒక ప్రాంతంలో ఆయన రాక కోసం వెయిట్ చేశారు. అయితే.. అపూర్వ ప్రజాదరణ కారణంగా ఆయన చాలా గంటలు ఆలస్యంగా చేరుకున్నారు. ఆయన్ను చూసినంతనే వేలాది మంది ఆయన మీద చూపించిన ఆదరణ..

ఆయన్ను చూసినంతనే వెల్లువెత్తిన సంతోషం ఒకవైపు.. అదే పనిగా తిరిగిన కారణంగా నల్లగా మారిపోయిన ఎన్టీఆర్ ముఖం చేసిన వెంటనే దు:ఖంతో బసవతారకంకన్నీరు పెట్టేసుకున్నారు. ఈ రాజకీయాలు వద్దు.. మీరు.. పిల్లలే చాలు అని ఆంటూ భోరున విలపించారు. ఎన్టీఆర్ ఆమెను ఓదార్చి.. చుట్టూ ఉన్న జనాన్ని చూపిస్తూ.. "వీళ్లంతా ఎవరు తారకం? వీరు మాత్రం మనవాళ్లు కారా?' అన్న మాటలతో ఆమె ఊరట చెందారు. ప్రజల్ని ఓటు బ్యాంకు మాదిరి చూసే నేటి నాయకులకు.. ఇలాంటి మహానేతకు కలలో కూడా పోలిక పెట్టలేం.