Begin typing your search above and press return to search.

పొన్నవరం అంటే .. నాకు ఆరాధ్యం : సీజేఐ ఎన్వీ రమణ

By:  Tupaki Desk   |   24 Dec 2021 11:31 AM GMT
పొన్నవరం అంటే .. నాకు ఆరాధ్యం : సీజేఐ ఎన్వీ రమణ
X
ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఎన్ని దేశాలు తిరిగినా.. అమ్మన్నా.. పుట్టిన ఊరన్నా ఎవరికైనా మమకారం ఉంటుంది. ఉద్యోగం నుంచి రిటైరయ్యాక, లేదా వ్యాపారం వదిలేశాక సొంత ఊరిలో స్థిరపడాలనేది చాలా మంది కోరికగా ఉంటుంది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ హోదాలో శుక్రవారం ఏపీలోని కంచికచర్ల మండలం పొన్నవోలులో పర్యటిస్తున్నారు. తమ ఊరి ముద్దు బిడ్డను పొన్నవోలు అదే స్థాయిలో ఆహ్వానించింది. జస్టిస్ రమణను గ్రామస్థులు ఎడ్లబండిపై ఊరేగింపు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సమేతంగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్థుల అభినందన సభలో మాట్లాడుతూ.. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మర్చిపోను.. నేను పుట్టిన ఊరంటే నాకు చాలా ఇష్టమని ఆయన అన్నారు.

‘‘చిన్నతనంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. 1967లోనే రాజకీయంగా చైతన్యమైన గ్రామం మాది. అప్పట్లోనే మా గ్రామంలో 3 పార్టీల నేతలు ఉండేవారు. వివిధ పార్టీలు ఉన్నా ఏ గొడవలు అప్పట్లో ఉండేవి కావు. అప్పట్లో ఎన్నికల్లోనే విబేధాలు ఆ తర్వాత కలిసి ఉండేవారని’’ జస్టిస్ రమణ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

సీజేఐ హోదాలో తొలిసారిగా సొంత ఊరికి వచ్చారు జస్టిస్ రమణ. ఆయనకు గ్రామస్థుల పౌరసన్మాన కార్యక్రమం నిర్వహించారు. మూడు రోజుల పాటూ ఏపీలో ఎన్వీ రమణ పర్యటించనున్నారు. కాగా, పొన్నవరంలో పర్యటన ముగించుకుని సీజే మధ్యాహ్నం విజయవాడ చేరుకుంటారు.

అక్కడి నుంచి వెళ్లి గుంటూరు జిల్లా పెదనందిపాడులో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు నివాసానికి వెళతారు. అనంతరం రాత్రికి విజయవాడ చేరుకుని నోవాటెల్‌లో బస చేస్తున్నారు. శనివారం ఉదయం కనకదుర్గమ్మ దర్శనం చేసుకుంటారు. సాయంత్రం 5 గంటలకు ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందుకు హాజరవుతారు.

ఆ తర్వాత సిద్ధార్థ అకాడమీలో రోటరీ క్లబ్‌లో పౌర సన్మానం స్వీకరిస్తారు.. అనంతరం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చే విందుకు హాజరవుతారు. ఆదివారం సీజేఐ విజయవాడలోని కానూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం నాగార్జున విశ్వ విద్యాలయంలో జరిగే జ్యుడిషీయల్ ఆఫీసర్ల కాన్ఫరెన్సులో పాల్గొంటారు.

మధ్యాహ్నం హైకోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్, స్టేట్ బార్ కౌన్సిల్‌లో ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం ఐదు గంటలకు గవర్నర్ ఇచ్చే తేనీటి విందుకు హాజరవుతారు. అనంతరం బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానం కార్యక్రమానికివెళతారు. ఆ తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరతారు.