Begin typing your search above and press return to search.

మారని అమెరికా: మరో నల్ల జాతీయుడిపై పోలీసుల దాడి

By:  Tupaki Desk   |   23 Jun 2020 10:37 AM GMT
మారని అమెరికా: మరో నల్ల జాతీయుడిపై పోలీసుల దాడి
X
అభివృద్ధి చెందిన దేశం.. అగ్రరాజ్యంగా అమెరికాలో పరిస్థితి మారడం లేదు. వర్ణ వివక్ష దారుణంగా ఉంది. రంగును బట్టి మనుషుల వ్యవహారం.. ప్రవర్తన తీరు ఉండడం దారుణ విషయం. ఈక్రమంలోనే అమెరికాలో మే 25వ తేదీన నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మెడను తన మోకాలితో గట్టిగా తొమ్మిది నిమిషాలపాటు నొక్కి అతడు చనిపోయేలా చేశాడు. మినియాపొలీస్ కి చెందిన ఓ పోలీసు అధికారి అలా చేయడంతో అమెరికా భగ్గమంటోంది. ఇప్పుడు తాజాగా అలాంటి సంఘటనే న్యూయార్క్ లో మరొకటి చోటుచేసుకుంది.

న్యూయార్క్ సిటీలో తమను దుర్భాషలాడాడంటూ ఓ నల్లజాతీయుడిని పోలీసులు అరెస్టుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అతడం ప్రతిఘటించడంతో పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. అతడిని నలుగురైదుగురు పోలీసులు కిరాతకంగా దాడి చేశారు. ఒకరు అతడి కడుపుపై తన బలమంతా అదిమిపట్టి కూర్చున్నాడు. మరొకడు అతని మెడపై తన మోకాలిని అదిమిపట్టి ఉంచాడు. ఇంకొకడు అతని చేతులను వెనక్కి విరిచి పట్టుకున్నాడు.

ఈ అమానుష ఘటన ఓ వీడియోతో బయటకు వచ్చింది. దీన్ని చూసినవారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. సిటీ పోలీసు కమిషనర్ డెర్మాట్ షియా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇందుకు ప్రధాన బాధ్యుడైన పోలీసు అధికారిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. బాధితుడు తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయాడు. అతని సహచరులు ఆస్పత్రికి తరలించారు. తమ క్లయింటుపై హత్యాయత్నానికి పాల్పడిన పోలీసు అధికారిని ప్రాసిక్యూట్ చేసేలా కోర్టుకెక్కుతామని ఆ నల్లజాతీయుని తరఫు లాయర్ ప్రకటించారు. ఈ ఘటనను న్యూయార్క్ నగర మేయర్ బిల్ డీ బ్లాసియా కూడా ఖండించారు.