Begin typing your search above and press return to search.

సెల్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న అర్థం ఏంటి?

By:  Tupaki Desk   |   12 Jun 2017 8:52 AM GMT
సెల్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న అర్థం ఏంటి?
X
త‌మిళ‌నాడులో అధికార అన్నాడీఎంకే పార్టీలో నెల‌కొన్న ర‌చ్చ‌కు ఫుల్‌ స్టాప్‌ ప‌డేలా క‌నిపిస్తోంది. ముఖ్య‌మంత్రి పళనిస్వామి సారధ్యంలోని అన్నాడిఎంకెతో విలీన చర్చల కోసం ఏర్పాటు చేసిన ప్యానల్‌ ను రద్దు చేస్తున్నట్టు పురుచ్చితలైవి అమ్మా గ్రూపు నాయకుడు పన్నీర్‌సెల్వం ఆదివారం రాత్రి ప్రకటించారు. దీంతో అన్నాడీఎంకె చీలిక వర్గాల విలీనం అటకెక్కినట్టేన‌ని తమిళ‌నాడు రాజ‌కీయాల‌ను గ‌మ‌నిస్తున్న వ‌ర్గాలు అంటున్నాయి. మ‌రోవైపు ముఖ్య‌మంత్రి పళనిస్వామి రాష్ట్ర విప‌క్ష నేత స్టాలిన్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న స‌ర్కారును ప‌డదోసేందుకు స్టాలిన్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు.

అన్నాడీఎంకే ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి శ‌శిక‌ళ మేన‌ల్లుడు దిన‌క‌ర‌న్ జోరు పెర‌గ‌డం, ప‌ళనిస్వామి అనుచ‌రులుగా ఉన్న ఎమ్మెల్యేలు చిన్న‌మ్మ వ‌ర్గానికి మ‌ద్ద‌తిచ్చిన నేప‌థ్యాన్ని గ‌మ‌నించిన ప‌న్నీర్ సెల్వం.... త‌న మద్దతుదారుల సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా పన్నీర్‌ సెల్వం మాట్లాడుతూ ప‌ళ‌నిస్వామి బృందం ఇప్పటి వరకూ చేస్తూ వచ్చిన అన్ని రకాల బాధ్యతారహిత ప్రకటనలను సహిస్తూ వచ్చానని అన్నారు. అయితే పళనిస్వామి వర్గంతో విలీన చర్చల్ని అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించారంటూ హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అందుకే విలీన చర్చల కోసం ఏర్పా టు చేసిన ఏడుగురు సభ్యుల ప్యానల్‌ను రద్దు చేస్తున్నానని ప‌న్నీర్ సెల్వం చెప్పారు. ఏప్రిల్‌ లోనే ఈ ప్యానల్ ఏర్పాటయినప్పటి వరకూ విలీనానికి సంబంధించి ఎలాంటి పురోగతి సాధ్యం కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. సెల్వం వైపు నుంచి విలీనం దారులు మూసుకుపోయిన నేప‌థ్యంలో త‌మిళ‌నాడులో విలీన‌ రాజ‌కీయం ర‌స‌కందాయంలో ప‌డింది.

మ‌రోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రాష్ట్రంలో పాలన సజావుగా సాగుతోందని, తమను విమర్శించే అవకాశం ప్రతిపక్షాలకు లేకపోవడంతో ఇలాంటి ఆరోపణలకు దిగుతున్నారని ఆయన పేర్కొన్నారు. అయిన‌ప్ప‌టికీ అన్నాడీఎంకె ప్రభుత్వాన్ని కూల్చేందుకు డీఎంకె నాయ‌కుడు, ప్ర‌తిప‌క్ష నేత స్టాలిన్‌ ప్రయత్నించారని ఆరోపించారు. ఊసరవెళ్లిలా డీఎంకె గంటకోమాట మారుస్తోందని, అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవ్వడంతో ఇప్పుడు అన్నాడీఎంకె ప్రభుత్వం బీజేపీ బినామీ అంటూ స్టాలిన్‌ ఆరోపిస్తున్నారని పళనిస్వామి చెప్పారు. అన్నాడీఎంకెలో గ్రూపు రాజకీయాలపై పరిష్కారానికి త్వరలోనే ఇరువైపుల నేతలతో సమావేశాన్ని ఏర్పాటుచేయనున్నట్లు ఆయన వివరించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/