Begin typing your search above and press return to search.

న్యూక్లియర్ వార్.. బటన్ ఎవరి చేతుల్లో ఉంటుంది?

By:  Tupaki Desk   |   5 March 2022 11:47 AM GMT
న్యూక్లియర్ వార్.. బటన్ ఎవరి చేతుల్లో ఉంటుంది?
X
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ దురాక్రమణను ఇతర దేశాలు ఖండించినా రష్యా బలగాలు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. అంతేకాకుండా ఇటీవలె ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆందోళనకర ఆదేశాలు జారీ చేశారు.

అణ్వాయుధ దళాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అవసరమైతే న్యూక్లియర్ వార్ కు సిద్ధంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచం ముంగిట్లో మళ్లీ వినాశకర పరిస్థితులు వస్తాయా? అనే సందేహాలు కలుగుతున్నాయి. అయితే న్యూక్లియర్ బాంబుల వాడకానికి ఆదేశాలు ఎవరు ఇస్తారు? అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్ దేశాల్లో మీటా ఎవరి దగ్గర ఉంటుందో తెలుసా?

యుద్ధంలో న్యూక్లియర్ బాంబులు వాడడానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. వాటి ప్రకారం ఆయుధాలను వాడుతుంటారు. ఈ వినాశకరమైన ఆయుధాల వాడకం అనేది అన్ని దేశాల్లో ఒకే మాదిరిగా ఉండదు. అమెరికా లో న్యూక్లియర్ ఫుట్ బాల్, రష్యాలో న్యూక్లియర్ బ్రీఫ్ కేసు, చైనాలో లోతైన సొరంగాలు, బ్రిటన్ లో ట్రైడెంట్ క్షిపణి మాదిరిగా ఉంటాయి.

అయితే ఇక్కడ ఉన్న రూల్స్ ప్రకారం ఆదేశం ఇవ్వాల్సిన వారు ఇచ్చినప్పుడు మాత్రమే వాటిని ఉపయోగిస్తారు. ఇక వారు ఆదేశాలు ఎప్పుడు ఇస్తారో తెలియదు కనుక న్యూక్లియర్ టీమ్ సభ్యులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటారు. పై నుంచి ఆదేశాలు వస్తే పని చేయడానికి సిద్ధంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

అణ్వాయుధాలు ఉపయోగించాల్సిన ఆదేశాలు అమెరికా అధ్యక్షుడు ఇస్తారు. అధ్యక్షుడి దగ్గర కొందరు ప్రత్యేక వ్యక్తులు ఉంటారు. వారి దగ్గర ఒక బ్రీఫ్ కేస్ ఉంటుంది. అందులో ప్రత్యేక పరికరాలు ఉంటాయి. ఆ దేశంలోని ముఖ్యమైన సలహాదారులతో అత్యవసరంగా మాట్లాడే సదుపాయం ఉంటుంది. దీనినే న్యూక్లియర్ ఫుట్ బాల్ అంటారు.

క్షిపణులు, వాటి ప్రయోగం వల్ల కలిగే నష్టాల పూర్తి సమాచారం కూడా ఉంటుంది. ఇందుకు సంబంధించిన కార్డు ఒకటి అమెరికా అధ్యక్షుడి దగ్గర ఉంటుంది. అందులో ఉండే కోడ్ చెబితేనే ఆయుధాలను ప్రయోగిస్తారు. ఇది ఎల్లప్పుడూ అధ్యక్షుడి వద్దే ఉంటుంది. అందుకే అమెరికా అధ్యక్షుడు చాలా బలవంతమైన వారు అంటారు.

అమెరికా అధ్యక్షుడి న్యూక్లియర్ ఫుట్ బాల్ లాగే.. రష్యా అధ్యక్షుడి దగ్గర న్యూక్లియర్ బ్రీఫ్ కేసు ఉంటుంది. న్యూక్లియర్ క్షిపణి కోడ్ కలిగిన బ్రీఫ్ కేస్ ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ అధ్యక్షుడి వద్దే ఉంటుంది. ఏదైనా సమస్య వస్తే అందులో అలారం మోగుతుంది. దీని ద్వారా ఆర్మీ కమాండర్లు, ప్రధాన మంత్రి,, రక్షణ మంత్రులతో అత్యవసరంగా మాట్లాడే సదుపాయం కూడా ఉంటుంది. ఆపద సమయంలో దాన్ని తెరిచి కోడ్ ను యాక్టివ్ చేస్తారు. అనంతరం సమాచారం ఇవ్వగానే క్షిపణులు ప్రయోగిస్తారు. అధ్యక్షుడు ఆదేశాలు ఇస్తే న్యూక్లియర్ దాడులు కచ్చితంగా వెంటనే అమలవుతాయి.

బ్రిటన్ వద్ద నాలుగు శక్తివంతమైన ట్రైడెంట్ క్షిపణులు ఉంటాయి. వాటిలో ఒకటి అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంటుంది. వీటిని ఉపయోగించాలంటే ప్రధాని ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రధాని ఆదేశం ఇవ్వగానే క్షిపణులు ప్రయోగిస్తారు. దానికి స్పెషల్ కోడ్ ఉంటుంది. నౌకాదళంలోని ఇద్దరు అధికారులకు ఆ కోడ్ చెబుతారు. వారు కూడా కోడ్ చెప్పాల్సి ఉంటుంది. ఇదంతా వైర్ లెస్ ప్రక్రియ. రెండు కోడ్ లను కలిపి న్యూక్లియర్ ప్రయోగానికి సిద్ధమవుతారు.

చైనా న్యూక్లియర్ సిస్టం ఒక రహస్యం. దాని సమాచారం బయటకు రానివ్వదు. అయితే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కమ్యూనిస్టు పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ ఉంటుంది. అయితే అంతిమ నిర్ణయం ఎవరిది అనేదానిపై పూర్తిస్థాయి సమాచారం లేదు. అమెరికా, రష్యా అధ్యక్షుల్లాగే చైనా అధ్యక్షుడి దగ్గర ఈ అధికారం ఉంటుందని మరి కొందరు చెబుతుంటారు.

ఈ విధంగా అగ్ర దేశాలైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్ దేశాల్లో అణ్వాయుధాల అధికారం బటన్ వీరి చేతుల్లో ఉంటుంది. అయితే ఏ దేశమైనా న్యూక్లియర్ క్షిపణి వాడాలంటే చాలా ఆలోచిస్తుంది. వినాకరమైన వీటివల్ల సమస్త జీవ కోటికే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి అంత సులభంగా అణ్వాయుధాల ప్రయోగం చేయబోవని విశ్లేషకులు అంటున్నారు.