Begin typing your search above and press return to search.

ఫ‌ణి ఎఫెక్ట్‌!..ఒడిశా కూడా ఏపీ రూట్లోకొచ్చేసింది!

By:  Tupaki Desk   |   13 May 2019 5:30 PM GMT
ఫ‌ణి ఎఫెక్ట్‌!..ఒడిశా కూడా ఏపీ రూట్లోకొచ్చేసింది!
X
మొన్న తీర ప్రాంతాల‌ను వ‌ణికించిన ఫ‌ణి తుఫాను ఏపీని పెద్ద‌గా ప్ర‌భావితం చేయ‌కున్నా... ఒడిశాను మాత్రం అత‌లాకుత‌లం చేసేసింది. తుఫాను ముంద‌స్తు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో ఎంత ఎఫెక్టివ్ గా ఉన్న‌ప్ప‌టికీ ఫ‌ణి తుఫాను కార‌ణంగా ఒడిశా విల‌విల్లాడిపోయింది. ఈ నేప‌థ్యంలో ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ ఇప్పుడు ప్ర‌త్యేక హోదాపై గ‌ళాన్ని మ‌రింత‌గా పెంచేశారు. ఇప్పుడైతే ఫ‌ణి గానీ... గ‌డ‌చిన ఐదేళ్ల‌లోనే ఫ‌ణితో పాటు ఫైలిన్‌ - హుదూద్‌ - తీత‌లీ పేరిట ఏకంగా నాలుగు తుఫాన్లు ఒడిశాను చుట్టుముట్టేసిన సంగ‌తి తెలిసిందే. అంటే... ఓ ఏడాదిలో జ‌రిగిన న‌ష్టాన్ని పూడ్చుకునేలోగానే మ‌రో తుఫాను విరుచుకుప‌డుతుంద‌న్న మాట‌.

ఇలాగైతే ఆ రాష్ట్రం అభివృద్ధి సాధించేదెలా? ఇదే కోణంలో ఆలోచించిన ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ కేంద్ర ప్ర‌భుత్వానికి తాజాగా ఓ ప్ర‌తిపాద‌న పంపారు. ఏటా తుఫాన్ల బారిన ప‌డుతున్న ఒడిశాకు త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌త్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేన‌న్న‌ది ఆ ప్ర‌తిపాద‌న సారాంశం. ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఇప్ప‌టికే ఏపీ... కేంద్రంపై త‌న‌దైన శైలి పోరాటాన్ని సాగిస్తోంది. తెలుగు నేల విభ‌జ‌న త‌ర్వాత ఆస్తుల‌న్నీ తెలంగాణ‌కు ఇచ్చేసి నిధులు లేని రాష్ట్రంగా ఏర్పాటు చేసిన న‌వ్యాంధ్ర త్వ‌రిత‌గ‌తిన కోలుకోవాలంటే ప్ర‌త్యేక హోదా మిన‌హాయించి మ‌రో ప్ర‌త్యామ్నాయం లేద‌న్న‌ది ఏపీ ప్ర‌జ‌ల‌తో పాటు ఆ రాష్ట్రంలోని దాదాపుగా అన్ని రాజ‌కీయ పార్టీల వాద‌న.

ఇదే వాద‌న‌తో విప‌క్ష వైసీపీ ఆది నుంచి త‌న‌దైన శైలి పోరాటంతో ప్ర‌త్యేక హోదా డిమాండ్ ను స‌జీవంగా ఉంచితే... ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేద‌న్న కార‌ణంతోనే అధికార టీడీపీ... ఎన్డీఏ కూట‌మి నుంచి బ‌య‌ట‌కు రావ‌డంతో పాటుగా బీజేపీతో ఉన్న మైత్రికి చ‌ర‌మ గీతం పాడేసింది. మొత్తంగా ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ సాధ‌న‌లో ఇప్పుడు ఏపీలోని అన్ని పార్టీలు కూడా త‌మ త‌మ వ్యూహాల‌ను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో తుఫాన్ల దెబ్బ‌ల‌ను చూపుతూ ఒడిశా కూడా ఇప్పుడు ప్ర‌త్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేసింది. మ‌రి కేంద్రం ఏమంటుందో చూడాలి.