Begin typing your search above and press return to search.

ఒబామాతో డిన్నర్.. జస్ట్ రూ.400

By:  Tupaki Desk   |   24 May 2016 10:04 AM GMT
ఒబామాతో డిన్నర్.. జస్ట్ రూ.400
X
అమెరికా అధ్యక్షుడంటే ఆ రేంజే వేరు. అమెరికా అధ్యక్షుడితో డిన్నర్ చేసే అవకాశమంటే అది అత్యంత అరుదనే చెప్పాలి. కానీ.. అలాంటి అనుకోని అవకాశం ఒక వ్యక్తికి దక్కింది. అదే విచిత్రమైతే... వారిద్దరి డిన్నర్ కు అయిన ఖర్చు ఇంకా విచిత్రం. ప్రపంచంలో ఎవరికి చెప్పినా బహుశా నమ్మరేమో...? ఎందుకంటే అమెరికా అధ్యక్షుడితో చేసిన డిన్నర్ ఖర్చు కేవలం 400 రూపాయలట. మామూలుగా అయితే, వేలల్లో ఇంకా చెప్పాలంటే లక్షల్లో ఖర్చవుతుందని అనుకుంటారు.. కానీ... సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడితో కలిసి భోజనం చేసినా కూడా కేవలం రూ.400తోనే ఫినిష్ చేసేశారట.

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన వియత్నాం పర్యటనలో భాగంగా, సీఎన్ ఎన్ రిపోర్టర్ ఆంథోనీ బౌర్డియాన్ తో కలిసి హనోయిలోని ఓ రోడ్ సైడ్ రెస్టారెంట్ కు వెళ్లి డిన్నర్ చేశారట. ఇద్దరూ కలిసి బీరు తాగి - నూడిల్స్ - సూప్ - గ్రిల్డ్ పోర్క్ వంటివన్నీ తిన్నారు. మొత్తం బిల్లు కేవలం ఆరు డాలర్లు మాత్రమే అయింది. అంటే సుమారు రూ.400 అన్నమాట. తామిద్దరమూ కలిసి డిన్నర్ చేస్తూ మాట్లాడుకోగా బిల్లు చాలా తక్కువ వచ్చిందని, అక్కడ అమెరికా అధ్యక్షుడు ఉన్నారన్న ఆలోచన కూడా లేకుండా చుట్టుపక్కల వారు తమ పని తాము చేసుకు వెళ్లారని ఆంథోనీ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. ఒబామా బీర్ తాగుతున్న ఫోటోను పోస్ట్ చేశారు.

కాగా ఒబామా అమెరికా అధ్యక్షుడైన తరువాత ప్రపంచంతో, సాధారణ ప్రజలతో ఆయన వ్యవహరించే తీరు గత అధ్యక్షుల కంటే ఎంతో భిన్నమన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రజలతో కలిసిపోవడం.. ప్రపంచ దేశాల అధ్యక్షులతో సంబంధాలు మెంటైన్ చేయడంలో ఒబామా తనదైన ముద్ర వేశారు. తాజాగా తన పదవీ కాలం చివరి దశలో ఇలా ఒక సాధారణ జర్నలిస్టుతో రోడ్డు పక్క హోటల్లో భోజనం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చిన్న నీలిరంగు ప్లాస్టిక్ స్టూల్ పై కూర్చుని ఒబామా డిన్నర్ చేస్తున్న చిత్రాలను ఆంథోనీ సోషల్ మీడియాలో పోస్టు చేయగా ప్రపంచం ఆశ్చర్యానికి లోనవుతోంది.