Begin typing your search above and press return to search.

రాష్ట్రపతికి చేరిన అమ్మ మృతిపై అనుమానాలు

By:  Tupaki Desk   |   1 March 2017 6:05 AM GMT
రాష్ట్రపతికి చేరిన అమ్మ మృతిపై అనుమానాలు
X
అమ్మ మరణంపై అనుమానాలు అంతకంతకూ పెరిగే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకూ అమ్మ మరణంపై సందేహాలా? అన్న స్థానే.. అమ్మ మరణం వెనుక ఏదో ఉన్నట్లుందే? అనుకునేలా కొత్త వాదనలు జోరు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. తాజాగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన అన్నాడీఎంకే పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన12 మంది ఎంపీలు.. అమ్మ మృతిపై తమకున్న సందేహాల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా కొన్ని అనుమానాల్ని వ్యక్తం చేయటం గమనార్హం. అనారోగ్యంతో ఉన్న అమ్మను అపోలో ఆసుపత్రికి తీసుకురావటానికి ముందు ఆమె నివాసమైన పోయెస్ గార్డెన్ లో ఏం జరిగిందన్నఅంశంపై విచారణ జరిపించాలని.. ఆ వివరాల్ని బయటకు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. దాదాపు అరగంటకు పైనే ప్రణబ్ తో భేటీ అయిన పన్నీర్ వర్గానికి చెందిన ఎంపీలో.. అమ్మమృతిపై తమకున్న సందేహాల్ని వ్యక్తం చేశారు.

సెప్టెంబరు 22 రాత్రి అపోలో ఆసుపత్రిలో చేరిన నాటి నుంచి ఆమె మృతి చెందిన డిసెంబరు 5 వరకు ఆమెను చూసేందుకు సందర్శకులెవ్వరినీ అనుమతించలేదని చెప్పారు. వారిని శశికళ అడ్డుకున్నారని.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అమ్మ విధేయుడు.. విశ్వాసపాత్రుడైన పన్నీర్ సెల్వంను కూడా ఎందుకు చూడనివ్వలేదన్న ప్రశ్నను సంధిస్తున్నారు. ఆసుపత్రిలో అమ్మకు చేసిన చికిత్స వివరాల్ని వెల్లడించాలని కోరారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమ్మను తాను చూసినట్లుగా చెబుతున్న మంత్రి సెంగోట్టయ్యన మాటల్లో నిజం లేదని చెబుతున్న వారు.. ఎవరిని అడిగి అమ్మను వెంటిలేటర్ల మీద నుంచితొలగించాలో చెప్పాలన్నారు. జయ మృతి మీద ఉన్నతస్థాయి సంస్థ చేతనో.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతనో విచారణ జరిపించాలని వారుడిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో.. బలపరీక్షను రహస్యంగా నిర్వహించాలని రాష్ట్రపతికి నివేదించారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా ముఖ్యమంత్రి పళనిస్వామి విశ్వాసపరీక్షను నెగ్గినట్లుగా ప్రకటించుకున్నారని.. అందువల్ల జరిగిన బలపరీక్షను రద్దుచేసి.. తాజాగా ఓటింగ్ కు ఆదేశించాలని అభ్యర్థించారు. మరిన్ని సందేహాలకు రాష్ట్రపతి ప్రణబ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/