Begin typing your search above and press return to search.

చిన్నమ్మతో వేటుపై పన్నీర్ ఫైటింగ్ షురూ

By:  Tupaki Desk   |   15 Feb 2017 5:19 AM GMT
చిన్నమ్మతో వేటుపై పన్నీర్ ఫైటింగ్ షురూ
X
తనపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన వారిపై వరుస వేట్లు వేస్తున్న చిన్నమ్మకు షాక్ ఇచ్చేందుకు కొత్త ప్లాన్ ను సిద్ధం చేశారు తమిళనాడు అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం. అన్నాడీఎంకే పార్టీ ప్రాధమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి హోదాలో చిన్నమ్మ తీసుకున్న నిర్ణయాన్ని పన్నీర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తనను.. తన వెంట నడుస్తున్న నేతలపై వేటు వేస్తున్న చిన్నమ్మకు సరికొత్త షాక్ ఇచ్చేందుకు పార్టీ రూల్ బుక్ ను తెరపైకి తీసుకొచ్చారు.

తమపై వేటు వేసే అధికారం పార్టీ ప్రధానకార్యదర్శిగా వ్యవహరిస్తున్న శశికళకు ఎంతమాత్రం లేదన్న విషయాన్ని వారు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ కు తాజాగా ఫిర్యాదు చేసిన పన్నీర్ బ్యాచ్.. కొత్త విషయాల్ని తెర మీదకు తీసుకొస్తున్నారు. ఐదేళ్లు నాన్ స్టాప్ గా సభ్యులుగా ఉన్న వారు మాత్రమే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి అర్హులని పార్టీ విధి విధానాల్లో ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రూల్ 20 (2) ప్రకారం.. పార్టీ ప్రధాన కార్యదర్శిని తమిళనాడు.. పుదుచ్చేరి.. ఆంధ్రప్రదేశ్.. కర్ణాటక.. కేరళ.. అండమాన్ –నికోబార్ దీవుల్లోని పార్టీ సభ్యులు మాత్రమే ఎంపిక చేయాలన్న విషయాన్ని వారిప్పుడు ఈసీకి చెబుతున్నారు.

ఈ రూల్ ప్రకారం చిన్నమ్మ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పదవిని చేపట్టలేరని చెబుతున్నారు. ఇలాంటి రూల్స్ ను పాటించకుండా శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శి పగ్గాలు తీసుకున్నారని వారు తప్పుపడుతున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ అనర్హురాలిగా తేల్చాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నారు. తాజా పరిణామాలు చూస్తే.. తమపై వేటు వేస్తున్న చిన్నమ్మ ఎంపికే సరికాదని.. పార్టీ ప్రధాన కార్యదర్శి కుర్చీలో కూర్చునే హక్కులేదన్న విషయాన్ని నిరూపించేందుకు రివర్స్ మేనేజ్ మెంట్ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లుగా చెప్పాలి.

అంతా బాగానే ఉంది కానీ.. మరి ఇదే చిన్నమ్మను.. పన్నీర్ ఏ విధంగా ప్రతిపాదించినట్లు? పార్టీ పదవికి ఎంపిక చేసేటప్పుడు ఈ రూల్స్ అన్ని ఏమయ్యాయి? ఇప్పుడు ఏ మాత్రం అంగీకరించకుండా వాదనను వినిపిస్తున్న పన్నీర్.. చిన్నమ్మను తానే ప్రతిపాదించారన్న విషయాన్ని ఆయన మర్చిపోయారా..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/