Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ మాట్లాడ‌లేద‌న్నారు.. మాట్లాడాక‌

By:  Tupaki Desk   |   21 Nov 2021 12:30 PM GMT
ఎన్టీఆర్ మాట్లాడ‌లేద‌న్నారు.. మాట్లాడాక‌
X
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి దుమారం రేగింది. వైసీపీ నేతలు తన భార్య భువనేశ్వరి మీద వ్యక్తిగతంగా దారుణమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు.. అసెంబ్లీని బాయ్‌కాట్ చేయడమే కాక ఇన్నేళ్లలో ఎన్నడూ చూడని విధంగా ప్రెస్ మీట్లో కన్నీటి పర్యంతం కావ‌డంతో వైసీపీ ప‌ట్ల‌ తెలుగుదేశం పార్టీలో తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

చంద్రబాబును ఇలా చూసి పార్టీ నేతలు, కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు. ఈ పరిణామాలతో నందమూరి కుటుంబంలోనూ కదలిక వచ్చింది. లోకేశ్వరి, రామకృష్ణ, సుహాసిని తదితరులతో కలిసి బాలకృష్ణ శనివారం ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ నేతల వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో ఖండిస్తూ వారికి హెచ్చరికలు కూడా జారీ చేయ‌డం తెలిసిందే.

నారా రోహిత్ సైతం ఈ పరిణామాలపై ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. ఇంత‌లోనే నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, జూనియ‌ర్ ఎన్టీఆర్ సైతం ఒక‌రి త‌ర్వాత ఒక‌రు ఈ వ్య‌వ‌హారంపై స్పందించారు.

ఐతే ఎన్టీఆర్ స్పందించ‌డానికి ముందుకు వ‌ర‌కు.. తెలుగుదేశం వ‌ర్గీయులు, మ‌ద్ద‌తుదారులు.. ఎన్టీఆర్ సైలెంటుగా ఉన్నాడేంటి అంటూ ప్ర‌శ్న‌లు సంధించారు. ఈ స‌మ‌యంలో కూడా తార‌క్ స్పందించ‌కుంటే అత‌డి సినిమాల‌ను బ‌హిష్క‌రిస్తామ‌ని.. తెలుగుదేశంలోకి అత‌డికి ఎప్ప‌టికీ ఎంట్రీ ఉండ‌ద‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఐతే వాళ్లూ వీళ్లు డిమాండ్ చేస్తున్నార‌ని స్పందించాడో.. లేక త‌నకే అనిపించిందో కానీ.. తార‌క్ అయితే మౌనం వీడాడు.

వైసీపీ నేత‌ల వ్యాఖ్య‌ల్ని ఖండిస్తూ వీడియో రిలీజ్ చేశాడు. ఐతే ఇంత‌టితో తెలుగుదేశం మ‌ద్ద‌తుదారులు శాంతించాలి క‌దా. కానీ అలా జ‌ర‌గ‌లేదు. తార‌క్.. చంద్ర‌బాబు పేరెత్త‌లేద‌ని.. ఆయ‌న్ని దూషిస్తున్న కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీల‌ను ఒక్క మాటా అన‌లేద‌ని.. ఇలా ఆ వీడియోలో లోపాలు వెతుకుతున్నారు.

అస‌లు ఎన్టీఆర్ స్పందించిన వీడియోను టీడీపీ అఫీషియ‌ల్ ట్విట్ట‌ర్ హ్యాండిల్స్‌లో షేర్ చేయ‌నేలేదు. 2009 ఎన్నిక‌ల్లో ఉప‌యోగించుకుని, ఆ ఎన్నిక‌ల్లో ఓట‌మిని ఎన్టీఆర్‌కు ఆపాదించి అత‌ణ్ని ప‌క్క‌న పెట్టేయ‌డం ప‌ట్ల మాట్లాడ‌ని వాళ్లు ఇప్పుడు ఇగో ప‌క్క‌న పెట్టి వైసీపీ నేత‌ల వ్యాఖ్య‌ల్ని ఖండిస్తూ, ప్ర‌భుత్వ పాల‌న‌ను కూడా త‌ప్పుబ‌ట్టిన తార‌క్‌ను త‌ప్పుబ‌ట్ట‌డ‌మేంటో?