Begin typing your search above and press return to search.

ఈ నిర్ణయం ఏంది జగన్? ఎన్టీఆర్ పేరు తీసేయటమా?

By:  Tupaki Desk   |   21 Sep 2022 4:30 AM GMT
ఈ నిర్ణయం ఏంది జగన్? ఎన్టీఆర్ పేరు తీసేయటమా?
X
నిన్న మొన్నటి వరకు ఎన్టీఆర్ ను భుజాన వేసుకున్నట్లుగా వ్యవహరిస్తూ.. ఎన్టీఆర్ బొమ్మను కొన్ని సందర్భాల్లో పార్టీ క్యాడర్ వాడేస్తున్న వేళ.. అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం షాకింగ్ గా మారింది. ఎన్టీఆర్ పేరును వాడే విషయంలో ఇప్పటివరకు అనుసరించిన వ్యూహాత్మక తీరుకు భిన్నంగా.. ఎన్టీవోడి పేరును తీసేసి దాని స్థానంలో సంబంధం లేని వైఎస్సార్ పేరు పెట్టిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును రాత్రికి రాత్రి మారుస్తూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఎన్టీఆర్ పేరును మార్చే విషయంలో.. ఎవరో తరుముతున్నట్లుగా.. హడావుడి చేస్తూ.. రాత్రికి రాత్రి ఆన్ లైన్ లో కేబినెట్ ఆమోద ముద్ర వేయటం.. ఈ రోజు (బుధవారం) అసెంబ్లీలో సవరణ బిల్లును పెట్టనుండటం జీర్ణించుకోలనిదిగా మారిందంటున్నారు.

జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును మార్చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ పేరును తీసేసి.. వైఎస్సార్ హెల్త్ వర్్సిటీగా మార్చాలని తీర్మానం చేశారు.

మంగళవారం రాత్రి హడావుడిగా ఆన్ లైన్ లోమంత్రులకు ఈ సవరణలను పంపి.. కేబినెట్ అనుమతి తీసేసుకున్నట్లుగా చెబుతున్నారు. బుధవారం ఏపీ అసెంబ్లీలో ఈ సవరణ బిల్లు ప్రవేశ పెట్టి.. ఆమోదం పొందినంతనే ఇంతకాలం ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ కాస్తా.. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మారనున్నట్లు చెబుతున్నారు.

ఎన్టీఆర్ మీద తమకున్న ప్రేమాభిమానాల్నిఎవరూ క్వశ్చన్ చేయలేరని.. ఆయన మీద ఉన్న ప్రేమతోనే ఎన్టీఆర్ జిల్లా పేరును పెట్టినట్లుగా చెప్పుకున్నాయి వైసీపీ వర్గాలు.

అందుకు భిన్నంగా జగన్ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయంతో గతంలో చెప్పిన మాటలకు ఇప్పుడేం సమాధానం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది. దశాబ్దాల తరబడి హెల్త్ వర్సిటీకి ఉన్న ఎన్టీఆర్ పేరును పుసుక్కున తీసిన వైనం జగన్ సర్కారు చేస్తున్న మరో అతిపెద్ద తప్పు అన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది.ఇప్పటివరకు జగన్ అమ్ముల పొదిలో ఉన్న ఎన్టీఆర్ బాణం.. తాజా నిర్ణయంతో మరెప్పటికి వాడలేని పరిస్థితి ఉంటుందన్నమాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.