Begin typing your search above and press return to search.

జోరుమీదున్న ఆఫీస్ స్పేస్ వ్యాపారం !

By:  Tupaki Desk   |   24 Dec 2019 6:52 AM GMT
జోరుమీదున్న ఆఫీస్ స్పేస్ వ్యాపారం !
X
ప్రస్తుతం దేశంలో పెట్టుబడులుపెట్టే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. వారికీ తగ్గట్టే ఖాళీ స్థలాలని అమర్చే ఆఫీస్‌ స్పేస్‌ వ్యాపారానికి కూడా డిమాండ్ బాగా పెరిగింది. గత ఏడాదితో పోల్చితే నికరంగా కంపెనీలు అద్దెకు తీసుకున్న ఆఫీస్‌ ప్రదేశం 40 శాతం పెరిగింది. ఏడాదికాలంలో ఏడు ప్రధాన నగరాల్లో 4.65 కోట్ల చదరపు అడుగుల ప్రదేశాన్ని పలు కంపెనీలు తమ ఆఫీసుల కోసం అద్దెకు తీసుకున్నాయి. ఐటీ, ఐటీ ఈఎస్‌ కంపెనీలతోపాటు కోవర్కింగ్‌ నిర్వాహకుల నుంచి అధిక డిమాండ్‌ ఏర్పడినట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్‌ జేఎల్‌ ఎల్‌ ఇండియా తెలిపింది

2018 సంవత్సరంలో ఏడు ప్రధాన నగరాల్లో ..హైదరాబాద్‌, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబై, బెంగళూరు, చెన్నై, పుణే, కోల్‌కతా.. కంపెనీలు అద్దెకు తీసుకున్న ఆఫీస్‌ స్పేస్‌ 3.32 కోట్ల చదరపు అడుగులుగా ఉంది అని తెలిపింది. ‘భారత ఆఫీస్‌ మార్కెట్‌ సరికొత్త బెంచ్‌మార్క్‌ను ఏర్పరిచింది. నికరంగా అద్దెకు తీసుకున్న ఆఫీస్‌ ప్రదేశంలోనేకాకుండా కొత్తగా పూర్తి చేసిన వాటిలోనూ చరిత్రాత్మక గరిష్ఠ స్థాయి నమోదైంది. 2019 సంవత్సరంలో దాదాపు 5.2 కోట్ల చదరపు అడుగుల గ్రేడ్‌ ఏ ఆఫీస్‌ ప్రదేశం పూర్తయింది అని జేఎల్‌ ఎల్‌ వెల్లడించింది. ప్రస్తుత లెక్కల ప్రకారం ఆఫీస్‌ ప్రదేశం కొత్త సప్లయ్‌ 45 శాతం పెరిగి 3.57 కోట్ల చదరపు అడుగుల నుంచి 5.16 కోట్ల చదరపు అడుగులకు చేరుకుంది. ఖాళీగా ఉన్న ఆఫీస్‌ ప్రదేశం 13 శాతం తగ్గింది.

ఐటీ/ఐటీఈఎస్‌ కంపెనీలు, కోవర్కింగ్‌ ఆపరేటర్ల వల్ల ఈ నగరాల్లో ఆఫీస్‌ ప్రదేశానికి డిమాండ్‌ ఏర్పడింది. అద్దెకు తీసుకున్న ప్రదేశంలో ఐటీ/ఐటీఈఎస్‌ రంగం వాటా 42 శాతం ఉండగా.. కోవర్కింగ్‌ ఆపరేటర్ల వాటా 14 శాతంగా ఉంది. అలాగే ఈ ఏడాదిలో నికరంగా అద్దెకు తీసుకున్న ఆఫీస్‌ ప్రదేశంలో ఢిల్లీ-ఎన్‌ సీఆర్‌, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల వాటా దాదాపు 70 శాతంగా ఉంది.హైదరాబాద్‌లో 1.05 కోట్ల చదరపు అడుగులు అద్దెకు తీసుకోవడం గమనార్హం. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికం లోనే 50 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. అలాగే ఢిల్లీ-ఎన్‌ సీఆర్‌ మార్కెట్లో రికార్డు స్థాయిలో దాదాపు 1.1 కోట్ల చదరపు అడుగుల స్థలాన్ని ఆఫీసుల కోసం కంపెనీలు అద్దెకు తీసుకున్నాయి. రీట్స్‌ నేపథ్యంలో డెవలపర్లు మరింత నాణ్యమైన ఆఫీస్‌ ప్రదేశాలను అభివృద్ధి చేసే అవకాశం ఉందని జేఎల్‌ ఎల్‌ ఇండియా సీఈఓ, కంట్రీ హెడ్‌ రమేష్‌ నాయర్‌ తెలిపారు.