Begin typing your search above and press return to search.

గమనించారా: బెంగాల్ ఫార్ములాను తెలంగాణలో రిపీట్ చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   15 Feb 2022 7:44 AM GMT
గమనించారా: బెంగాల్ ఫార్ములాను తెలంగాణలో రిపీట్ చేస్తున్నారా?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్లో తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. కొన్ని విషయాల్లో ఎంత దూకుడుగా వ్యవహరిస్తారో.. మరికొన్ని అంశాల్లో అంతే ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తారు. బలమైన ప్రత్యర్థితో గోక్కోవటానికి గులాబీ బాస్ పెద్దగా ఇష్టపడరు. తనకు సానుకూల వాతావరణం లేదని భావించినప్పుడు బయటకు రావటానికి కూడా ఇష్టపడని ఆయన.. అవసరం లేనప్పుడు తనకుతానే బయటకు వచ్చేసి మరీ ఎజెండాను డిసైడ్ చేయటం కేసీఆర్ కు అలవాటే.

తాజాగా మోడీ సర్కారు మీద ఆయన విరుచుకుపడటం ఒక ఎత్తు అయితే.. గతంలో మమతతో పొసగని కేసీఆర్.. తాజాగా ఆమెతో పాటు మరికొందరు నేతలతో కలిసి జాతీయస్థాయిలో కూటమిని ఏర్పాటు చేసే అంశంపై మహా దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా కేసీఆర్ మాటలు విన్నప్పుడు.. మోడీ సర్కారు చేస్తున్న తప్పుల్ని ఏకరువు పెడుతున్నప్పుడు.. ఎనిమిదేళ్లుగా ఎందుకు మాట్లాడలేదన్న ప్రశ్న మదిలోకి రావటం ఖాయం. ఇంతకాలం మౌనంగా ఉన్న ఆయన ఇప్పుడు అందుకు భిన్నంగా ఎందుకు విరుచుకుపడుతున్నారన్న దానికి తాజాగా సమాధానం లభిస్తోంది. ఇటీవల కాలంలో ఆయన పీకేతో జత కట్టటం.. ఆయనకు వ్యూహర్తగా పీకే టీం పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

దీనికి తగ్గట్లే.. తాజా ప్రెస్ మీట్ లోనూ కేసీఆర్ నోట పీకే ప్రస్తావన రావటం.. వారు చేసే సర్వే రిపోర్టులను తాను చూడనున్నట్లు చెప్పటం చూస్తే.. కన్ఫర్మ్ గా కేసీఆర్ కు పీకేకు లంకె కుదిరిందని చెప్పక తప్పదు.

అంతేకాదు.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఏ రీతిలో అయితే మోడీ సర్కారుపై విరుచుకుపడుతూ.. బెంగాలీల భావోద్వేగాన్ని తట్టి లేపి తనకు అనుకూలంగా ఎన్నికల ఫలితాలు వచ్చేలా చేసుకున్నారో.. తాజాగా అదే ఫార్ములాను తెలంగాణలో రిపీట్ చేయాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. మోడీ వ్యతిరేకత.. తెలంగాణకు కేంద్రం ఏమీ చేయటం లేదన్న అంశంతో పాటు.. భావోద్వేగ వాతావరణాన్ని తీసుకురావటం ద్వారా తెలంగాణలో తనకున్న వ్యతిరేకతను అధిగమించాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ తరహా ఎమోషన్ గేమ్ ను ఆడటంలో ఎంతో ఈజ్ ప్రదర్శించే పీకే ఛాయలు.. కేసీఆర్ తాజా దూకుడులో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. బెంగాల్ లో మమత ఫాలో అయినా ఫార్మాలను తెలంగాణలో అమలు చేయటం ద్వారా.. ముచ్చటగామూడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలన్నది కేసీఆర్ అసలు ప్లాన్ గా చెబుతున్నారు. అదే సమయంలో మోడీ వ్యతిరేకతను జాతీయ స్థాయిలో జట్టు కట్టి.. తాము అనుకున్నట్లుగా ఫలితాల్ని రప్పించగలిగితే.. వచ్చేదంతా బోనస్సే అవుతుందని చెప్పాలి. మరి.. ఈ వాదనలో వాస్తవం ఎంతన్న విషయం కాలం సమాధానం చెబుతుందని చెప్పక తప్పదు.