Begin typing your search above and press return to search.

బ్రేకింగ్... ఏపీకి నూతన గవర్నర్ గా హరిచందన్

By:  Tupaki Desk   |   16 July 2019 12:43 PM GMT
బ్రేకింగ్... ఏపీకి నూతన గవర్నర్ గా హరిచందన్
X
ఈ వార్త నిజంగా బ్రేకింగేనని చెప్పాలి. ఇప్పటిదాకా రెండు తెలుగు రాష్ట్రాలకు ఓకే గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహన్ కొనసాగుతూ వస్తుంటే... ఇప్పుడు అనూహ్యంగా ఆయనను ఏపీ నుంచి తప్పించేశారు. ఏపీకి కొత్త గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ ను నియమిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒడిశాకు చెందిన హరిచందన్... బీజేపీలో కొనసాగుతున్నారు. ఒడిశా శాసన సభకు పలుమార్లు ఎంపికైన హరిచందన్.... ఒడిశా మినహా పెద్దగా పరిచయం లేని నేత కిందే లెక్క. బీజేపీ నేతగా, ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఓడిశా ప్రజలకు చిరపరచితులైనా... దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలకు ఆయన పెద్దగా తెలయరనే చెప్పాలి. ఒడిశా శాసనసభకు ఐదు సార్లు ఎన్నికైన హరిచందన్... అక్కడ బీజేపీ అధికారంలో లేకపోవడంతో మంత్రి పదవి అవకాశం కూడా దక్కలేదనే చెప్పాలి. 1977లో రాజకీయ ప్రస్థానం మొదలెట్టిన హరిచందన్.... 2004లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇదిలా ఉంటే... తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా కొనసాగుతున్న నరసింహన్ సుదీర్ఘ కాలం గవర్నర్ గా కొనసాగారు. రాష్ట్ర విభజనకు ముందు పదవీ బాధ్యతలు చేపట్టిన నరసింహన్... రాష్ట్రం రెండు ముక్కలైనా, కేంద్రంలో యూపీఏ అధికారం కోల్పోయి ఎన్డీఏ పాలనా పగ్గాలు చేపట్టినా కూడా గవర్నర్ గా నరసింహనే కొనసాగారు. తాజాగా ముగిసిన సార్వత్రిక ఎన్నికల తర్వాత నరసింహన్ ను తప్పిస్తారని ప్రచారం జరుగుతున్నా... ఆ దిశగా కేంద్రం చర్యలు చేపట్టిన దాఖలా కనిపించలేదు. అయితే అనూహ్యంగా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే గవర్నర్ ను ఏపీ గవర్నర్ గా తొలగిస్తూ మోదీ సర్కారు నిర్ణయం తీసుకుంది. నరసింహన్ స్థానంలో కొత్తగా బిశ్వభూషణ్ హరిచందన్ ను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్రం ప్రతిపాదనలను అనుగుణంగా కాసేపటి క్రితం హరిచందన్ ను ఏపీ గవర్నర్ గా నియమిస్తున్నట్లుగా రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది.