Begin typing your search above and press return to search.

జ‌ర్మ‌నీలో కూడా `భైర‌వుడు` ఉన్నాడు!

By:  Tupaki Desk   |   10 Nov 2017 5:59 PM GMT
జ‌ర్మ‌నీలో కూడా `భైర‌వుడు` ఉన్నాడు!
X
నాకు జ‌నాల ఏడుపులు వింటేనే ఆనందం.....చనిపోయిన వారి కోసం బంధువులు రోద‌న‌లు చూసి ఆనందిస్తా.....భూకంపం - సునామీ - లాగా...నేను కూడా భూమ్మీద జ‌నాభాను నియంత్రిస్తా.....ఇవ‌న్నీ స్పైడ‌ర్ సినిమాలో సైకో కిల్ల‌ర్ భైర‌వుడుగా న‌టించిన సూర్య చెప్పిన డైలాగులు. మాన‌సిక ఉన్మాదిగా ఆ సినిమాలో ఈ విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు అద్భుతంగా న‌టించాడ‌ని విమ‌ర్శ‌కులు కూడా ప్ర‌శంసించారు. అయితే, సూర్య త‌ర‌హాలో నిజ జీవితంలో కూడా సీరియ‌ల్ సైకో కిల్ల‌ర్స్ ఉన్నారు. జ‌ర్మ‌నీలో బ‌య‌ట‌ప‌డ్డ ఓ సీరియ‌ల్ కిల్ల‌ర్ ఉదంతం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. బాధ్య‌త గ‌ల వైద్య వృత్తిలో మేల్ న‌ర్సుగా ప‌నిచేస్తున్న నీల్ హోగెల్ అనే వ్యక్తి దాదాపు 100 మంది రోగుల‌ను పైశాచిక ఆనందం కోసం చంపేశాడు. కేవ‌లం త‌న‌కు బోర్ కొడుతుంద‌నే కార‌ణంతో వారంద‌రినీ హ‌త‌మార్చాడు. అత‌డి బండారం బ‌య‌ట‌ప‌డ‌డంతో ఇపుడు క‌ట‌క‌టాలు లెక్కిస్తున్నాడు.

జర్మనీలో మేల్ న‌ర్సుగా ప‌నిచేస్తున్న నీల్ హోగెల్ కు బోర్ కొట్టింది. సాధార‌ణంగా బోర్ కొడితే ఏ సినిమాకో - షికారుకో వెళ‌తాం. కానీ - హోగెల్ మాత్రం త‌న‌కు బోర్ కొట్టింద‌ని మ‌నుషుల‌ను చంప‌డం ప్రారంభించాడు. 1999-2005 మధ్య జర్మనీలో కొన్ని ఆసుపత్రుల్లో హోగెల్ పని చేశాడు. రోగులను చంప‌డం కోసం వారికి ప్రాణాంత‌క‌ ఇంజెక్షన్లు ఇచ్చి హార్ట్ ఎటాక్ తెప్పించి చనిపోయేలా చేసేవాడు. ఆరోగ్యంగా ఉన్న పేషెంట్ హార్ట్ బీట్ హ‌ఠాత్తుగా పెర‌గ‌డంతో అక్క‌డున్న మ‌రో నర్స్ కు అనుమానం వ‌చ్చింది. వెంట‌నే ఆ పేషెంట్ ద‌గ్గ‌రకు వెళ్లి చూడగా....ప‌క్క‌న డ‌స్ట్ బిన్ లో ప్రాణాంత‌క ఇంజ‌క్ష‌న్ ఖాళీ సీసా క‌నిపించింది. దీంతో, అంత‌కు ముందు డ్యూటీలో ఉన్న హోగెల్ ఈ ప‌ని చేసి ఉంటాడ‌ని అక్క‌డి సిబ్బంది నిర్ధారించుకున్నారు. ఆ త‌ర్వాత హోగెల్ పై పోలీసులు విచార‌ణ జ‌ర‌ప‌డంతో అత‌డి గుట్టు ర‌ట్ట‌యింది.

ఉత్త‌ర జ‌ర్మ‌నీలోని డెల్మన్ హార్ట్స్ ఆసుపత్రిలో చాలాకాలం పని చేసిన నీల్ అక్క‌డ 62 మందిని, ఓల్డెన్ బ‌ర్గ్ లోని ఆసుప‌త్రిలో 38 మందిని హ‌త్య చేసిన‌ట్లు పోలీసుల సమక్షంలో అంగీకరించాడు. అత‌డు పేషెంట్ల‌కు ఏవిధంగా ఇంజెక్ష‌న్ ఇచ్చి పైశాచిక ఆనందం పొందేవాడో చెబుతుంటే ఆసుపత్రి అధికారులు - పోలీసులు నివ్వెర‌బోయారు. అత‌డి వాంగ్మూలం ప్రకారం పోలీసులు..కొన్ని చోట్ల పూడ్చి పెట్టిన రోగుల శవాలను బయటికి తెప్పించి తిరిగి శవ పరీక్షలు నిర్వహించారు. ఆ మృతదేహాల్లో ప్రాణాంతక ఔష‌ధాలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో, 2015 లో నీల్ కు కోర్టు యావజ్జీవ జైలు శిక్ష విధించింది. జర్మనీ వైద్య చరిత్రలోనే నీల్ అత్యంత కిరాత‌క‌మైన హంత‌కుడిగా నిలిచాడు.