Begin typing your search above and press return to search.

మోడీ అండ్ కో ఒడిశా మాట విన్నారా?

By:  Tupaki Desk   |   31 Aug 2018 5:15 AM GMT
మోడీ అండ్ కో ఒడిశా మాట విన్నారా?
X
ఏపీ విష‌యంలో మొద‌ట్నించి తేడా వ్య‌వ‌హ‌రిస్తున్న ప్ర‌ధాని మోడీ మాయ మ‌రోసారి బ‌ద్ధ‌లైంది. విభ‌జ‌న సంద‌ర్భంగా ఏపీకి ఇచ్చిన హామీల‌న్నింటిని అమ‌లు చేసే విష‌యంలో ఏదో ఒక సాకును చూపిస్తున్న కేంద్రం.. ప్ర‌తి విష‌యంలోనూ కొర్రీ పెట్టేది. ఒక‌వేళ అమ‌లు త‌ప్ప‌ద‌న్న అంశాలకు సంబంధించి తూతూ మంత్రంగా అమ‌ల‌య్యేలా చేసేది.

కీల‌క‌మైన హోదా విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌ట‌మే కాదు.. ఎంత ఒత్తిడి తెచ్చినా ఇచ్చేది లేద‌ని తేల్చేసిన మోడీ స‌ర్కారు.. విశాఖ అభివృద్ధికి కీల‌క‌మైన రైల్వే జోన్ విష‌యంలోనూ అదే విధానాన్ని అమ‌లు చేసింది. ఎవ‌రైనా జోన్ గురించి గ‌ట్టిగా ప్ర‌శ్నిస్తే.. ఒడిశా అభ్యంత‌రం చెబుతోంద‌ని.. అందుకే తాము జోన్ విష‌యాన్ని తేల్చ‌లేక‌పోతున్న‌ట్లుగా పేర్కొనేది.

ఇలాంటి మాట‌ల‌తో నాలుగున్న‌రేళ్లుగా కాలం గడుపుతున్న కేంద్రానికి షాకిస్తూ.. ఒడిశా అధికార ప‌క్ష ఎంపీ ఒక‌రు తాజాగా చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. విశాఖ‌కు రైల్వే జోన్ కేటాయిస్తే తాము అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌మ‌ని.. జోన్ ఇస్తే త‌మ‌కు ఇబ్బంది లేద‌ని తేల్చేశారు బీజేపీ ఎంపీ ప‌ట్ సానీ.

తాజాగా జ‌రిగిన హోం శాఖ పార్ల‌మెంట‌రీ స్థాయి సంఘం విభ‌జ‌న హామీల అమ‌లుకు సంబంధించి స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా విశాఖ‌కు రైల్వే జోన్ అంశం ప‌రిశీల‌న‌లో ఉంద‌ని అధికారులు చెప్పారు. దీనిపై స్పందించిన బీజేడీ ఎంపీ ప‌ట్ సానీ రియాక్ట్ అవుతూ.. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై మాకు ఎలాంటి అభ్యంత‌రం లేదు.. జోన్ ఇచ్చేయండ‌ని పేర్కొన్నారు. దీంతో.. శ్రీ‌కాకుళం ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు స్పందిస్తూ.. ఇంత‌కాలం ఒడిశా జోన్ కు అభ్యంత‌రం చెబుతుంద‌న్న సాకు చూపించార‌ని.. ఇప్పుడు ఆ రాష్ట్రమే ఓకే చెబుతుంద‌న్నారు. జోన్ ఇచ్చేయాల‌ని.. ఈ అంశంపై సానుకూలంగా స్పందించాల‌ని కోరిన‌ట్లుగా తెలుస్తోంది. జోన్ పై ఒడిశా ఎంపీ త‌మ‌కు ఎలాంటి ఇబ్బంది లేద‌ని తేల్చేసిన నేప‌థ్యంలో ఏపీ స‌ర్కారు ఈ విష‌యాన్ని మ‌రింత బ‌లంగా ప్ర‌స్తావించాల్సిన అవ‌స‌రం ఉంది. మ‌రి.. తెలుగు త‌మ్ముళ్లు ఏం చేస్తారో చూడాలి.