Begin typing your search above and press return to search.

క‌రుణ కోసం ఎన్టీఆర్ ఎంత చేశారంటే..?

By:  Tupaki Desk   |   8 Aug 2018 5:14 AM GMT
క‌రుణ కోసం ఎన్టీఆర్ ఎంత చేశారంటే..?
X
త‌మిళుల్ని మ‌రోసారి భారీ శోకానికి గురి చేస్తూ క‌రుణానిధి అనంత‌లోకాల‌కు ప‌య‌నం కావ‌టం తెలిసిందే. 94 ఏళ్ల వ‌య‌సులో తిరిగి రాని లోకాల‌కు వెళ్లిపోయిన ఆయ‌న జీవితాన్ని ఒక్క‌సారి చూస్తే.. ఆయ‌నకు రాజ‌కీయాల‌తో అనుబంధం 80 ఏళ్లు ఉండ‌టం గ‌మ‌నార్హం.

దేశంలో మ‌రే నేత‌కూ లేని ప్రోఫైల్ క‌రుణానిధి సొంతం. వీల్ చైర్ కు ప‌రిమిత‌మై ఏళ్లు గ‌డుస్తున్నా.. యాక్టివ్ పాలిటిక్స్ లో ఒక సీనియ‌ర్ నేత మాట ఇంత సుదీర్ఘ‌కాలం కొన‌సాగ‌టం క‌రుణ‌కు మాత్రమే సాధ్య‌మైన రికార్డుగా చెప్ప‌క త‌ప్ప‌దు. రాజ‌కీయాల్లో అరుదుగా క‌నిపించే త‌త్త్వం క‌రుణ సొంతం.

ఆయ‌న‌కు తెలుగు ప్ర‌జ‌ల అన్న ఎన్టీవోడితో మంచి స్నేహ‌బంధం ఉంది. రాష్ట్రాల‌కు త‌గినంత స్వేచ్ఛ‌తో పాటు.. కొన్ని అంశాల్లో ఇద్ద‌రి తీరు ఒకేలా ఉండేది.దీనికి తోడు ఇరువురిది సినిమా నేప‌థ్యం ఉండ‌టం... ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లో కొన‌సాగిన ద‌రిమిలా.. త‌న స్నేహితుడు క‌రుణ కోసం ఎన్టీఆర్ ఎంత‌లా త‌పించార‌న్న విష‌యాన్ని తెలియ‌జేసే ఉదంతాల్ని ప‌లువురు ప్ర‌స్తావిస్తుంటారు.

ఏక చ‌త్రాధిప‌త్యంగా ఉన్న కాంగ్రెస్ బ‌లాన్ని గండి కొట్టేందుకు ఎన్టీఆర్.. క‌రుణ‌లు తీవ్రంగా ప్ర‌య‌త్నించేవారు. విప‌క్షాల్ని ఒక్క తాటి మీద‌కు తెచ్చేందుకు వారిద్ద‌రూ క‌లిసి ప‌ని చేశారు. 1987లో నేష‌న‌ల్ ఫ్రంట్ లో భాగ‌స్వామ్య పార్టీల‌తో క‌లిసి చెన్నైలో భారీ స‌భ‌ను ఏర్పాటు చేశారు. దీనికి కాంగ్రెస్సేత‌ర నేత‌లంతా పాల్గొన్నారు. అనంత‌రం భారీ ర్యాలీ నిర్వ‌హించి.. బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేశారు.ఈ సంద‌ర్భంగా క‌రుణ‌.. ఎన్టీఆర్ లు ఆవేశంగా మాట్లాడి అక్క‌డి ప్ర‌జ‌ల్ని ఆక‌ట్టుకునేలా చేశారు. ఈ సంద‌ర్భంలోనే నేష‌న‌ల్ ఫ్రంట్ క‌న్వీన‌ర్ గా ఎన్టీఆర్ ఎంపిక జ‌రిగింది.

ఇదిలా ఉంటే.. క‌రుణ‌తో త‌న‌కున్న స్నేహానికి నిద‌ర్శ‌నంగా 1988లో త‌మిళ‌నాడులో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా క‌రుణ కోసం ప్ర‌చారాన్ని నిర్వ‌హించారు. ఏపీ ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న‌ప్ప‌టికీ.. దాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోకుండా త‌మిళ‌నాడులోనే కొద్ది రోజులు ఉండిపోయిన ఎన్టీఆర్.. క‌రుణ కోసం విస్తృత ప్ర‌చారాన్ని చేప‌ట్టారు.

క‌న్యాకుమారి.. తిరున‌ల్వేలి.. కోయంబ‌త్తూరు.. చెన్నై త‌దిత‌ర చోట్ల బ‌హిరంగ స‌భ‌ల్లో పాల్గొన‌ట‌మే కాదు.. క‌రుణ నేతృత్వంలో డీఎంకే గెలుపు కోసం ఆయ‌న ప‌డిన శ్ర‌మ అంతా ఇంతా కాదు. అలా క‌రుణతో త‌న‌కున్న‌ స్నేహం కోసం ఎన్టీఆర్ క‌ష్ట‌ప‌డ్డారు.ఈ కార‌ణంతోనే కావొచ్చు.. క‌రుణ త‌ర‌చూ ఏపీ అంశాల్ని తెలుసుకుంటార‌ని చెబుతారు.