Begin typing your search above and press return to search.

చిన్నమ్మ క్యాంప్ నుంచి జారిన ఎమ్మెల్యేలెందరు?

By:  Tupaki Desk   |   10 Feb 2017 4:28 AM GMT
చిన్నమ్మ క్యాంప్ నుంచి జారిన ఎమ్మెల్యేలెందరు?
X
అన్నాడీఎంకేలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఒక కొలిక్కి రావటంలో అంకెలే కీలకం కానున్న సంగతి తెలిసిందే. సీఎం కుర్చీ కోసం పన్నీర్ సెల్వం.. చిన్నమ్మ శశికళ ఇరువురు పోటాపోటీగా పావులుకదుపుతున్న వేళ.. శుక్రవారం ఉదయం నాటికి ఈ ఇద్దరి బలం ఎంత? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. గురువారం ఉదయానికి పన్నీరు సెల్వం బలం ఐదు లోపే కాగా.. చిన్నమ్మ బలం 130 మంది ఎమ్మెల్యేలుగా వార్తలు వచ్చాయి.

అయితే.. గురువారం చోటు చేసుకున్న పరిణామాలతో ఈ అంకెలు మారిపోయినట్లుగా తెలుస్తోంది. మొదట్నించి తనకు 50 మందికి పైగా ఎమ్మెల్యేల బలం ఉందని పన్నీర్ చెప్పినప్పటికీ.. చిన్నమ్మ ఏర్పాటు చేసిన సమావేశానికి 130 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్లుగా చిన్నమ్మ చెప్పుకున్నారు. మొత్తం 134 మంది ఎమ్మెల్యేల్లో 130 మంది ఎమ్మెల్యేలు చిన్నమ్మ నిర్వహించిన భేటీకి హాజరుకావటంపై ప్రతిఒక్కరూ విస్మయాన్ని వ్యక్తం చేశారు. ఏం బలం ఉందని పన్నీర్ ఇంత ధైర్యంగా ఉన్నారు? ఆయనంత కాన్ఫిడెన్స్ గా ఎందుకు ఉన్నట్లు అన్న ప్రశ్నకు సమాధానం లభించని పరిస్థితి.

అయితే.. బల నిరూపణకు అసెంబ్లీని హాజరుపరిస్తే.. తనకే పూర్తిస్థాయిలో బలంఉంటుందన్న ధీమాను వ్యక్తం చేస్తున్న పన్నీర్ మాటకు తగ్గట్లే గురువారం పరిణామాలు చోటు చేసుకోవటం గమనార్హం. 130 మంది ఎమ్మెల్యేలు చిన్నమ్మ వర్గంలోఉన్నట్లు చెబుతున్నా.. వాస్తవంగా ఆ సంఖ్య 87 మాత్రమేనన్న మాట వినిపిస్తోంది. పన్నీర్ తిరుగుబాటు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశానికి 87 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరైనట్లుగా వార్తలు వస్తున్నాయి.

పార్టీ సీనియర్ నేత మధుసూదన్ పార్టీ ప్రధాన కార్యదర్శిని చేయాలంటూ అమ్మ ఆత్మ తనతో చెప్పినట్లుగా పన్నీర్ ప్రకటించిన నడుమ.. గురువారం మధ్యాహ్నం ఆయన పన్నీర్ తోభేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకోవటమేకాదు.. ఆయన రాక తమకు మరింత బలాన్ని చేకూర్చినట్లైందని పన్నీరే స్వయంగా వెల్లడించటాన్ని మర్చిపోకూడదు. ఇదిలా ఉంటే.. చిన్నమ్మ నిర్వహిస్తున్న క్యాంపుల్లో నుంచి దాదాపు డజనుకు పైగా ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసినట్లుగా చెబుతున్నారు.

అసెంబ్లీలో కానీ బలనిరూపణ జరిగితే.. మరింతమంది ఎమ్మెల్యేలు చిన్నమ్మ నుంచి జారిపోయి పన్నీర్ పక్షాన నిలిచే వీలుందన్న మాట వినిపిస్తోంది. పన్నీర్ కు చెందిన 20 మంది ఎమ్మెల్యేల్ని హోటల్లో బంధించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ కొలువు తీరిన పక్షంలో ఎమ్మెల్యేల్లో అత్యధికులు పన్నీర్ పక్షాన నిలిచే వీలుందన్న మాట బలంగా వినిపిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. దాదాపు 40మందికి పైగా ఎమ్మెల్యేలు పన్నీర్ కు జై కొట్టారని.. మరికొందరు ఆ బాటలోఉన్నట్లుగా తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/