Begin typing your search above and press return to search.

రష్యాపై రివెంజ్ తీర్చుకుంటానంటున్న ఒబామా

By:  Tupaki Desk   |   17 Dec 2016 9:23 AM GMT
రష్యాపై రివెంజ్ తీర్చుకుంటానంటున్న ఒబామా
X
మొన్న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆ దేశ చరిత్రలో ముందెన్నడూ లేనంతగా ప్రతిష్టను దిగజార్చాయి. ఎప్పుడూ హుందాగా సాగే ఎన్నికలకు భిన్నంగా హిల్లరీ - ట్రంప్ లు పరమ దారుణంగా వ్యవహరిస్తూ రచ్చరచ్చ చేశారు. అంతేకాదు... వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవడంతోపాటు ఎన్నికల వ్యవస్థపైనా ఆరోపణలు చేశారు. తాను కనుక ఓడిపోతే హిల్లరీ రిగ్గింగ్ చేసినట్లే భావిస్తానని ట్రంప్ అన్నారు.. అదేసమయంలో రష్యాతో హ్యాకింగ్ చేయించి ట్రంప్ ఫలితాలను తనకు అనుకూలంగా మార్చుకున్నారని డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు. అయితే... ఓటింగ్ పూర్తయి నెల రోజులు దాటినా ఇంకా అక్కడ రచ్చ ఆగలేదు. ఈ నెల 19న సభ ఆమోదం పొందాల్సిన నేపథ్యంలో మరోసారి అక్కడ వాతావరణం హాట్ హాట్ గా మారుతోంది.

రష్యా తమ దేశ ఎన్నికల్లో జోక్యం చేసుకుందని డెమొక్రాట్లు బలంగా నమ్ముతున్నారు. ట్రంప్ - పుతిన్ కలిసి నాటకం ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు. తాజాగా ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రష్యాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నందుకు ఆ దేశం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బహిరంగంగా, రహస్యంగా రష్యాపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతినబూనారు. అమెరికా ఎన్నికల సమగ్రతపై ప్రభావం చూపేందుకు కొన్ని విదేశీ ప్రభుత్వాలు ప్రయత్నించాయనడంలో ఎటువంటి సందేహం లేదని ఓ ఇంటర్వ్యూలో ఒబామా పేర్కొన్నారు. దీనిపై తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందేనని నొక్కి చెప్పారు. సైబర్ దాడులపై తన అభిప్రాయాలేమిటో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు తెలుసన్నారు. తాను నేరుగా ఆయనతోనే మాట్లాడానని ఒబామా చెప్పారు.

కాగా సైబర్‌ దాడుల ద్వారా రష్యా.. అమెరికా ఎన్నికలకను శాసించినట్లు దాదాపుగా నిర్ధారణ అయిందని చెబుతున్నారు. అమెరికా వ్యవస్థలను రష్యా హ్యాక్‌ చేసి ట్రంప్‌ కు అనుకూలంగా వ్యవహరించిందని అక్కడి నిఘా సంస్థలు నిర్ధారించాయి. దీనిపై ఫైనల్ రిపోర్టు రెడీ చేస్తున్నాయి. మరోవైపు ఒబామా జనవరి 20న శ్వేతసౌధాన్ని వీడనున్నారు. ఆలోపు తమకు రష్యా సైబర్‌ దాడులపై పూర్తి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని దర్యాప్తు, నిఘా సంస్థలను ఆదేశించారు. అయితే, ట్రంప్.. రష్యాలు మాత్రం ఈ ఆరోపణలను తిప్పికొడుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/