Begin typing your search above and press return to search.

కొత్త డిమాండ్: ఓసీల‌కు రిజ‌ర్వేషన్‌ లు

By:  Tupaki Desk   |   25 July 2016 4:04 PM GMT
కొత్త డిమాండ్: ఓసీల‌కు రిజ‌ర్వేషన్‌ లు
X
రిజ‌ర్వేష‌న్ పోరాటాల్లో కొత్త ఒర‌వ‌డి మొద‌ల‌యింది. అగ్రకులాల రిజర్వేషన్ల వ్యవహారంపై జాతీయ స్థాయి చర్చ మొదలుకానుంది. వివిధ రాష్ట్రాల్లో - వివిధ పేర్లతో ఉన్న ఓసీ సంఘాలు - రిజర్వేషన్ పోరాట సంఘాలన్నీ ఒకేతాటిపైకి వ‌చ్చి రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రకులాలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండుతో - సర్కారుపై పోరాటానికి సిద్ధమవుతున్నాయి. అందుకు ఢిల్లీ వేదిక కానుంది.

ఇప్ప‌టికే ప‌లు రాష్ర్టాల్లో - ఆయా కులాల వారు త‌మ‌ను ఓబీసీ జాబితాల్లో క‌ల‌పాలని డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఓసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యాన ఈనెల 29 - 30వ తేదీల్లో ఢిల్లీ వేదికగా అగ్రకుల సమస్యలపై జాతీయ సదస్సు జరగనుంది. జాట్లు - పటేళ్లు - గుజ్జర్లు - కాపులకు రిజర్వేషన్లపై జాతీయ సదస్సు చర్చించనుంది. ఇప్పటికే ఏపీ - గుజరాత్ - రాజస్థాన్ - హర్యానా - ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఆయా ప్రభుత్వాలు ప్రకటించాయి. అయితే, అవి ఇప్పటివరకూ కార్యరూపం దాల్చకపోవడంతో ఆందోళనలు చెలరేగుతున్నాయి. గుజ్జర్లు - పటేళ్లు - కాపుల ఆందోళన హింసకు దారితీసిన విషయం తెలిసిందే. పటేళ్ల నాయకుడు హార్దిక్ పటేల్ ఇటీవలే జైలు నుంచి విడుదలవగా - ఏపి లో కాపుల రిజర్వేషన్ల కోసం దీక్ష చేసిన ముద్రగడ పద్మనాభం కూడా - ఆసుపత్రిలోనే ఆమరణ నిరాహారదీక్ష కొనసాగించారు. గుజ్జర్లయితే రైళ్ల వ్యవస్థను నిలిపివేశారు. ఈ విధంగా వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న ఓసీల ప్రత్యేక పరిస్థితులను జాతీయ స్థాయిలో చర్చించడం ద్వారా - జాతీయ దృష్టిని ఆకర్షించి - ప్రభుత్వాలకు హెచ్చరిక సంకేతం పంపాలని ఓసీ సంక్షేమ సంఘం నిర్ణయించింది.

ఓసీలకు రిజర్వేషన్లు ప్రకటించడం వల్ల ఉపయోగం లేకుండా పోతోందని - న్యాయపరమైన కారణాలతో అవి కోర్టులో వీగిపోతున్నందున - రాజ్యాంగసవరణ చేయాల్సి ఉందన్న డిమాండుతో జాతీయ సదస్సు నిర్వహించనున్నామని ఓసీ సంక్షేమ సంఘం నేత‌లు చెప్తున్నారు. ‘ఏపీలో కూడా ఓసీ కార్పొరేషన్ పెడతామని బాబు మహానాడులో ప్రకటించారు. కానీ ఇప్పటిదాకా పెట్టలేదు. ఇప్పటివరకూ బ్రాహ్మణ - కాపు కార్పొరేషన్ పెట్టడం వల్ల ఆయా కులాల వారికి ప్రయోజనం జరగడం మంచిదే. కానీ ఓసీ కార్పొరేషన్‌ తో పాటు ఓసీలకూ రిజర్వేషన్లు ఇస్తేనే వారికి మనుగడ ఉంటుంది’ అని ఆ సంఘం నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు.