Begin typing your search above and press return to search.

ఏడో నంబరు.. నాకెందుకిష్టమంటే..?

By:  Tupaki Desk   |   18 March 2022 10:38 AM GMT
ఏడో నంబరు.. నాకెందుకిష్టమంటే..?
X
ఆటలో నంబర్లాట.. అవును ఏ ఆటయినా ఆటగాళ్లకు నంబర్ల సెంటిమెంట్ ఉంటుంది. ఉదాహరణకు క్రికెట్ లో సచిన్ టెండూల్కర్, ఫుట్ బాల్ లో పీలే, మారడోనా నుంచి ప్రస్తుత అర్జెంటీనా స్టార్ లయోనల్ మెస్సీ వరకు అందరిదీ పదో నంబరు జెర్సీనే. ఈ నంబరుతో వీరికి విడదీయరాని బంధం ఉంది అంటే అతిశయోక్తి కాదు. తమ సక్సెస్, ప్రతిభకు ఈ నంబరుతో వారికి పెద్దగా సంబంధం లేకున్నా.. ఆటను మించి, జట్టును మించి ఎదిగినా.. ఈ జెర్సీ అంటే వారికి అదో సెంటిమెంటు. దీనికితగ్గట్లే వారి అడ్వర్టయిజ్ మెంట్లలోనూ ఈ జెర్సీకి చోటుండేది. ఇక, క్రికెట్ లో సచిన్ తర్వాత భారత్ లో అంతటి సక్సెస్ ఫుల్, పాపులర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని.

మహి అంతర్జాతీయ క్రికెట్ ఆడక నాలుగేళ్లయినా అతడి ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. మరోవైపు ధోనికి ఐపీఎల్ లో చెన్నై సారథిగా ఉన్న ప్రేక్షకాదరణ అంతా ఇంతా కాదు. అయితే, క్రికెట్ లో ధోని జెర్సీ నంబరు "7". ఇదే నంబరు జెర్సీతో వందల మ్యాచ్ ల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించాడతడు.

సహజంగా భారత్ లో ఏడు సంఖ్యను పెద్దగా ఇష్టపడరు. కొంత నెగెటివ్ ఆలోచన చేస్తారు. కానీ, ఎప్పుడైతే ధోని ఆ నంబరును ధరించడం మొదలుపెట్టాడో దాని దశ తిరిగింది. ఏడో నంబరు అందరికీ ఇష్టమైపోయింది. దీనికితోడు అంతర్జాతీయ క్రికెట్ లో భారత్ కు ధోని సాధించిపెట్టిన విజయాలతో 7వ నంబరు జెర్సీ స్థాయి పెరిగింది. అందుకనే ఇప్పుడు ఎవరైనా ఫోన్ నంబరో, కారు నంబరో, బైక్ నంబరో ఏడు మీద వస్తే కాదనడం లేదు. మరీ ఇష్టంగా తీసుకుంటున్నారు. దీనంతటికీ కారణం మహేంద్ర సింగ్ ధోని.

తాజాగా అతడు ఏడో నంబరు అంటే తనకు ఎందుకు ఇష్టమో చెప్పాడు. తాను జూలై 7 న జన్మించినందున 'నెంబర్ 7'బాగా ఇష్టమని చెప్పాడు. అందుకే తన జెర్సీపై నంబర్ 7 ఉంటుందని వెల్లడించాడు. అంతేకాదు ధోని అంతర్జాతీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి నెంబర్ '7'ని తన జెర్సీ నంబర్‌గా ఉపయోగిస్తున్నాడు. కొన్నేళ్లుగా ఈ నంబర్‌కు ప్రజాదరణ పెరగడం విశేషం. ఐపీఎల్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ యజమానుల బృందం, ఇండియా సిమెంట్స్ నిర్వహించిన ఇంటరాక్షన్ సందర్భంగా అభిమానులతో ధోని మాట్లాడాడు.

'మొదట్లో చాలా మంది నెంబర్ 7 నాకు అదృష్ట సంఖ్య అని అనుకున్నారు. కానీ నేను జూలై 7న పుట్టాను. ఏడో నెల ఏడో తేదీ మంచి సంఖ్య. నేను నా పుట్టిన తేదీని ఎంపిక చేసుకున్నానని చెప్పాడు' CSK గత వారం నుంచి IPL 2022 కోసం సూరత్‌లో శిక్షణ పొందుతోంది. వేదిక వద్ద కల్పిస్తున్న సౌకర్యాలపై కెప్టెన్ ధోని చాలా సంతోషంగా వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 15వ సీజన్ మార్చి 26న వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది.

ఫుట్ బాల్ లో రొనాల్డో

భారత్ లో క్రికెటర్ గా ధోని ఎంత పాపులరో.. ఫుట్ బాల్ లో అంతకుమించి పాపులర్ క్రిస్టియానో రొనాల్డో. చిత్రమేమంటే.. ఈ పోర్చుగల్ ఫుట్ బాలర్ జెర్సీ నంబరు కూడా 7. ఇదే జెర్సీతో ప్రపంచ ఫుట్ బాల్ లో రికార్డులు బద్దలు కొట్టాడు రొనాల్డో. అందరికంటే మించి అత్యంత ఆదాయం ఆర్జింజే ఆటగాడిగానూ నిలిచాడు. దీన్నిబట్టి తెలిసేదేమంటే.. ప్రతిభకు, నంబర్లకు సంబంధం లేదని..