Begin typing your search above and press return to search.

పన్నీర్ ఎందుకంత కూల్ గా ఉన్నారు..?

By:  Tupaki Desk   |   9 Feb 2017 5:06 AM GMT
పన్నీర్ ఎందుకంత కూల్ గా ఉన్నారు..?
X
తమిళనాడు రాజకీయాల్ని దూరం నుంచి చూస్తున్న వారికే ఉత్కంట అంతకంతకూ పెరిగిపోయే పరిస్థితి. దర్శకుడు రాంగోపాల్ వర్మ చెప్పినట్లు.. మరో సినీ నటుడు సిద్ధార్థ్ వ్యాఖ్యానించినట్లు పొలిటికల్ హర్రర్.. హాలీవుడ్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్లుగా ఉంది. సినిమా చూసే వారి పరిస్థితి ఇంతలా ఉంటే.. ఈ ఎపిసోడ్ లో కీ రోల్ ప్లే చేస్తున్న తమిళనాడు అపధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎలా ఉన్నారు? ఆయనేం చేస్తున్నారు? ఆయన బాడీ లాంగ్వేజ్ ఏమిటన్న విషయాల్ని చూస్తే.. కాస్తంత ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పాలి.

నిన్నటికి నిన్న చిన్నమ్మపై తీవ్ర విమర్శలు.. ఆరోపణలు చేసిన తర్వాత.. ఆయన క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా ఉన్నారు. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అన్నాడీంకే ప్రధాన కార్యాలయంలో చిన్నమ్మ శశికళ 130 (కాదు 131 ఎమ్మెల్యేలని శశికళ వర్గం చెబుతోంది) మంది ఎమ్మెల్యేలు తమ పక్షాన ఉన్న విషయాన్ని చెప్పేసిన వేళ.. పన్నీర్ వర్గం ఢీలా పడాలి. కానీ.. అలాంటివేమీ లేకపోవటం ఆసక్తికర అంశంగా చెప్పాలి.

బుధవారం మధ్యాహ్నం తర్వాత కూడా పన్నీర్ జాతీయ మీడియాతోనూ.. మరికొన్ని మీడియా సంస్థలకు వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వటం కనిపించింది. ఈ సందర్భంగా ఆయన కూల్ గా.. ఎప్పటి మాదిరే ప్రశాంతంగా ఉండటం గమనార్హం. అంతేకాదు.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఆయన చాలా నమ్మకంగా ఉండటంతో పాటు.. త్వరలో మచ్చలేని పాలనను అందించే ప్రభుత్వాన్ని మీరు చూస్తారంటూ నమ్మకంగా చెప్పటం విశేషం.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. పన్నీర్ ను కలిసేందుకు పెద్ద ఎత్తున అన్నాడీఎంకేకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు.. నేతలు ఆయన నివాసానికి పోటెత్తారు. ఓపక్క 130 మంది ఎమ్మెల్యేలు చిన్నమ్మ పక్షాన ఉన్నట్లు కనిపించినా.. పన్నీర్ శిబిరంలో మాత్రం సందడి తగ్గకపోవటం గమనార్హం. వ్యూహాత్మకంగా రచించిన ప్లాన్ అనుకున్నది అనుకున్నట్లుగా సాగుతుందన్న భావన పన్నీర్ ను చూస్తే అనిపిస్తుందని చెప్పక తప్పదు. నరాలు తెగిపోయే ఉత్కంటలోనూ పన్నీర్ కూల్ గా ఉండటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/