Begin typing your search above and press return to search.

వీరికే.. ఢిల్లీ కాలుష్య మినహాయింపులు

By:  Tupaki Desk   |   24 Dec 2015 10:06 AM GMT
వీరికే.. ఢిల్లీ కాలుష్య మినహాయింపులు
X
దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిపోతున్న వాయుకాలుష్యానికి చెక్ చెప్పేందుకు వీలుగా వాహనాల మీద ఆంక్షలు పెడుతున్న సంగతి తెలిసిందే. జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న ఈ ఆంక్షలకు సంబంధించి వాహనదారుల చివరి అంకెలు సరి అయితే ఒకరోజు.. బేసి అయితే మరో రోజు రోడ్ల మీదకు అనుమతించాలని ఢిల్లీ రాష్ట్ర సర్కారు అధికారికంగా నిర్ణయించటం తెలిసిందే. అయితే.. దీనికి సంబంధించిన కొన్ని మినహాయింపుల్ని ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా ప్రకటించారు.

ఢిల్లీ మహానగరంలో సరి బేసి విధానాన్న జనవరి 1 నుంచి అమలు చేస్తామన్నారు. అయితే.. మొదటి 15 రోజులు మాత్రం కొన్ని వర్గాల వారికి మినహాయింపులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 12 ఏళ్ల లోపు పిల్లలు ఉన్న మహిళలకు.. ఒంటరి మహిళలకు.. వీఐపీలకు 15 రోజులు ఈ విధానం నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి అయిన తనకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

ఇక వీవీఐపీల్లోని రాష్ట్రపతి.. ఉప రాష్ట్రపతి.. ప్రధాని.. గవర్నర్లు.. చీఫ్ జస్టిస్.. లోక్ సభ స్పీకర్.. రాజ్యసభ ఛైర్మన్.. కేంద్రమంత్రులు.. ప్రతిపక్ష పార్టీ అధినేతలు.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు.. డిప్యూటీ స్పీకర్లు వీఐపీ జాబితాలో ఉంటారని.. వీరికి మినహాయింపులు వర్తిస్తాయని చెప్పారు. ఇక.. అత్యవసర వాహనాలకు కూడా ఈ నిబంధన వర్తించదని చెప్పారు.