Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్లు పంపండి.. ఆయిల్ ఇస్తాం.. వెనెజులా అధ్యక్షుడి ఆఫర్..!

By:  Tupaki Desk   |   30 March 2021 3:30 AM GMT
వ్యాక్సిన్లు పంపండి.. ఆయిల్ ఇస్తాం.. వెనెజులా అధ్యక్షుడి ఆఫర్..!
X
కరోనా మహమ్మారి ఎన్నో దేశాలను అతలాకుతలం చేసింది. కరోనా కారణంగా విధించిన ఆంక్షలతో వ్యాపారాలు ఆగిపోయి, ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయి ఎన్నో దేశాలు నష్టాలపాలయ్యాయి. వెనెజులా దేశం కూడా కరోనా కారణంగా నష్టపోయి ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తో పాటు కొత్త కొత్త వేరియంట్ల కరోనా వ్యాప్తి చెందుతుండడంతో పలు దేశాల్లో మళ్లీ కరోనా ఆంక్షలు విధించారు. కాగా అమెరికా, రష్యా,చైనా, భారత్ వంటి దేశాలు వ్యాక్సిన్లను సిద్ధం చేసి తమ దేశ ప్రజలకు పంపిణీ కూడా ప్రారంభించాయి.

కాగా వెనెజులా దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో కరోనా కేసులతో అల్లాడుతున్న తమ దేశానికి వ్యాక్సిన్లు అందజేస్తే అందుకు బదులుగా ఆయిల్ ఇస్తామని ప్రకటన చేశాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చాలా పేద దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేస్తోందని, తమకు కూడా ఏ దేశం నుంచైనా వ్యాక్సిన్లను అందజేయిస్తే అందుకు బదులుగా ఆయిల్ ఇస్తామని మదురో ప్రతిపాదన తెచ్చాడు. కరోనా ఆంక్షల కారణంగా తమ దేశం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన 'వీ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఆయిల్ ఫర్ వ్యాక్సిన్స్ ' అని ప్రకటించారు. అలా అని తాము ఎవరినీ అడుక్కోబోమని ఆయన అన్నారు.

వెనెజులా తమ మిత్ర దేశాలైన రష్యా చైనా నుంచి ఇప్పటికే వ్యాక్సిన్లను పొందింది. వ్యాక్సిన్ ల పంపిణీ కూడా ప్రారంభించారు. అయితే ఆ రెండు దేశాలు అందించిన డోసులు వెనెజులా దేశ ప్రజలందరికీ సరిపోవడం లేదు. దీంతో మరో మార్గం కోసం వెనెజులా దేశాధ్యక్షుడు మదురో అన్వేషణ సాగిస్తున్నారు. సొంతంగా వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం లేకపోవడంతో ఆ దేశం ఇతర దేశాల సాయం పై ఆధారపడాల్సి వచ్చింది. అందువల్లే ఆ దేశాధ్యక్షుడు ఈ ప్రతిపాదన తీసుకువచ్చారు.